ఇక్కడ ఫ్లైఓవర్ కట్టాలనే నిర్ణయం విరమించుకోవాలి : ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
ఎల్బీనగర్:
మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు…కానీ ప్రజలకు అపకారం, నష్టం, కలిగించే నిర్ణయాలకు మాత్రమే వ్యతిరేకం. అవసరం ఉన్న చోట ఫ్లైఓవర్ నిర్మించాలి కానీ అవసరం లేని చోట ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సూచించారు.మంగళవారం చంపాపేట్ డివిజన్ పరిధిలోని ఓవైసీ హాస్పిటల్ నుండి కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం వెళ్లే ప్రధాన రహదారిపై నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక కాలనీవాసులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ,టీకేఆర్ కమాన్ చౌరస్తా నుండి ఓవైసీ హాస్పిటల్ చౌరస్తా వరకు ఆరు లైన్ల రోడ్డు విస్తరణ పేరిట సుమారు 240 ఇండ్ల యజమానులకు నోటీసులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. నూతన ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న తమ నివాసాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని వాపోయారు.ప్రస్తుతం 150 ఫీట్ల ఇన్నర్ రింగ్ రోడ్ అందుబాటులో ఉండగా, మరో 25 ఫీట్ల రోడ్డు విస్తరణ అవసరం ఏమిటని ప్రశ్నించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుత ఈ రహదారి చక్కటి సదుపాయాలతోనే రాబోయే 25 సంవత్సరాల పాటు ట్రాఫిక్ సమస్యలు ఉండని విధంగా ఉందని తెలిపారు. ఈ ప్రాంతంలో ఫ్లైఓవర్ అవసరం లేదని స్పష్టం చేశారు.అయితే బండ్లగూడ ఆనంద నగర్ చౌరస్తా, హస్తినాపురం చౌరస్తా వద్ద తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఉన్నప్పటికీ అక్కడ ఫ్లైఓవర్ మంజూరు చేయకుండా ఇక్కడ ప్రతిపాదించడం సరైన నిర్ణయం కాదన్నారు.ఈ ఫ్లైఓవర్ ప్రతిపాదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ప్రజలకు న్యాయం జరిగేలా ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం విరమింపచేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
