హైడ్రా ముందు అమీన్‌పూర్ బాధితుల ఆర్తనాదం
- ముఖీం అనుచరుల చేతిలో మోసపోయాం.. మాకు న్యాయం చేయండి
- ‘హైడ్రా’ ప్రజావాణిలో పేదల మొర
హైదరాబాద్:
"వందల మందరం.. అందరం ముఖీం అనుచరుల చేతిలో మోసపోయాం. 'పెద్ద లాయర్ మా వెనుక ఉన్నారు, మీకేం కాదు.. మేము చూసుకుంటాం' అని నమ్మబలికి మాకు 70 గజాల చొప్పున ప్లాట్లు అమ్మేశారు. అది ప్రభుత్వ భూమి అని మాకు తెలియదు. అందరూ కొంటున్నారు కదా అని మేమూ కొన్నాం. ఇప్పుడు వారిని నిలదీస్తే.. 'మాకేం తెలియదు, ఖాళీ స్థలం ఉంచొద్దు వెంటనే ఇల్లు కట్టుకోమని చెప్పినా మీరు వినలేదు' అంటూ తిరిగి మమ్మల్నే దబాయిస్తున్నారు. మా డబ్బులు మాకు ఇచ్చేయమని అడిగితే.. ఎప్పుడో ఎవరి వాటాలు వారికి వెళ్లిపోయాయి, మా దగ్గర లేవు అని తప్పించుకుంటున్నారు. నోటరీలు, అగ్రిమెంట్ పత్రాలను పరిశీలించి ప్రభుత్వమే మాకు న్యాయం చేయాలి" అంటూ అమీన్‌పూర్ బాధితులు సోమవారం ‘హైడ్రా’ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
కురుమ మల్లేష్, మాణిక్ యాదవ్, రవి నాయక్, రామచంద్ర నాయక్ తదితరులు ముఖీం అనుచరులుగా వేర్వేరు పేర్లతో అగ్రిమెంట్లు, నోటరీలు చేసి తమకు భూములు విక్రయించారని బాధితులు పేర్కొన్నారు. కూలీ పనులు చేస్తూ, చిట్టీలు వేసుకుని, గ్రామాల్లో ఉన్న కొద్దిపాటి పొలాన్ని అమ్ముకుని ప్లాట్లు కొన్నామని, ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
కబ్జాలపై ఫిర్యాదుల వెల్లువ
నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ, యూఎల్సీ, అసైన్డ్ భూములు కబ్జాలకు గురవుతున్నాయంటూ ప్రజావాణికి భారీగా ఫిర్యాదులు అందాయి.
* *దుండిగల్:* ఔటర్ రింగురోడ్డు నిర్మాణ సమయంలో సేకరించిన అసైన్డ్ భూముల్లో మట్టిని అమ్ముకున్న వారే, ఇప్పుడు ఆ భూములను కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని దుండిగల్ గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. ఆ భూములు అసైనీలకు దక్కాలి లేదా ప్రభుత్వం వద్ద ఉండాలి కానీ, కబ్జాదారుల పాలు కావొద్దని కోరారు.
* *బ్లూ సీ హోటల్ ప్రాంతం:* సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని బ్లూ సీ హోటల్ వెనుక ఉన్న రెండెకరాల ప్రభుత్వ భూమిని కాపాడాలని స్థానికులు కోరారు. ఆ భూమి కోసం కొందరు పరస్పరం కేసులు వేసుకుంటూ కాలయాపన చేస్తున్నారని, అక్కడ పార్కును అభివృద్ధి చేయాలని విన్నవించారు.
* *బాచుపల్లి:* మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి సర్వే నంబరు 54లోని రెండెకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతోందని ఫిర్యాదు అందింది.
* *మియాపూర్:* శేరిలింగంపల్లి మండలం మియాపూర్ సర్వే నంబరు 100, 101లోని ఎకరం ప్రభుత్వ భూమిని స్థానికులు కబ్జా చేస్తున్నారని ‘శ్రీ శక్తి మహిళా మండలి’ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.
* *బేగంపేట:* బ్రాహ్మణవాడి సర్వే నంబరు 210లోని 3 వేల గజాల ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
* *సైదాబాద్:* ఫిష్ మార్కెట్ వద్ద ఉన్న 4,083 గజాల ఖాళీ స్థలాన్ని పార్కుగా అభివృద్ధి చేయాలని కోరుతుంటే, కొందరు వ్యక్తులు తప్పుడు పత్రాలతో కోర్టుకు వెళ్లారని స్థానికులు ఆరోపించారు.
ఈ ఫిర్యాదులను పరిశీలించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, వీటి పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి, పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు..jpeg)
