నిబంధనలు 'బేఖాతరు'.. అడ్డదారిలో అడ్మిషన్ల జోరు!
- ఎస్ . ఆర్ గాయత్రి విద్యాసంస్థల బరితెగింపు: అనుమతులు లేని భవనంలోకి కళాశాల మార్పు?
- నివాస గృహ అనుమతులతో విద్యాసంస్థ నిర్మాణం.. గాలికి ఫైర్ సేఫ్టీ, మున్సిపల్ నిబంధనలు!
హైదరాబాద్:
విద్యాసంస్థలంటే క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాలి. కానీ, లాభాలే పరమావధిగా భావిస్తున్న కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థలు చట్టాలను తుంగలో తొక్కడమే కాక, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. చంపపేట్ నుంచి సాగర్ కాంప్లెక్స్ (శ్రీ గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆర్చ్ రోడ్) సమీపంలోని ఒక అనధికార నిర్మాణంలోకి 'ఎస్సార్ గాయత్రి' జూనియర్ కళాశాలను తరలిస్తున్నట్లు సాగుతున్న ప్రచారం ఇప్పుడు సంచలనంగా మారింది. కనీస అనుమతులు లేకుండా, నిర్మాణ పనులు పూర్తికాకుండానే అడ్మిషన్ల పేరిట విద్యార్థుల తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్న తీరు విస్మయానికి గురిచేస్తోంది.
అనుమతులు నివాసానికి.. పాఠాలు కళాశాలలోనా?
మున్సిపల్ నిబంధనల ప్రకారం విద్యాసంస్థలు నడపాలంటే కమర్షియల్ లేదా ఇన్‌స్టిట్యూషనల్ పర్మిషన్ ఉండాలి. కానీ, సదరు భవనం కేవలం నివాస అవసరాల కోసమే అనుమతులు పొంది, గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణంలోనే భారీ ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బిల్డింగ్ ఆక్యూపెన్సీ సర్టిఫికేట్ (OC) లేకుండా, ఫైర్ ఎన్‌ఓసీ (Fire NOC) రాకుండానే ఒక జూనియర్ కళాశాలను అక్కడ ఎలా ప్రారంభిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.
నిబంధనల ఉల్లంఘన - చట్టపరమైన చిక్కులు*
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా బోర్డు నిబంధనల ప్రకారం, ఒక కొత్త కళాశాల ప్రారంభించాలన్నా లేదా ఉన్న కళాశాలను మార్చాలన్నా కఠినమైన 16 రకాల ప్రమాణాలను పాటించాలి. ఎస్సార్ గాయత్రి యాజమాన్యం వీటిని బేఖాతరు చేస్తున్నట్లు కనిపిస్తోంది:
*మున్సిపల్ చట్టాల ఉల్లంఘన:* జిహెచ్ఎంసి నుండి అనుమతులు లేకుండానే అక్రమ నిర్మాణంలో ప్రమాదకరమైన నీవు నిర్మాణంలో కాలేజీ నిర్వహణ, 'తెలంగాణ మున్సిపాలిటీల చట్టం 2019' ప్రకారం నేరం.
*విద్యా చట్టాల ధిక్కరణ:
8000 చ.అడుగుల RCC ఏరియా, కార్పస్ ఫండ్, శానిటరీ సర్టిఫికేట్ వంటివి లేకుండా బోర్డు అనుమతి రాదు. అనుమతి లేకుండా తరగతులు నిర్వహించడం 'ఆంధ్రప్రదేశ్/తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982' లోని సెక్షన్ 20 ప్రకారం దండనార్హం.
"డబ్బు, రాజకీయ పలుకుబడి ఉంటే చట్టాలను చుట్టేయవచ్చు" అనే ధీమా యాజమాన్యంలో కనిపిస్తోందని స్థానికులు విమర్శిస్తున్నారు. నిర్మాణ పనులు జరుగుతుండగానే అడ్మిషన్లు తీసుకోవడం విద్యార్థుల భద్రతను ప్రమాదంలోకి నెట్టడమే. ఇంత జరుగుతున్నా ఇంటర్ బోర్డు అధికారులు, మున్సిపల్ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక ఉన్న మతలబు ఏమిటోనని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు.
ప్రశ్నార్థకమైన అనుమతులు: ఇవి ఉన్నాయా?
1. మున్సిపల్ శాఖ జారీ చేసిన కమర్షియల్ బిల్డింగ్ ప్లాన్ ఎక్కడ..?
2. అగ్నిమాపక శాఖ జారీ చేసిన ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ ఎక్కడ..?
3. ఇంజనీరింగ్ విభాగం ఇచ్చిన స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికేట్ ఎక్కడ.?
4. ఇంటర్ బోర్డు జారీ చేసిన షిఫ్టింగ్ ఆర్డర్ లేదా గుర్తింపు పత్రం ఎక్కడ..?
అడ్మిషన్లు ఆపేదెవరు?*
తప్పుదోవ పట్టించే ప్రచారాలతో, అసంపూర్తి భవనాల్లో అడ్మిషన్లు చేపడుతున్న విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. విద్యార్థుల భవిష్యత్తు, భద్రతతో ముడిపడిన ఈ వ్యవహారంలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకోకపోతే, భారీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అడ్డదారిలో సాగుతున్న ఈ అడ్మిషన్ల పర్వానికి బ్రేక్ వేయాల్సిన సమయం ఆసన్నమైంది.
