జూన్ 2లోపు 50% ఫిట్మెంట్‌తో పీఆర్‌సీ ప్రకటించకుంటే భారీ ఉద్యమిస్తాం
- - ఉద్యోగులు కూడా ప్రజల్లో భాగమే
- - పీఆర్‌టీయూటీఎస్ అధికార ప్రతినిధి వంగా మహేందర్ రెడ్డి
గజ్వేల్:
పీఆర్‌టీయూ వర్గల్ మండల శాఖ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మైలారం ప్రధానోపాధ్యాయులు సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి ఉద్యోగ విరమణ అభినందన సభ ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి వర్గల్ మండల శాఖ అధ్యక్షులు తోకల చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షత వహించగా, మండల ప్రధాన కార్యదర్శి పారుపల్లి నరసింహ రెడ్డి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న పీఆర్‌టీయూటీఎస్ అధికార ప్రతినిధి వంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ 2లోపు 50% ఫిట్మెంట్‌తో పీఆర్‌సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.పీఆర్‌సీ ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చే బహుమానం కాదని, పెరుగుతున్న ధరల నేపథ్యంలో ఇది ఉద్యోగుల హక్కు అని పేర్కొన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి, ఇప్పుడు నిధుల కొరతను కారణంగా చూపించడం సరికాదన్నారు.
ఉద్యోగులు కూడా ప్రజల్లో భాగమేనని, సంక్షేమ పథకాలకు నిధులు ఉంటే ఉద్యోగుల పీఆర్‌సీకి ఎందుకు ఉండవని ప్రశ్నించారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకొస్తే పీఆర్‌సీ అమలు చేయడానికి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. జూన్ 2లోపు పీఆర్‌సీ ప్రకటించకపోతే ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఇదే కార్యక్రమంలో సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి మూడు దశాబ్దాల పాటు అంకితభావంతో సేవలందించిన ఉత్తమ ఉపాధ్యాయుడిగా, ప్రధానోపాధ్యాయుడిగా నిలిచారని కొనియాడారు.ఈ సభలో ఎస్‌సీఆర్‌టీ మాజీ డైరెక్టర్ ఆనంద్ కిషోర్, పీఆర్‌టీయూ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శశిధర్, మాజీ ఎంపీపీ నిమ్మ రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎంఈఓ సునీత, ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షులు ఎండి కరీముద్దీన్, పత్రికా ప్రతినిధులు, ఉపాధ్యాయులు, నాయకులు పాల్గొని అభినందనలు తెలిపారు.
