వామ్మో.. ఇదేమి దోపిడిరా.. సామీ.!

  • సివిల్ డిపార్ట్మెంట్ తీరుపై సర్వత్ర విమర్శలు
  • చేతివాటం చూపుతున్న ఆ అధికారి
  • అక్రమలకు అడ్డాగా సివిల్ కార్యాలయం
  • బినామీ పేర్లతో వడ్డాణం కాంట్రాక్టు పనులు.!
  • అంగట్లో సరుకుల కాంట్రాక్టర్ల నమోదు
  • ప్రజాధనం కాంట్రాక్టర్ల పాలే
  • రోజుకొక్కరు చొప్పున లైసెన్సులు మంజూరు
  • అలసత్వంలో సింగరేణి యాజమాన్యం
  • పత్రిక కథనాలపై సిఅండ్ఎండి అరా.!
  •  రంగంలోకి విజిలెన్స్ అధికారులు.!
 

 
1000495998 (1)
మణుగూరు,ఆగష్టు 25 (భారతశక్తి): రాష్ట్రంలో సిరులు గనిగా వెలుగొందుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు ఏరియాలో సిఎస్ఆర్ నిధుల నుండి సంస్థ పనులలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఏరియాలోని సివిల్ కార్యాలయం కొందరి అవినీతి కాంట్రాక్టర్లకు అడ్డాగా మారింది. ఇటీవల కాలంలో ఓ సివిల్ అధికారి నిర్లక్ష్యంతో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులలో తిష్ఠ వేసిన కాంట్రాక్టర్ల జేబులు నిండుతుండగా, పనులల్లో నాణ్యత లోపించి మూణ్నాళ్ల ముచ్చటగానే మారుతున్నాయి. పనులపై గత రెండు రోజులుగా పత్రికలో వరుస కథనాలు వెలువడుతుండగా ఆ అధికారి తీరులో మాత్రం ఎటువంటి మార్పు కనిపించడం లేదు. ఆ అధికారి పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే మరోవైపు ఆయా కాంట్రాక్టర్లతో చీకటి మంతనాలు సాగిస్తున్నారని తెలుస్తోంది. మీరు చేసిన అక్రమాలకు నా ఉద్యోగానికే ఎసరు వస్తుందని ఆయా కాంట్రాక్టర్ల వద్ద మొరపెట్టు కుంటున్నట్లు వినికిడి. నష్టాలు బాట నుండి సంస్థను కట్టించే గట్టెక్కించేందుకు ప్రయత్నిస్తున్న సిఅండ్ఎండి బలరాం లక్ష్యానికి సింగరేణి అధికారులతో చేతులు కలిపి కొత్తగా సివిల్ కాంట్రాక్టర్లగా అవతారమెత్తిన కొందరూ తూట్లు పొడుస్తున్నారు. కంచె చేనును మేసిన చందంగా ఇటీవల కాలంలో సివిల్ డిపార్ట్మెంట్ లో ఓ అధికారి కనుసన్నల్లో కాంట్రాక్టర్లుగా నమోదైన కాంట్రాక్టర్లు చేపట్టిన పనులను పరిశీలిస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది.
 
 *అంగట్లో సరుకుల నయా దందా.!* 
 
రాజ్యాంగం కల్పించిన హక్కులను సద్వినియోగం చేసుకోవడంలో క్లాస్-1 కాంట్రాక్టర్ తెలివితేటలే ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. తనకున్న వాక్చాతుర్యంతో పాటు కింద స్థాయి సిబ్బంది నుండి జియం వరకు ప్రభావితం చేస్తానంటూ అతను పలికే చిలక పలుకులకు అనేకమంది ఆయన వలలో చిక్కుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీలకు సింగరేణి సంస్థ పది శాతం ఎటువంటి రుసుము లేకుండా కాంట్రాక్టర్లు గా అవకాశం కల్పించింది. అదే ఆయనకు ప్రత్యేక వనరుగా మారింది. అభివృద్ధి పనుల్లో కూడా ఆయా వర్గాలకు కేటాయింపులు ఉండగా మరోవైపు కొత్తగా నమోదైన కాంట్రాక్టర్లకు కూడా ఎటువంటి డిపాజిట్ లేదు. ఇదే ఆయనకు ప్రధాన పెట్టుబడిగా మారింది. ఏరియాలోని సివిల్ పనుల్లో కొందరికి ఎటువంటి అనుభవం లేకపోయినా ఎలాంటి ఫరం లేకపోయినా అన్ని తానై చక్రం తిప్పుతూ వారికి అన్ని రకాలుగా సివిల్ అధికారికి సపర్యలు చేస్తూ కొందరికి కాంట్రాక్టర్ పత్రాలను కూడా ఆయనే అందించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంగట్లో సరుకుల కొందరిని సింగరేణి కాంట్రాక్టర్లుగా నమోదు చేయడంతో పాటు, వర్కులు దక్కించుకోవడంలో కూడా అక్రమార్కుని పాత్ర కీలకంగా మారింది. స్థానికంగా భూములు కోల్పోయిన నిర్వాసిత యువతకు పని కల్పించాలని జియం కార్యాలయం మెట్లు ఎక్కిన ఆదివాసి యువతకు ఉపాధి లభించగా విలవిలలాడుతుంటే కోట్లాది రూపాయల అభివృద్ధి పనులను దక్కించుకోవడంలో ఆ కేటుగాడు కీలకంగా మారాడు.
 
 *వర్కుల్లో పర్సంటేజ్ ల పర్వం* 
 
 కాంట్రాక్టర్లు టెండర్లో దక్కించుకున్న పనుల్లో పర్సంటేజీలను సివిల్ కార్యాలయంలో కిందిస్థాయి అధికారి నుండి అగ్రశ్రేణి అధికారి వరకు మామూళ్ల పర్వం కొనసాగుతున్నాయన్నే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఉపాధి లేక అల్లాడుతున్న గిరిజన యువతతో పాటు, సంస్థ బొగ్గు నిల్వలు నిండుకుండడంతో ఇటీవల కాలంలో చేపట్టిన ఓసి విస్తరణ ప్రజాభిప్రాయ సేకరణ సభలో కూడా అక్రమార్కుడి మార్కే ప్రత్యక్షంగా కనిపించింది. సివిల్ డిపార్ట్మెంట్ పై వరుస కథనాలు వెలువడుతున్న స్థానిక సింగరేణి అధికారులు నోరు మెదపకపోవడం పై కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
 *సింగరేణి సిఅండ్ఎండి అరా.!* 
 
 
 
మణుగూరు ఏరియా లోని సివిల్ కార్యాలయం పై వరుస కథనాలు వస్తున్న విషయం తెలుసుకున్న సింగరేణి సిఅండ్ఎండి ప్రత్యేకంగా దృష్టి సారించి విజిలెన్స్ అధికారులను నివేదిక కోరినట్లు తెలుస్తుంది. దీంతో విజిలెన్స్ రంగ ప్రవేశంతో సివిల్ కార్యాలయంలో నిశ్శబ్ద వాతావరణ నెలకొంది. గతంలో పనిచేసి పదోన్నతిపై వెళ్లిన అధికారి అలసత్వంతో నేడు పనిచేస్తున్న అధికారులు కూడా ఆందోళన చెందుతున్నారు. గతంలో పనిచేసిన అధికారి అవినీతి మరకలు తమకు ఎక్కడ అంటుకుంటాయనే అంతర్మథనంలో ప్రస్తుత అధికారులు ఉన్నారు. ఏరియాలో ఇప్పటి వరకు చేపట్టిన అభివృద్ధి పనులు, సంబంధిత కాంట్రాక్టర్ల వివరాలను విజిలెన్స్ అధికారులకు సమర్పించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వరుసగా భారతశక్తి దినపత్రికలో వెలువడుతున్న కధనాలు కాంట్రాక్టర్లో దడ పుట్టిసస్తుండగా.. వారి వద్ద నుండి ముడుపులు అందుకున్న అధికారుల్లో అలజడి రేకేస్తుంది. దీంతో స్థానిక కార్మిక సంఘాల నేతలతో పాటు ఓ సామాజిక కార్యకర్త కూడా సింగరేణి సిఎండి, డైరెక్టర్ 'పా', విజిలెన్స్ అధికారులను కూడా స్వయంగా కలిసి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం

About The Author