గౌరవాన్ని సేవగా మలిచిన కార్తిక్ సామాజిక ప్రయోగం
వేములవాడ, ఆగస్టు 19 (భారత శక్తి) : వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కుమారుడు ఆది కార్తిక్ ఒక అద్భుతమైన సామాజిక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే అభిమానులు, నాయకులు గౌరవంగా సత్కరించే సమయంలో అందించే శాలువాలు సాధారణంగా అల్మారాలో నిల్వ ఉంటాయి.అయితే ఆది కార్తిక్ వాటికి కొత్త జీవం పోసే వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చారు.
“From Honour to Humanity” పేరుతో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో,ఆ శాలువాలను నైపుణ్యం కలిగిన టైలర్లు, డిజైనర్లు సహాయంతో చిన్నారుల కోసం ఆకర్షణీయమైన పండుగ దుస్తులుగా తయారు చేస్తున్నారు.
రాబోయే బతుకమ్మ పండుగ సందర్భంగా సుమారు 500 నుండి 1000 దుస్తులను పేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లలకు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఈ దుస్తులను ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వయంగా చిన్నారులకు అందజేసి, వారి ఆనందంలో భాగస్వాములు కానున్నారు.
“గౌరవాన్ని సేవగా మార్చడం మా లక్ష్యం” అని ఆది కార్తిక్ తెలిపారు.
యువతకు సామాజిక బాధ్యత, సేవా తత్వానికి ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తోందని స్థానికులు అభినందిస్తున్నారు.