యూరియా సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలి...
రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు
- రైతులు ప్రస్తుత అవసరాల మేరకు మాత్రమే యూరియా కొనుగోలు చేయాలి.
- యూరియా డైవర్ట్ కాకుండా పటిష్ట చర్యలు
- ఖమ్మం జిల్లాలో యూరియా కొరత లేదు.. రైతులు ఆందోళన చెందవద్దు.
- యూరియా, ఎరువుల లభ్యతపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన మంత్రి తుమ్మల
ఖమ్మం ప్రతినిది : వానాకాలం పంట సాగుకు అవసరమైన యూరియా రైతులకు చేరేలా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వర రావు హైదరాబాద్ సచివాలయం నుంచి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణా రావుతో కలిసి సోమవారం యూరియా, ఎరువుల లభ్యతపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డిసిపి ప్రసాద్ రావుతో కలిసి పాల్గొన్నారు.
సీఎస్ కే. రామకృష్ణారావు మాట్లాడుతూ గత సంవత్సరంతో పోలిస్తే నేటికి లక్ష మెట్రిక్ టన్నుల ఎరువులు అదనంగా రైతులకు సరఫరా చేశామని అన్నారు. రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటి కప్పుడు సంప్రదింపులు జరుపుతూ వీలైనంత అధికంగా యూరియా తీసుకొని వచ్చేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. యూరియా, ఇతర ఎరువుల లభ్యత వివరాలను కలెక్టర్ ప్రతిరోజు పర్యవేక్షించా లని అన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, మార్క్ ఫెడ్, ప్రైవేట్ కంపెనీల వద్ద మండల స్థాయి వరకు స్టాక్ ఎంత ఉందో రెగ్యులర్ గా మానిటరింగ్ చేయాలని అన్నారు. మండలాల వారీగా సాగు ఎంత అవుతుంది, ఎరువుల లభ్యత బేరీజు వేసుకొని అందుబాటులో ఉన్న ఎరువుల స్టాక్ సమర్థవంతంగా, శాస్త్రీయంగా కేటాయింపులు చేయాలని సూచించారు. ప్రతిరోజు జిల్లాలకు ఎరువుల స్టాక్ ఎంత వరకు రాబోతున్నాయి వంటి అంశాలను కలెక్టర్ కు ముందస్తుగా తెలియజేస్తామని అన్నారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న యూరియా వ్యవసాయం కోసం మాత్రమే వినియోగించేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని, రైతులు ముందస్తుగా కొనుగోలు చేసి స్టాక్ పెట్టుకోవద్దని, ప్రస్తుత అవసరాల కోసం మాత్రమే యూరియా కొనుగోలు చేయాలని అన్నారు. వ్యవసాయ అధికారులతో పాటు జిల్లాలో ఇతర ముఖ్యమైన అధికారులతో టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి ప్రైవేట్ ఎరువుల డీలర్ల షాపు లను ఆకస్మిక తనిఖీ చేయాలని అన్నారు. జూన్, జూలై నెలల్లో అధికంగా యూరియా కొనుగోలు చేసిన బయ్యర్స్, రెగ్యులర్ గా కొనుగోలు చేసే బయ్యర్స్ వివరాలను ట్రాక్ చేయాలని, వీరు ఎక్కడైనా యూరియా డైవర్ట్ చేస్తున్నారా పరిశీలించాలని అన్నారు.
జిల్లాలో ఎరువులు, యూరియా లభ్యత, సరఫరాపై రైతులకు స్పష్టమైన సమాచారం అందించాలని అన్నారు. జిల్లాలో యూరియా కోసం అనవసరంగా రైతులు లైన్ లో నిలబడకుండా ఎప్పుడు సరఫరా చేస్తామనే అంశం స్పష్టంగా తెలియజేయాలని అన్నారు. సరిహద్దు జిల్లాలో ఇతర రాష్ట్రాల రైతులకు యూరియా అమ్మకుండా చూడాలని, మన స్టాక్ బ్లాక్ మార్కెట్ కాకుండా బోర్డర్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయాలని అన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా యూరియా కోసం రైతులు ఇబ్బంది పడరాదని, ఎప్పటి కప్పుడు పర్యవేక్షిస్తూ అవసరం ఉన్న మేరకు యూరియా సరఫరాకు వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో యూరియా కొరత లేదని ఈ సందేశం ఫీల్డ్ లెవల్ లో వెళ్ళాలని అన్నారు. మండలాల్లో ఎక్కడైనా కొరత ఉంటే తనకు తెలియజేయాలని వెంటనే ఇతర ప్రాంతాల నుంచి స్టాక్ తెప్పిస్తామని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, జిల్లా సహకార అధికారి గంగాధర్, జిల్లా మార్కెటింగ్ అధికారి అలీమ్, జిల్లా మార్క్ ఫెడ్ అధికారిణి సునీత, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.