రామకృష్ణాపురం రైల్వే బ్రిడ్జి పై కదలిక
ఎంపీ వద్దిరాజు లేఖకు రైల్వే మంత్రి స్పందన
ఖమ్మం ప్రతినిది (భారత శక్తి న్యూస్ ), ఆగష్టు 18: చింతకాని మండలం రామకృష్ణాపురం 107 రైలు క్రాసింగ్ వద్ద బ్రిడ్జి నిర్మాణం పై కదలిక వచ్చింది. ఈ అంశం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్.. రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కు తెలిపారు. ఈ మేరకు ఎంపీ రవిచంద్ర ఆగస్టు 7వ తేదీన రైల్వే మంత్రికి రాసిన లేఖలో.. రామకృష్ణాపురం గ్రామ సమీపంలోని 107 లెవల్ క్రాసింగ్ వద్ద బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ విజ్ఞప్తి చేశారు. తరచూ గేటు మూసి ఉంచడం వల్ల గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులను రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్.. ఎంపీ రవిచంద్ర కు తిరిగి లేఖ రాశారు. చింతకాని మండలం రామకృష్ణాపురం 107 లెవల్ క్రాసింగ్ వద్ద ఆర్వోబీ నిర్మాణం కోరుతూ చేసిన వినతిపై సాధ్యాసాధ్యలను సంబంధించి సమగ్ర నివేదిక కోరుతూ రైల్వే ఉన్నతాధికారులు ఆదేశించడం జరిగిందని మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆ లేఖలో బదులిచ్చారు. దీంతో రామకృష్ణాపురం వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి.. బ్రిడ్జి నిర్మాణం దిశగా కృషి చేస్తున్న ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కు కృతజ్ఞతలు తెలిపారు.