భారీ వర్షాలపై అప్రమత్తం..
కడెం ప్రాజెక్టు ను పరిశీలించిన మంత్రి జూపల్లి కృష్ణారావు.
ఉమ్మడి అదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టును ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం సందర్శించారు. ప్రాజెక్టులోకి వస్తున్న వరదనీటి ఇన్ఫ్లో, అవుట్‌ఫ్లోపై ఇంజనీరింగ్ అధికారుల నుంచి వివరాలు సేకరించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రాజెక్టు వద్ద ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా ఇప్పటికే 9 కోట్ల రూపాయల నిధులతో మరమ్మతు పనులు పూర్తిచేశామని వెల్లడించారు. వర్షాల ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు, గ్రామాల్లో రహదారులు దెబ్బతిన్నాయని, రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. భారీ వరదల కారణంగా పంట పొలాలు, నివాస గృహాలు, రహదారులు నష్టపోయాయని మంత్రి పేర్కొన్నారు. వర్షాలు తగ్గిన అనంతరం సంబంధిత శాఖలు సర్వే చేసి, నష్టాన్ని అంచనా వేసి, ప్రభుత్వానికి నివేదిక పంపుతాయని, అనంతరం బాధితులకు ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు.