మణుగూరులో మొదలైన పనుల జాతర
మణుగూరు :
పౌల్ట్రీ షెడ్ నిర్మాణం కోసం శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే పాయం,
హాజరైన కలెక్టర్ జితేష్ వి పాటిల్
మండల పరిధిలోని దమ్మక్కపేట పంచాయితీలో పనుల జాతర అట్టహాసంగా జరిగాయి. పనుల జాతర కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రెండు ముఖ్యమైన అభివృద్ధి పనులకు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తో కలిసి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శంకుస్థాపనలు చేశారు. మొదటిగా దమ్మకపేట గ్రామపంచాయితీ పరిధిలో పౌల్ట్రీ షెడ్ నిర్మాణం, తోగూడెం గ్రామపంచాయితీ పరిధిలో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ కు ఎమ్మెల్యే పాయం భూమి పూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పనుల జాతర ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక అన్నారు. గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేయడం, ఉపాధి హామీ పథకం పనులను మరింత చురుకుగా అమలు చేయడం దీని ప్రధాన లక్ష్యమన్నారు. గ్రామాల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు నిర్మించడం జరుగుతుందన్నారు. మట్టిరోడ్లు, పశుగ్రాస పంటల అభివృద్ధి, వ్యవసాయానికి అనుకూలమైన చెరువులు, వాగులు, రోడ్లు, పౌల్ట్రీ షెడ్లు, కమ్యూనిటీ భవనాలు, శానిటరీ కాంప్లెక్స్ లాంటి పనులు చేయడం జరుతుందన్నారు. ఇది ఒక పండుగ వాతావరణంలో నిర్వహించబడుతుందని, ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొని తమ గ్రామ అభివృద్ధి పనులు ప్రారంభిస్తారని, అందువల్ల దీన్ని "పనుల జాతర"గా పిలుస్తారని తెలిపారు. ఈ జాతర ద్వారా ప్రతి గ్రామం అభివృద్ధి కేంద్రంగా మారడమే కాకుండా, ఉపాధి సృష్టి, సామాజిక ఐక్యత, ప్రజల భాగస్వామ్యం పెరుగుతాయన్నారు. ఈ కార్యక్రమాల్లో మండల అభివృద్ధి అధికారి తేళ్ళూరి శ్రీనివాసరావు, ఎంపిఓ వెంకటేశ్వరరావు, తహశీల్దార్ నరేష్, రెవెన్యూ సిబ్బంది, గ్రామపంచాయితీ సెక్రటరీ లు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పిరినాకి నవీన్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.