ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలి..
అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్..
కామారెడ్డి :
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు.గురువారం ఐడిఓసి లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో హౌసింగ్ అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో 11 818 ఇందిరమ్మ గృహాలు మంజూరు కాగా వాటిలో 5909 గృహాలకు మార్కింగ్ ఇచ్చి ప్రారంభించడం జరిగిందని, 2660 గృహాలు బేస్మెంట్ లెవల్ వరకు, 283 ఇండ్లు రూమ్ లెవెల్ వరకు, 107 ఇండ్లు స్లాబ్ లెవల్ వరకు నిర్మాణం పూర్తయ్యాయని అన్నారు. అదేవిధంగా 100% పూర్తయిన ఇళ్ల నిర్మాణాలను ఆన్లైన్లో పొందుపరచాలని అన్నారు. తప్పుగా నమోదైన లబ్ధిదారుల ఆధార్ కార్డుల సవరన త్వరగా చేయించాలని, జిల్లాలో పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సమస్యను త్వరగా పరిశీలించాలని అన్నారు.
వర్షాలు తగ్గుముఖం పట్టినందున అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇందిరమ్మ లబ్ధిదారులతో మాట్లాడి ఇంకా ప్రారంభించని ఇళ్లకు వెంటనే మార్కౌట్ చేసి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. వివిధ నిర్మాణ దశలలో ఉన్న ఇండ్లను త్వరితగతిన నిర్మించుకునేలా లబ్ధిదారులను మోటివేట్ చేయాలని, ఇంటి నిర్మాణానికి ఇసుక ఇతర మెటీరియల్ కొరత రాకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ చందర్ నాయక్, డిపిఓ మురళి, పీడీ హౌసింగ్ విజయపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.