
కామారెడ్డి జిల్లాలో రైతులకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉంచాలని సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఖరీఫ్ సీజన్ ప్రారంభాని కంటే ముందే జిల్లాలో రైతులు సాగు చేస్తున్న సాగు విస్తీర్ణంపై అంచనా వేసి సకాలంలో రైతులకు యూరియా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయయ్యాని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న బిజెపి ఎంపీలు,ఎమ్మెల్యేలు అట్లాగే బిజెపికి చెందిన భారతీయ కిసాన్ సంగ్ నాయకత్వం రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం బిజెపి అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. జిల్లా అధికార యంత్రాంగం సైతం రైతులకు సరిపడా యూరియా నిల్వలపై ఎప్పటికప్పుడు సమీక్షించి సమస్యను పరిష్కరించడంలో చొరవ చూపించాలని సాగుకు సరిపడా యూరియాను రైతులకు అందిస్తే రోడ్ల పైకి ఎందుకు వస్తారని ప్రశ్నించారు. వర్షాకాల ప్రారంభంలోనే వ్యవసాయ శాఖ అధికారులు విస్తీర్ణంపై అంచనా వేసి ప్రభుత్వానికి పంపారా? పంపిన ప్రతిపాదనలకు అనుగుణంగా ప్రభుత్వం యూరియాను జిల్లాకు కేటాయించిందా? ప్రభుత్వం యూరియాను జిల్లాకు సరిపడినంత పంపించినా జిల్లా అధికార యంత్రాంగం రైతులకు పంపిణీ చేయడంలో విఫలమయిందా? అనే అంశాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
యూరియాను వారం రోజుల్లో రాష్ట్రానికి పంపిస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నట్టుగా రాష్ట్రమంత్రులు చెబుతున్నారు. పంటకు అనువైన సమయంలో మందులు వేయకుండా సమయం దాటాక యూరియా వస్తే రైతులకు ఏమి ఉపయోగం ఉంటుందని అన్నారు. యూరియాను పి ఎ సి ఎస్ ల ద్వారా కాకుండా ప్రైవేట్ దుకాణాల ద్వారా అమ్మకాలు జరుపుతున్నారని, గోదాములలో యూరియా ఉన్నప్పటికీ కృత్రిమ కొరత సృష్టించి రైతులను దోపిడీ చేసే విధానాలకు పాల్పడుతున్నారని, మన రాష్టానికి సంబంధించిన ఎరువులు బిజెపి పాలిత రాష్టాలకు అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయనీ ఆరోపణలపై జిల్లా కలెక్టర్ పూర్తి విచారణ చేపట్టి లోపాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, అర్హులైన రైతులకు పూర్తిస్థాయిలో యూరియా అందే విదంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికీ రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చుట్టూ యూరియా కోసం రోజుల తరబడి తిరుగుతున్నారని, సమయానికి యూరియాను అందించకపోవడం వల్ల పంటలు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన, పట్టాదారు పాసు పుస్తకం ఉన్న ప్రతి రైతుకు సాగుకు అనుగుణంగా యూరియాను పంపిణి చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు చేపట్టాలని లేని పక్షంలో రైతులను కలుపుకొని ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వెంకట్ గౌడ్, మోతి రామ్ నాయక్ కొత్త నర్సింలు ముధం అరుణ్ సత్యం శ్రీహరి సురేష్ తదితరులు పాల్గొన్నారు.