
రాష్ట్రంలోని ప్రజల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం కొనసాగుతుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి జిల్లాలోని కోటపల్లి మండలం దేవులవాడ గ్రామంలో సి. సి. రోడ్డు, సెంట్రల్ లైటింగ్ సిస్టం, భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలు పరిశీలించి కొల్లూరు గ్రామంలో పనుల జాతరలో భాగంగా అంగన్వాడీ కేంద్రానికి భూమి పూజ చేశారు. సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ ప్రజా సంక్షేమం దిశగా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కరకట్టలు నుంచి వరదలను నియంత్రించి, బ్యాక్ వాటర్ రాకుండా చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే దెబ్బతిన్న పంట పొలాలను గుర్తించి సర్వే చేయాలని, ఒక ఎంక్వయిరీ కమిషన్ ఏర్పాటు చేసి విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామపంచాయతీల పరిధిలో 20 లక్షల రూపాయల వ్యయంతో పంచాయితీ కార్యాలయాలు, 12 లక్షల రూపాయల వ్యయంతో అంగన్వాడీ కేంద్రాలు నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. చెన్నూర్ మండలం సుందరశాల గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 2 కోట్ల రూపాయలు మంజూరు చేసి డిగ్రీ కళాశాల భవన నిర్మాణ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని, 200 కోట్ల రూపాయల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు నిష్ణాతులైన ఉపాధ్యాయుల నియామకం జరిగిందని తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలలో త్రాగునీరు, విద్యుత్, మూత్రశాలలు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్య అందించిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, నూతన మెనూ ప్రకారం పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులకు ఆర్. ఓ. ప్లాంట్ల ద్వారా శుద్ధమైన త్రాగునీటిని అందిస్తున్నామని తెలిపారు. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలలో సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని, జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల నుండి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరుతున్నారని, ఉపాధ్యాయులు పాఠశాలలలో విద్యార్థుల సంఖ్య పెంపొందించాలని తెలిపారు. లంబడిపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు 8 లక్షల 50 వేల రూపాయలతో నిర్మించిన ప్రహరీ గోడను ప్రారంభించడం జరిగిందని, 20 లక్షల రూపాయల నిధులతో పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. గ్రామంలో సోలార్ హైమాస్ లైట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని, ప్రతి ఇంటికి త్రాగు నీటిని అందించేందుకు మిషన్ భగీరథ పథకం ద్వారా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. పేద ప్రజల అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం కార్యచరణ ప్రకారం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. చెన్నూరు నియోజకవర్గంలో పనుల జాతరలో భాగంగా 50 కోట్ల రూపాయలతో అన్ని గ్రామాలను కలుపుతూ సి.సి. రోడ్లు, మురుగు నీటి వ్యవస్థ ఏర్పాటు, గ్రామ పంచాయతీ కార్యాలయాలు, ఉపాధి హామీ పథకం క్రింద అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారుడికి ఇందిరమ్మ ఇండ్లు కేటాయించి నిర్మాణ దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఈ క్రమంలో భాగంగా జిల్లాలో 25 శాతం పనులు పూర్తి అయ్యాయని, లబ్ధిదారులు నిబంధనల ప్రకారం 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించుకోవాలని, నిబంధనల ప్రకారం ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లుల మంజూరు వేగంగా జరుగుతుందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు రాని అర్హత కలిగిన లబ్ధిదారులు ఆందోళన పడవలసిన అవసరం లేదని, అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గృహ జ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ లబ్ధిదారులకు అందించడం జరుగుతుందని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించడం జరుగుతుందని తెలిపారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా నిరుపేదలకు అందించే వైద్య సేవలను 5 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయలకు పెంచడం పెంచడం జరిగిందని తెలిపారు. రేషన్ కార్డు కలిగిన ప్రతి లబ్ధిదారుడికి చౌక ధరల దుకాణాల ద్వారా సన్న బియ్యం అందించడం జరిగిందని, ప్రజలంతా సంతోషంగా ఉన్నారని తెలిపారు. దాదాపు 10 సంవత్సరాల పాటు రేషన్ కార్డు లేకుండా ఎంతో మంది నిరుపేదలు ఇబ్బందులు పడ్డారని, ప్రభుత్వం జిల్లాలో అర్హులైన అందరికీ రేషన్ కార్డులు జారీ చేసి వారి సంక్షేమం దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రైతు సంక్షేమంలో భాగంగా రైతు భరోసా ద్వారా వానాకాలం పంట పెట్టుబడి సహాయాన్ని ముందుగానే రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం జైపూర్ మండల కేంద్రంలో 3 లక్షల రూపాయల నిధులతో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ పనులకు శంకుస్థాపన చేసి, వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అవరణలో మొక్కలు నాటారు. భీమారం మండల కేంద్రంలో అంగన్వాడీ భవన నిర్మాణానికి 12 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేశారు.. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.