ప్రతి ఎకరానికి సాగునీరు అందేలా కృషి...
ఖమ్మం ప్రతినిది :
డిప్యూటీ సి.ఎం. భట్టి విక్రమార్క మల్లు..
630 కోట్లతో 33 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ..
సంవత్సర కాలంలో జవహర్ ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలి
సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి గోదావరి జలాలను ఖమ్మం జిల్లాకు తరలిస్తాం..
బనకచెర్ల ప్రాజెక్టు అన్ని దశలలో అడ్డుకుంటాం..
630 కోట్ల రూపాయలతో చేపట్టిన జవహర్ ఎత్తిపోతల పథకానికి మంత్రులతో కలిసి శంకుస్థాపన చేసిన డిప్యూటీ సిఎం.. .
ఖమ్మం జిల్లాలోని ప్రతి ఎకరానికి కృష్ణ, గోదావరి జలాలను వినియోగించుకుంటూ సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని డిప్యూటీ సి.ఎం. భట్టి విక్రమార్క మల్లు అన్నారు.
కట్టలేరు ప్రాజెక్టు ఆధునికరణ పూర్తి చేశామని అన్నారు. 2012 ప్రాంతంలో జవహర్ ఎత్తిపోతల పథకానికి మంజూరు ప్రతిపాదనలు సమర్పించామని, గత పాలకులు 10 సంవత్సరాల కాలంలో ఈ ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురి చేశారని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం దృష్టికి ఈ ప్రాజెక్టు తీసుకుని వచ్చి, సర్వే నిర్వహించి, నిధులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు.
మధిర ప్రాంతంలో అధికంగా వ్యవసాయంపై ప్రజలు ఆధారపడి ఉన్నారని, నీటిని సద్వినియోగం చేసుకుంటేనే ఇక్కడ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. చిరకాలం గుర్తుండే అద్భుతమైన ప్రాజెక్టుకు నేడు శంకుస్థాపన చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు.
పాలేరు నుంచి సత్తుపల్లి వరకు నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారానే పంటలు పండుతున్నాయని అన్నారు. ప్రతి రోజూ 11 టీఎంసీల నీరు ఆంధ్రప్రదేశ్ తీసుకునేలా పనులు చేస్తుందని, ఈ దోపిడి ఇలాగే కొనసాగితే 20 రోజులలో శ్రీశైలం ఖాళీ అవుతుందని, నాగార్జునసాగర్ చివరి ఆయకట్టు సాగు నీరు అందేలా పోరాటాలు కొనసాగించాలని అన్నారు.
జలవనరుల శాఖ నుంచి కోర్టు వరకు అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ రాయలసీమ ప్రాజెక్టులు, బనకచర్ల ప్రాజెక్టు అడ్డుకోవాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపాలని డిప్యూటీ సీఎం విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం 7 మండలాలను ఏపి కు కట్టబెట్టడం అన్యాయమని అన్నారు.
బనకచర్ల ప్రాజెక్టుకు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని, తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసిన తర్వాత, వరద జిల్లాలో మన హక్కు తేలిన తర్వాతే కింది రాష్ట్రాలు ప్రాజెక్టుల గురించి ఆలోచించాలని ఆయన అన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జి మంత్రి వాకాటి శ్రీహరి మాట్లాడుతూ, గత పది సంవత్సరాల పాటు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో పేదలను గత పాలకులు మోసం చేశారని, ప్రస్తుత ప్రజా ప్రభుత్వం నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేస్తున్నామని అన్నారు. వరి పండించిన రైతులకు గిట్టుబాటు ధరతో పాటు క్వింటాల్ 500 రూపాయల బోనస్ ప్రభుత్వం అందించిందని గుర్తు చేశారు.
దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా మన రైతులు పండించిన సన్న రకం ధాన్యాన్ని బియ్యం గా మార్చి పేద ప్రజలకు రేషన్ కార్డుల ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్నామని అన్నారు. వైద్య , విద్యా, వ్యవసాయ రంగాలలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని అన్నారు.
తక్కువ ఖర్చు 630 కోట్లతో 33 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చేసే దిశగా జవహర్ ఎత్తిపోతల పథకం ప్రభుత్వం నిర్మిస్తుందని అన్నారు. పేదల సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు బలోపేతం చేయాలని ఆయన కోరారు.
నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఖమ్మం ప్రాంతంతో తనకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అన్నారు. మధిర ప్రాంతానికి గేమ్ చేంజర్ గా జవహర్ ఎత్తిపోతల పథకం ఉంటుందని అన్నారు. 630 కోట్లతో చేపట్టిన జవహర్ ఎత్తిపోతల పథకం పనులను సంవత్సరం లోపు పూర్తి చేయాలని మంత్రి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
జవహర్ ఎత్తిపోతల పథకం ద్వారా 33 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని, వైరా నదిలో 120 రోజులలో 4 టీఎంసీలు ఎత్తిపోసెలా ఈ ప్రాజెక్టు రూప కల్పన చేశామని, ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 190 ఎకరాల భూ సేకరణ చేయాల్సి ఉంటుందని దీనికోసం ప్రత్యేకంగా 45 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. మధిర మండలంలో 13 వేల ఎకరాల, ఎర్రుపాలెం మండలంలో 19 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని అన్నారు.
గత పాలకులు చేసిన అస్తవ్యస్త పాలన కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చితికి పోయిందని, అటువంటి సమయంలో ఆర్థిక శాఖ, విద్యుత్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న డిప్యూటీ సీఎం అద్భుతంగా పనిచేస్తున్నారని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ పేదల సంక్షేమాన్ని కొనసాగిస్తున్నారని, అదే సమయంలో పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు.
సీతారామ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు పుష్కలంగా గోదావరి నది జలాలు తీసుకొని వస్తామని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకంగా పనిచేస్తుందని, గోదావరి నది బోర్డు నుంచి సిడబ్ల్యుసి వరకు ప్రతి దశలో ఆ ప్రాజెక్టును అడ్డుకుంటామని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో గత పాలకులు చేసిన అవినీతి కారణంగానే ఆ ప్రాజెక్టు కూలిపోయిందని జస్టిస్ కమిషన్ రిపోర్ట్ అందించిందని అన్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, దిండి, సీతారామ, పాలమూరు, దేవాదుల ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. ప్రతి అర్హులైన పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామన్నారు. భూ భారతితో పేద రైతులకు న్యాయం చేశామన్నారు. రేషన్ కార్డుదారులకు ఉచితంగా సన్న బియ్యం ఇస్తున్నామన్నారు. రూ. 1200 కోట్లతో ఆర్ అండ్ బి రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. వంగవీడుకు డబల్ రోడ్ వేస్తామన్నారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, జోన్ 3 లో ఉన్న బ్రాంచీ కేనాల్ మీద మధిర, ఎర్రుపాలెంలో 33 వేల ఎకరాల ఆయకట్టు ఉన్నా నీరు సరిగ్గా అందక రైతులు అనేక ఇబ్బందులకు గురి అయ్యారని తెలిపారు. 630 కోట్ల 30 లక్షల రూపాయలను ఖర్చు చేసి జవహర్ ఎత్తిపోతల పథకం నిర్మించడం ద్వారా ఆంధ్ర తో సంబంధం లేకుండా జోన్ 3 ఆయకట్టు జోన్ 2 పరిధిలోకి తీసుకురావడం జరుగుతుందని అన్నారు.
గోదావరి నీటిని పాలేరు తీసుకొని వచ్చి కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్న 33 వేల ఎకరాల రెండు పంటలు పండుతూ సస్యశ్యామలంగా పండించడం కోసం ఈ స్కీం ఉపయోగపడుతుందని అన్నారు.
200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆర్టిసి బస్సులో ఉచిత ప్రయాణం, 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం, ఉగాది నుండి రేషన్ కార్డు ద్వారా నాణ్యమైన సన్న బియ్యం సరఫరా, నూతన రేషన్ కార్డులు జారీ, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు.
మొదటి విడత కింద 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేశామని, రాబోయే 3 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని, అర్హులైన ప్రతి పేదవాడికి తప్పనిసరిగా ఇందిరమ్మ ఇల్లు అందుతుందని అన్నారు. ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇంటి నిర్మాణ పురోగతి ఆధారంగా డబ్బులు పడుతున్నాయని అన్నారు.
ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, డిసిసిబి చైర్మన్ దొండపాటి వెంకటేశ్వర రావు, ఇర్రిగేషన్ సీఈ రమేష్, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.