జాతికి సవాలు విసురుతున్న బాలకార్మిక వ్యవస్థ..
బాల కార్మిక నిర్మూలనకు ఎన్ని చట్టాలు తెచ్చినా ఫలితం శూన్యం..
సామాన్య, దిగువ మధ్యతరగతి కుటుంబాలలో ఆర్ధిక సమస్యలు కారణం..
తల్లి దండ్రులు లేని అనాధ బాల, బాలికల పరిస్థితి అగమ్యగోచరం..
కొందరు అక్రమ రవాణా వ్యాపారాల కోసం బాల కార్మికులను ప్రోత్సహిస్తారు..
సరైన విద్య లేకపోవడంతో సమాజంలో కంటకులుగా మారుతున్న పిల్లలు..
కొందరు సమాజ సేవకులు, సంఘాలు తమవంతు ప్రయత్నం చేస్తున్నారు..
తల్లి దండ్రుల అత్యాశ కూడా ఒక ప్రధాన కారణమైపోతోంది..
ఊహ తెలియని వయసులోనే నరకయాతన పడుతున్న చిన్నారులు..
పిల్లలైతే పెద్దగా జీత భత్యాలు ఇవ్వాల్సిన అవసరం లేదు..
యాజమాన్యం తప్పు చేసినా, కఠినంగా వ్యవహరించినా ప్రశ్నించలేరని ధైర్యం..
బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం.. రేపటి అద్భుత ప్రపంచాన్ని వారికి కానుకగా ఇద్దాం..
బాల కార్మికులకు ఒక అందమైన జీవితాన్ని ఇవ్వాలని కంకణం కట్టుకుని పోరాటం సాగిస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "..
ఊహ కూడా తెలియని పసి జీవితాలు వాళ్ళవి.. తామేం చేస్తున్నారో..? ఎలా బ్రతుకుతున్నారో కూడా తెలియకుండా బ్రతుకునీడుస్తున్న దుర్భర చరిత్రలు వాళ్లవి.. తల్లి దండ్రులు లేని ఆనాధలు కొందరైతే.. తల్లి దండ్రులు ఉన్నా అనాధలుగా జీవిస్తున్న బాల బాలికలు మరికొందరు.. వీరంతా శ్రమ దోపిడీకి గురౌతున్నారు.. అర్ధాకలితో జీవిస్తున్నారు.. వంటిపై ఎలాంటి ఆచ్చాదన లేకుండా, అడుక్కుంటూ బ్రతుకుతున్నారు కొందరు.. ఇలాంటి వారినే గుర్తించి తమ అసాంఘిక కార్యకలాపాలకు వాడుకుంటారు కొందరు.. తమ చేతికి మట్టి అంటకుండా తప్పించుకుంటారు.. ఇదొక వ్యవస్థ అయితే మరొక వ్యవస్థ కూడా ఉంది.. అవసరాల్లో ఉన్న కుటుంబాలను టార్గెట్ గా చేసుకుని వారిని మాయమాటలతో లోబరుచుకుని వారి ఇంటి నుంచి లోకం తెలియని పసిబిడ్డలను తీసుకుని వారిని అడుక్కునే వారీగా మారుస్తారు.. ఇదొక భయంకర బెగ్గింగ్ మాఫియా.. ఒక్కోసారి ఈ ప్రక్రియలో పాలుగారే పసిపిల్లలకు అంగవైకల్యం కలిగించి మరీ వీధుల్లోకి పంపిస్తారు.. వారు అడుక్కున్న డబ్బులు తీసుకుని వారికి, వారి కుటుంబ సభ్యులకు పదో, పరకో పడేస్తారు.. తమని కాదంటే కాదన్నవారిని చంపడానికి కూడా వెనుకాడని దుర్మార్గులు ఎందరో ఉన్నారు.. నిజానికి తమకు ఆర్ధిక పరిస్థితి సరిగా లేనప్పుడు, పిల్లలను చాకలేనప్పుడు అసలు ఎందుకు పిల్లల్ని కనాలి.. తమ కోరికలకు ఫలితంగా వారికి జన్మనిచ్చి వారి భవిష్యత్తును ఎందుకు చీకటిమయం చేయాలి..? అని మేధావులు ప్రశ్నిస్తున్నారు.. అలాగే ఇలాంటి దుర్మార్గపు పనులను ప్రభుత్వాలు ఎందుకు నిరోధించలేకపోతున్నాయని కూడా ప్రశ్నిస్తున్నారు.. బెగ్గింగ్ మాఫియా, స్మగ్లింగ్, దొంగతనాలు ఇలాంటి సంఘ విద్రోహ చర్యల వెనుక పసి పిల్లలను ఉపయోగించే దారుణ మారణ హోమంలో కొందరు అవినీతి రాజకీయ నాయకులు, బడా బడా పారిశ్రామిక వేత్తలు, సంఘంలో పెద్ద మనుషులుగా చలామణీ అయ్యేవారు కూడా భాగస్వాములు అవుతున్నారన్నది భయంకర వాస్తవం.. అందుకే ఎన్ని ఆటంకాలు ఎదురైనా " పసి మొగ్గలను వసివాడనీయకుండా కాపాడే గురుతర బాధ్యతను తమ భుజాలమీదకు ఎత్తుకుంది " ఫోరం ఫార్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "
హైదరాబాద్ :
బాలకార్మిక సమస్య ఇప్పటికీ జాతిని సవాలు చేస్తోంది.. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం వివిధ చర్యల్ని చేపడుతూనే ఉంది. అయితే ఇది సామాజిక, ఆర్థిక సమస్యతో ముడిపడి వుండడం వలన, దారిద్య్రంతో, నిరక్షరాస్యతతో కూడినది అయినందువల్ల ఇప్పటికీ సమాజంలోని అన్ని వర్గాల వారికి సంబంధించిన సమస్యల్ని పరిష్కరించడానికి పఠిష్టమైన చట్టాలు ఇంకా రావాలి ఆ దిశగా ఏర్పాట్లు జరగాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉంది..
గురుపాదస్వామి సిఫారసుల ఆధారంగా బాలకార్మిక వ్యవస్థ నిషేధం - నియంత్రణ అనే చట్టం 1986 లో సిద్ధం చేశారు. కొన్ని ప్రమాదకరమైన వృత్తులను, పరిశ్రమలనూ గుర్తించి వాటిలో పిల్లలు పనిచేయడం నిషేధించింది. మరి కొన్నింటిలో పనిచేసే పరిస్థితుల్ని చట్ట ప్రకారం నియంత్రించడానికి ఏర్పాట్లు చేశారు. ఆ చట్ట ప్రకారం బాలకార్మిక సాంకేతిక సలహా సమితిని ఏర్పాటు చేసి ప్రమాదకరమైన వృత్తులను, పరిశ్రమలను గుర్తింపజేసి జాబితాను విస్తరింప చేశారు.
ఈ చట్టరీత్యా చర్యల ఆధారంగా బాలకార్మిక వ్యవస్థపై ఒక జాతీయ విధానాన్ని 1987లో రూపొందించారు. దీని ప్రకారం క్రమంగాను ఒక పద్ధతి ప్రకారం ఆయా ప్రమాదకరమైన వృత్తుల్లో పని చేసే పిల్లలకు మొట్ట మొదట పునరావాస సదుపాయం కల్పించారు. బాలకార్మికుల జానాభా లెక్కలు తీయడానికి ఏర్పాట్లు కూడా చేశారు.
ఇందులో ముఖ్యమైనది బ్రిడ్జి కోర్సులు :
ఎమ్.వి.ఫౌండేషన్ వారు మరొక విధమైన ఏర్పాటు చేశారు. బడి మానేసిన పిల్లలకు ప్రత్యేకంగా వసతి గృహాలు ఏర్పాటు చేసి, వారికి విద్యాబుద్ధులు చెప్పి మామూలు పాఠశాలల్లో బాలకార్మికులు వయసుకు తగిన తరగతుల్లో ప్రవేశించుటకు ఏర్పాట్లు చేశారు. బాలకార్మికులు సజావుగా మామూలు పాఠశాలల్లో చేరడంలో ఈ విధానం చాల జయప్రదమైంది. దీనిని కొన్ని స్వచ్ఛంద సంస్థలు చేపట్టి కొనసాగించడం గమనార్హం.
బాలకార్మిక వ్యవస్ధకు అనేక కారణాలు :
జాతీయ అంతర్జాతీయ సంయుక్త బాలల అత్యవసర నిధి వారి అంచనాప్రకారం బాలలు పనులలోకి నెట్టబడుతున్నారు. ఎందుచేతనంటే వారు సులువుగా దోపిడికి గురౌతారు. బాలలు విరుద్ధమైన, వారి వయస్సుకు సంబంధం లేని పనులు చేయుటకు సాధారణంగా మొట్టమొదటి కారణం పేదరికం. జనాభా పెరుగుదల, చౌకైన పనివారు, చట్టాలను అమలుపరచనందు వల్ల, తల్లి తండ్రులు తమ పిల్లలను బడికి పంపుటకు ఇష్టపడకపోవడము.. పిల్లలను పనికి పంపితే తమ ఆర్ధికపరిస్ధితి మెరుగవుతుందనే ఉద్దేశంతో.. గ్రామీణప్రాంతాలలోని అతిపేదరికం కూడా బాలకార్మిక వ్యవస్ధకు కారణాలు. పిల్లలు పనికి వెళ్తేనే ఆ కుటుంబానికే జీవనాధారమైనపుడు ఎవరు మాత్రం ఏమి చేయగలరు? అనే ప్రశ్న ఉత్పన్నం కాక మానదు..
అసలు ఏమి చేస్తే బాలకార్మిక వ్యవస్ధ నిర్మూలించబడుతుంది? :
బాల కార్మికవ్యవస్ధ నిర్మూలనకై డబ్భైఆరు బాలకార్మిక పథకాలతో 1,50,000 బాలలకు, జాతీయబాలకార్మిక పథకంలో మంజూరు చేయబడ్డాయి. సుమారు 1,05,000 పిల్లలు ప్రత్యేక బడులలో చేర్పించబడ్డారు. బాలకార్మిక మంత్రిత్వ శాఖ ప్రణాళికాసంఘాన్ని సుమారు 1500 కోట్ల రూపాయలతో ప్రస్తుతం 250 జిల్లాలకు బదులుగా 600 జిల్లాలకు జాతీయబాల కార్మిక పథకంలో విస్తరించుటకుగాను మంజూరు చేయమని అడిగింది. 57 అతి ప్రమాదకర పరిశ్రమలలో పనిచేయుచున్న బాలలు, హొటళ్ళు, ఇళ్ళల్లో పనిచేయుచున్న అంటే 9 నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్సున్న పిల్లలు ఈ పథకంలో చేర్పించబడ్డారు. ప్రభుత్వ పథకాలైన అందరికీ విద్యావిధానం అంటే సర్వ శిక్షాభియాన్ కూడా అమలు చేయబడుతోంది..
అసలు బాలల హక్కులు ఏమిటి..?
18 సంవత్సరాలలోపు బాలందరికీ ఈ హక్కులు వర్తిస్థాయి. సమానత్వం, కులం, మతం, జాతి, భాష, ఆడ, మగ, పుట్టుక ప్రదేశం వంటి ఏ విధమైన వివక్షను ఎవరి పట్లను చూపరాదు. బాలల ప్రయోజనాలు బాలల హక్కుల కార్యా చరణను చేపట్టినప్పుడు వారి సంపూర్ణ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకోవాలి. హక్కుల అమలుకై తీర్మానాలు, గుర్తించిన హక్కుల అమలుకి శాసన పరమైన, పాలనా పరమైన కార్యక్రమాలు చేపట్టాలి. అవసరమైతే అంతర్జాతీయ సహకారం తీసుకోవాలి. బిడ్డ పుట్టగానే పేరు, జాతీయత కలిగి వుండటం, తల్లి దండ్రలతో కలిసి జీవించడం బాలల హక్కు. బాలలను అక్రమంగా రవాణా చేయడం, వ్యభిచార వృత్తి లో దించడం, జీతాలకు పెట్టడం నేరం. బాలలు వారి అభిప్రాయాలను పాటలు, బొమ్మలు, ఆటలు, రచనల ద్వారా వ్యక్తం చేయవచ్చు. బాలలు తమకు నచ్చిన మతాన్ని ఆచరించవచ్చు.. తమ వృద్ధికై సంఘాలు ఏర్పాటు చేసుకోవచ్చు.
బాలలకు విజ్ఞానాన్ని అందిచడానికి ప్రభుత్వాలు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వాలు బాలల రక్షణకై శిశు సంరక్షణాలయాలు నిర్వహించాలి. తల్లి దండ్రులు ఇద్దరూ పనుల్లోకి వెళ్ళినట్లయితే ఆబాలల బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. పిల్లలను ఎవరైనా హింసించినా, దౌర్జన్యం చేసినా, వేధించినా నేరం. బాలల్ని రక్షించేందుకు ప్రభుత్వాలు చట్టాలు చేయాలి. శరణార్ధులుగా మారిన బాలలకు మానవతతో సాయం చేయాలి. మానసికంగా, శారీరకంగా వికలాంగులైన వారి వృద్థికి, వారిలో ఆత్మ విశ్వాసం పెంపుదలకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి.
బాలలు ఆరోగ్యంగా జీవించే హక్కు వుంది, సామాజిక భద్రత పోందే హక్కు కూడా వుంది. ఉచిత నిర్బంధ విద్యను పొందడం బాలల హక్కు. బాలలకు విశ్రాంతిగా వుండే హక్కువుంది. ఆటలు వినోద కార్యక్రమాల్లో పాల్గొనే హక్కువుంది. ప్రమాదకరమైన పనులు గనుల్లో, పేలుడు పదార్ధాల తయారీలో, హోటళ్ళలో బాలల్ని పని చేయించరాదు. మాధక ద్రవ్యాల నుండి బాలలను దూరం చేయాలి. వారికి అందుబాటులో వుంచడం, వారి ద్వారా తెెప్పించు కోవడం నేరం.
బాలల్ని నిర్భంధించరాదు.లైంగిక ధూషణ చేయరాదు. బాలల సంక్షేమానికై దోపిడి ఏ రూపంలో వున్నా ప్రభుత్వాలు నిషేధించాలి. 18 సంవత్సరాలలోపు వయస్సు బాలల్ని విడుదల చేయటానికి వీలులేని నేరాలకు ఉరి శిక్షగాని, యావజ్జీవ శిక్షగాని విధించరాదు. దేశంలో గాని, అంతర్జాతీయంగా గాని బాలలకు ఇంత కంటే మెరుగైన హక్కులను అందించే చట్టాలు ఉంటే ఆ హక్కులను పొందటానికీ బాలలకు హక్కు ఉంది. ఇవి బాలల హక్కులపై ఐక్య రాజ్యసమితి ఒడంబడిక యొక్క సంక్షిప్త రూపం.
ఇక భారత దేశంలో పిల్లల స్ధితిగతులు ఎలా ఉన్నాయంటే :
దేశంలో పుట్టిన 12 మిలియన్ల బాలికల్లో 3 మిలియన్ల మంది తమ 15వ పుట్టిన రోజును, ఒకమిలియన్ మంది తమ మొదటి పుట్టిన రోజును జరుపుకోకుండానే మరణిస్తున్నారు, లింగ విచక్షణ వల్ల ప్రతి ఆరుగురిలో ఒక బాలిక చావుకి గురవుతుంది. 50 శాతం బాల బాలికలకు పోషకాహారం అందడం లేదు. బాలురలో 5 గురిలో ఒకరు, బాలికలలో ఇద్దరిలో ఒకరు పోషకాహారం పొందడం లేదు. ఇక 2 ఏళ్ల వయస్సు లోపు శిశువులలో 58శాతం మందికి పూర్తిగా వాక్సి నేషన్ అందడం లేదు. 24శాతం పిల్లలకి ఎలాంటి వాక్సినేషన్ ఇవ్వలేదు. దేశంలో 60 శాతం పిల్లలు రక్తహీనతకు గురవుతున్నారు. దేశంలోని వ్యాపార లైంగిక వ్యక్తుల్లో 40శాతం బాల బాలికలే.
''ఇంటర్ నేషనల్ సెంటర్ ఆన్ లేబర్'' నివేదిక ప్రకారం దేశంలో 25 మిలియన్లు నుంచి 30 మిలియన్ల వరకు బాల కార్మికులున్నారు. దేశంలో 50 శాతం బాలలు పాఠశాలలకే వెళ్ళడంలేదు. ఇలా చెప్పుకొంటూ పొతేే దేశంలో బాలల జీవితం కన్నీటిమయం.
అందరూ స్పందించాలని " ఫోరం ఫేర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ " వేడుకుంటోంది.. :
నేటి బాలలే రేపటి పౌరులు. నవభారత నిర్మాతలు. ఈ మాటలు వినడానికి ఎంతో వింపుగా వున్నాయి. కాని ఇప్పుడు చర్చించిన స్థితిగతులు పరిశీలిస్తే రేపటి పౌరులకు మనం ఇస్తున్న ప్రోత్సాహం ఇదా? అని ఆలోచించక తప్పదు. ప్రపంచంలో మరే దేశంలో లేనంత పెద్ద సంఖ్యలో పిల్లలున్న దేశం మనదే. దేశంలో నేడు 18 సంవత్స రాలలోపు వున్న వారి సంఖ్య 45 కోట్లు. ఇటువంటి యవతరాన్ని ఆరోగ్యకరమైన వాతావరణంలో పెంచి, ఆరోగ్యకరమైన పౌరులుగా తీర్చి దిద్దాల్సిన భాధ్యత అందరిపై ఉన్నది. ముఖ్యంగా తల్లి దండ్రులు తమ బిడ్డలకు సకాలంలో వాక్సినేషన్ ఇప్పించాలి. విద్యను అందించాలి. అదే విధంగా ప్రభుత్వం కూడా ఆర్యోగ్య, విద్యారంగ అభివృద్ధికి చిత్తశుద్ధితో నిధులు కేటాయించాలి. సమాజంలోని అందరూ బాలల సంక్షేమం తమ సంక్షేమంగా భావించి సంవత్సరంలో ఒక్కరోజు తమ సంపాదనను పిల్లల సంక్షేమానికి విరాళంగా ఇవ్వాలి. 'నేటి బాలలే రేపటి పౌరులు'' అనేది నినాదం కాకుండా విధానంగా మారితే దేశంలో బాలల జీవితం ఆనందదాయకం. మరి ఆరోజుకై అందరం స్పందిద్ధాం.. చేయూత నిద్ధాం.. అంతే గానీ పిల్లలకు ఓట్లు లేవుకదా.? వీరివల్ల మనకేమిటి లాభం అని రాజకీయ నాయకులు అనుకోరాదు.. రేపటి రోజు వారే మీ భవిష్యత్తును నిర్ణయిస్తారు అన్న వాస్తవాన్ని గ్రహించాలి..