గణేశ మండపాలా.. గల్లీలను మూసేసే అవరోధాలా..?
- భక్తి ఉన్మాదంగా మారితే భయంకర పరిస్థితులు నెలకొంటాయి..
- మంటపాల పేరుతో రోడ్లను ఆక్రమిస్తే జనజీవనం అస్తవ్యస్తమౌతుంది..
- వాహనదారులకు, పాదచారులకు తీరని అసౌకర్యం కలుగుతుంది..
- దేవుడి పేరుతో చేస్తున్న దౌర్జన్యకాండలకు అంతం లేదా..?
- ఇతరులకు ఇబ్బంది కలిగిస్తూ పూజలు చేస్తే పుణ్యం వస్తుందా..?
- చెవులు చిల్లులు పడే డీజేలు.. తాగి తందనాలు ఇదేనా దేవుడి సేవ..?
- ఉత్సవాలు చేసుకోవద్దని ఎవరూ చెప్పడం లేదు.. ఒక పద్దతిగా ఉండాలన్నదే చర్చ..
- హంగు, ఆర్భాటాలు ఆ విగ్నేశ్వరుడికి నచ్చుతాయా..? వరాలు కురిపిస్తాడా..?
- బలవంతపు చందాలు వసూలు చేసి, మండపాలు కడితే ముక్తి లభిస్తుందా..?
- ఇదేమి భక్తి.. ఇదేమి పద్ధతి..? అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్న మేధావులు..
- ప్రభుత్వం దృష్టిపెట్టి ఈ పద్దతికి చరమ గీతం పాడాలి..
- శాంతియుత వాతావరణంలో గణేశ నవరాత్రులు జరగాలి..
- ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ అందిస్తున్న ప్రత్యేక కథనం..
భక్తి అనేది పవిత్రం ఉండాలి.. మనసులో ఉండాలి.. పారవశ్యంతో మైమరచిపోవాలి.. అంతేగానీ ఆర్భాటాలకు పోయి, ఒకరిని మించి ఒకరు భారీ ఎత్తున ఖర్చుపెడుతూ, పెద్ద పెద్ద మండపాలు కడుతూ.. భక్తిని ప్రదర్శించడం ఎంతవరకు భావ్యం.. దానికోసం అయ్యే ఖర్చును బలవంతంగా చందాల రూపాన వసూలు చేయడం మరొక దుర్మార్గపు చర్య.. రోడ్డు మధ్యలో మండపాలు నిర్మిస్తూ.. విద్యుత్ దీపాలతో అలంకరిస్తూ.. డీజే సౌండ్లతో అందరినీ ఇబ్బంది పెడుతూ గణేశ నవరాత్రులు జరుపుకోవడం ఎంతవరకు కరెక్ట్.. వీరు చేస్తున్న హంగామా వల్ల ఎంతమందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయో ఒక్కసారైనా ఆలోచించారా..? ట్రాఫిక్ జాన్స్, యాక్సిడెంట్స్, క్యారెట్ షాకులు ఏర్పడటం.. ఎంత ప్రాణనష్టం జరుగుతుందో తెలుస్తోందా..? అసలు ఎందుకీ ఉన్మాదం..? ఒక్కసారి అందరూ.. ముఖ్యంగా యువత ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "..
హైదరాబాద్ : గణేష్ నవరాత్రులు వచ్చేశాయి.. అందరిలో జోష్ పెరిగింది.. ఇక ఎక్కడ చూసినా గణేశ మండపాలు, పూజలు, భజనలు, సాంస్క్రుతిక కార్యక్రమాలు, ప్రసాదాల వితరణ.. ఇలా ఈ నవరాత్రులు వైభవోపేతంగా గడిచిపోతాయి.. ఇది చాలా సంతోషించదగిన విషయమే.. హైందవ ధర్మాన్ని పాటిస్తూ.. హిందూ ధర్మ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావడం ముదావహం.. ప్రతి ఒక్కరిలోనూ ముఖ్యంగా యువతలో భక్తి భావం ఏర్పడటం ఆనందదాయకం.. కానీ ఇలా భక్తిని అడ్డుపెట్టుకుని కొందరు ఆకతాయిలు, కొందరు ముష్కరులు సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం అన్నది క్షంతవ్యం కాదు.. ఇది వాంఛనీయం అసలే కాదు..
భారతదేశంలోని ప్రముఖ పట్టణాల్లో గణేశ నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతాయి.. ముంబై, బెంగుళూరు, లాంటి పట్టణాలతో పాటు హైదరాబాద్ మహానగరంలో కొన్ని దశాబ్దాలుగా గణేశ ఉత్సవాలు నిరాటంకంగా జరుగుతున్నాయి.. ముఖ్యంగా ఖైరతాబాద్ గణేషుడు, పాతబస్తీ గణేషుడు, బాలాపూర్ గణేషుడు ఇలా అన్ని నగరంలోని ప్రాంతాల్లో గణేశ ఉత్సవాలు భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు.. అలాగే గణేశనిమజ్జనం రోజు.. మండపాల దగ్గర నివేదించిన లడ్డూల వేలంపాట ఒక ప్రత్యేకతను సంతరించుకుంది.. లక్షల్లో పాట పాడి గణేష్ లడ్డూను సొంతం చేసుకుంటారు.. ఆ లడ్డూను పరమ పవిత్రంగా భావిస్తారు.. అందరికి పంచుతారు.. ఇది శుభదాయకం.. కానీ అసలు సమస్య ఏమిటంటే.. ఉత్సవాలు చేసుకోవద్దని ఎవరూ అభ్యంతరం పెట్టడం లేదు.. కానీ ఉత్సవాల పేరుతో అలజడి సృష్టించడం మాత్రం తగదు.. ఒక బస్తీలో ఒక మండపాన్ని చూసి, మరొక మండప నిర్వాహకులు వారికంటే గొప్పగా ఉండాలని పెద్ద పెద్ద గణేశ విగ్రహాలను నెలకొలుపుతూ ఉంటారు.. రోడ్లకు అడ్డంగా మండపాలను నిర్మిస్తారు.. సాధారణ జనజీవనానికి ఆటంకం కలిగిస్తుంటారు.. ఇదేం పద్ధతి అని ప్రశ్నిస్తే దౌర్జన్యం చేయడానికి కూడా కొందరు వెనుకాడరు.. భగవంతుడు కోరుకునేది ఇది కాదు కదా..? ఇలా చేస్తే పుణ్యం రాకపోగా అంతులేని పాపాన్ని మూటకట్టుకోవలసి వస్తుంది.. ఇది వ్యక్తులకే కాకుండా ఆ వ్యక్తుల కుటుంబాలకు కూడా అరిష్టమే..
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు పర్యావరణానికి హానీ :
పెద్దలు మేధావులు ఎప్పుడూ చెబుతుంటారు.. పర్యావరణానికి హానీ కలిగించని మట్టి విగ్రహాలు ప్రతిష్టించాలని.. అలాగే ప్రభుత్వం కూడా హెచ్చరిస్తూనే ఉంటుంది.. జీ.హెచ్.ఎం.సి. ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను కూడా సరఫరా చేస్తుంది.. కొన్ని సంస్థలు కూడా మట్టి విగ్రహాలను అందిస్తున్నాయి.. పూర్తిగా ఉచితంగా.. కానీ ఎంతమంది ఈ విగ్రహాలను తీసుకుని ప్రతిష్టిస్తున్నారు..? ఒక్కసారి పునరాలోచన చేసుకోవాలి.. మట్టి విగ్రహాలైతే నిమజ్జనం అనంతరం నీటిలో సులువుగా కరిగిపోతుంది.. ఎలాంటి రసాయనాలు ఉండవు.. అలాగే ఎలాంటి హానీ కరమైన, ప్రమాదకరమైన లోహాలు ఉండవు.. దీంతో పర్యావరణానికి, భక్తులకు కూడా ఏవిధమైన ప్రమాదం సంభవించకుండా ఉంటుంది..
బలవంతపు వసూళ్లకు పాల్పడటం దుర్మార్గం :
విగ్నేశ్వరుడు ఇంత సంపన్నంగా.. ఇంత గొప్పగా నా విగ్రహాలు ప్రతిష్టించాలని కోరుకోడు.. భక్తులే ఉన్మాదులుగా మారి ఖరీదైన భారీ విగ్రహాలను నెలకొల్పుతుంటారు.. దీనికోసం డబ్బులు కావాలి కదా..? అందుకు చందాల రూపంలో బలవంతపు వసూళ్లకు పాలుపడుతుంటారు.. ఇది గర్హనీయం.. చట్టప్రకారం నేరం కూడా.. కొండలు ఉన్నవాళ్లు వుంటారు కొందరు లేని వాళ్ళు ఉంటారు.. అందరినీ బలవంతం చేయడం సబబు కాదు.. మీ దగ్గర ఉంటే, మీ శక్తి కొలది మట్టి విగ్రహాలను నెలకొల్పి శాంతిగా, భక్తిగా పూజలు చేయండి.. అంతే కానీ ఇలాంటివి చేస్తే గణేష్ మహారాజ్ మిమ్మల్ని క్షమించడు..
హంగు, ఆర్భాటాలు మరో ఎత్తు :
ఇక మండపాల నిర్మాణం విషయానికి వస్తే.. భారీ ఎత్తున హంగులతో నిర్మిస్తున్నారు.. ఒకరికి ఒకరు పోటీ పడుతూ లక్షలు ఖర్చుపెట్టి మండపాలు నిర్మిస్తారు.. దీనితో జనజీవనానికి ఆటంకం కలుగుతుంది.. ట్రాఫిక్ స్థంభించిపోతుంది.. లెక్కలేకుండా విద్యుత్ కాంతులతో దీపాలు ఏర్పాటు చేస్తారు.. పొరబాటున ఏదైనా విద్యుత్ అంతరాయం కలిగి ప్రమాదం సంభవించే అవకాశాలు లేకపోలేదు.. అదే విధంగా శబ్ద కాలుష్యం వెదజల్లే డీజే సౌండ్లు ఒకవైపు.. మండపాల దగ్గర హంగామా చేసే ఆకతాయిలు ఎక్కువైపోతున్నారు.. రాత్రుళ్ళు మండపాల దగ్గర ఉంటే కొంతమంది మండపంలోని లిక్కర్ తీసుకుని అటువైపు వచ్చే వాళ్ళను ఆటపట్టించడం, వారిపై దాడులు చేయడం కూడా చూశాం..
ఇక నిమజ్జనం మరొక ప్రసహనం :
నవరాత్రులు ఒక ఎత్తు అయితే.. నిమజ్జనం ప్రక్రియ మరొక ఎత్తు.. హైదరాబాద్ మహానగరం పూర్తిగా స్తంభించి పోతుంది.. విపరీతమైన ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది.. ఒక్కోసారి, చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు ప్రమాదాల బారినపడి చనిపోతుంటారు.. ప్రభుత్వం, పోలీసులు, జీ.హెచ్.ఎం.సి. అధికారులు సిబ్బంది తమ విధులు నిర్వహిస్తున్నా.. కొందరు రౌడీ మూకలను అరికట్టడం కష్టసాధ్యం అవుతోంది.. పైగా మతాల ఘర్షణ ఏర్పడటం.. కులాలకు, మతాలకు అతీతంగా సంబురాలు జరుగుతూ ఉంటాయి.. ఈ ప్రక్రియలో కొందరు ముష్కరులు ప్రవేశించి అలజడులు సృష్టిస్తారు.. దీనిని నివారించడం ఎంతో అవసరం..
చివరిగా చెప్పుకునేది ఏమిటంటే.. ఈ గణేశ నవరాత్రులు ఆనందదాయకంగా.. భక్తి పారవశ్యంతో జరుపుకోండి.. ఎవరికీ ఇబ్బందులు కలుగకుండా చిన్న చిన్న చిన్న మండపాలను నిర్మించుకోండి.. ఎలాంటి శబ్ద కాలుష్యం, వాతావన కాలుష్యం లేకుండా జాగ్రత్తలు తీసుకోండి.. ముఖ్యంగా చిన్నసైజు మట్టి విగ్రహాలను మాత్రమే ప్రతిష్టించండి.. ప్రభుత్వానికి, అధికారులకు సహకరించండి.. సంతోషాలు వెళ్లి విరిసేలా.. హిందూ ధర్మం పరిఢవిల్లేలా.. మత సామరశ్యం వెల్లివిరిసేలా ఈ గణేశ నవరాత్రులు జరుపుకోవాలని " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ" భక్తాదులను ప్రార్ధిస్తోంది.. జై గణేశా.. జై జై గణేశా..