ఆగస్టు 15 నాటికి రెవెన్యూ సదస్సుల దరఖాస్తుల పరిష్కారానికి కృషి....
వెల్లడించిన జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
సాదా బైనామా దరఖాస్తులకు నోటీసులు జారీ చేయాలి
ప్రతి మండలంలో 10 శాతం దరఖాస్తులను ర్యాండంగా చెక్ చేస్తాం
కలెక్టరేట్ నుంచి రెవెన్యూ సదస్సుల దరఖాస్తుల పరిష్కారంపై మండల
తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన జిల్లా కలెక్టర్
ఖమ్మం :
ఆగస్టు 15 నాటికి రెవెన్యూ సదస్సుల క్రింద వచ్చిన భూ సమస్యల దరఖాస్తుల పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ రెవెన్యూ సదస్సుల్లో ప్రజల నుంచి 75 వేల దరఖాస్తులు వచ్చాయని, వీటిలో సాదా బైనామా కు సంబంధించి ఉన్న 49 వేల దరఖాస్తులకు వెంటనే నోటీసులు జారీ చేయాలని అన్నారు.
సాదా బైనామా మినహాయించి పెండింగ్ ఉన్న దరఖాస్తులను మండలాల వారీగా ప్రస్తుత స్థితిగతులపై నివేదిక అందించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి దరఖాస్తు సంబంధించి నోటిసుల జారీ పూర్తి చేయాలని, రోజూ మండల స్థాయిలో కొన్ని దరఖాస్తుల పరిష్కారం పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకోవాలని, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆగస్టు 15 నాటికి రెవెన్యూ సదస్సు దరఖాస్తుల పరిష్కారం చేయడంలో మంచి పురోగతి సాధించాలని అన్నారు.
భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను తిరస్కరించే నేపథ్యంలో దానికి గల కారణాలను స్పష్టంగా తెలియజేయాలని కలెక్టర్ తెలిపారు. దరఖాస్తులను వేగంగా పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ఎక్కడా తప్పులు జరగడానికి వీలు లేదని అన్నారు. ప్రతి మండలంలో 10 శాతం దరఖాస్తులను జిల్లా స్థాయిలో ర్యాండమ్ గా చెక్ చేయడం జరుగుతుందని, భూ భారతి చట్టం నిబంధనలు పాటించని పక్షంలో చర్యలు ఉంటాయని కలెక్టర్ స్పష్టం చేశారు.
భూ భారతి దరఖాస్తులు పరిష్కారం అయ్యే వరకు రెవెన్యూ సిబ్బంది సెలవులు తీసుకోరాదని, ప్రతిరోజు రెవెన్యూ సదస్సులు దరఖాస్తుల పరిష్కారంలో పురోగతి ఉండాలని, ఈ వివరాలు రోజు నోటిఫై చేసిన నమునాలో రిపోర్ట్ చేయాలని అన్నారు.
డివిజన్ పరిధిలో వెనకబడిన మండలాలపై రెవెన్యూ డివిజన్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ సూచించారు. ప్రతి రోజు మండల తహసిల్దార్ లతో సమీక్షించుకుంటూ రెవెన్యూ సదస్సు దరఖాస్తుల పరిష్కారంలో పురోగతి ఉండేలా చూడాలని అన్నారు.
సాదా బైనామా దరఖాస్తులలో ముందు నోటీసులు జారీ చేయాలని, అనంతరం నిబంధనల ప్రకారం భూ భారతి చట్టం, సాదా బైనామా గైడ్ లైన్స్ ప్రకారం అర్హత ఉన్న దరఖాస్తులు పక్కన పెట్టుకోవాలని, హై కోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి ఆస్కారం ఉంటుందని అన్నారు.
అంతకుముందు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పై అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి తహసీల్దార్లతో సమీక్షిస్తూ స్థానిక ఎమ్మెల్యే, మంత్రులు, డిప్యూటీ సీఎం ల సమయం తీసుకొని పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీకి చర్యలు తీసుకోవాలని అన్నారు. లబ్దిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ర్యాండమైజేషన్ పద్ధతిలో కేటాయింపు చేయాలని అన్నారు.
వివిధ దశలలో పురోగతిలో ఉన్న 655 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో ఏన్కూరు లో 40 ఇండ్లను లబ్ధిదారులు ఆక్రమించారని, దీనిపై నివేదిక అందించాలని తహసిల్దార్ ను అదనపు కలెక్టర్ ఆదేశించారు. ఇండిపెండెంట్ గా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పెండింగ్ పనులు ఇందిరమ్మ ఇండ్ల తరహాలో లబ్దిదారుల ద్వారా పూర్తి చేయాలని, ఆసక్తి అర్హత గల లబ్ధిదారులను వారం రోజులలో ఎంపిక చేయాలని ఆదేశించారు.
ఈ వీడియో సమావేశంలో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఖమ్మం ఆర్డీఓ నరసింహారావు, జిల్లాలోని తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.