
ఖమ్మం ప్రతినిది :
పేద ప్రజల కష్టాలను తీర్చడమే నిజమైన ప్రజాప్రతినిధి లక్షణమని నమ్ముతూ... తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పాలేరు నియోజకవర్గ ప్రజలకు అండగా నిలుస్తున్నారు. వైద్య సహాయం అవసరమైన లబ్ధిదారుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) చెక్కులను వేగవంతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఖమ్మం క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీకి చెందిన లబ్ధిదారులకు ఈ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... మంత్రి పొంగులేటి కృషితో పాలేరు నియోజకవర్గానికి ప్రతి నెలా దాదాపు రూ. 1 కోటి విలువైన సీఎంఆర్‌ఎఫ్ నిధులు మంజూరవుతున్నాయని తెలిపారు. ఈ నిధులతో నెలకు 400 మందికి పైగా లబ్ధి పొందుతున్నారని వెల్లడించారు. తాజా పంపిణీలో 83 మంది లబ్ధిదారులకు సుమారు రూ. 29 లక్షల విలువ చేసే చెక్కులను అందజేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని దయాకర్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎంఆర్‌ఎఫ్ సహాయం అందుకున్న పేద ప్రజలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమకు ప్రభుత్వం అందించిన ఈ సహకారం ఎంతో గొప్పదని కృతజ్ఞతలు తెలిపారు.