
యాదాద్రి భువనగిరి జిల్లా :
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్ధాన పరిధిలో గల దుకాణాల యజమానులతో శుక్రవారం ఆలయ ఈవో ఎస్ వెంకట్రావు ఆదేశాలతో డిఈవో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేయడం జరిగింది. ప్రతీ షాపులో విక్రయించే వస్తువుల ధరలను స్పష్టంగా చూపేటట్లుగా స్థిర ధరల బోర్డులను ముందుభాగంలో భక్తులకు కనపడేటట్లు ఏర్పాటు చేయాలి. ఎటువంటి అధిక ధరలు లేదా నిర్ణీత ధరలకు విరుద్ధంగా విక్రయించడం అనుమతించకూడదని తెలిపారు. భక్తులకు పారదర్శక సేవలు అందించడం మరియు మోసపూరిత చర్యలను నివారించడం కోసం ఈ చర్యలు తీసుకోవడం జరిగినది. దీని అమలుపై దేవస్థానం తరచుగా తనిఖీలు నిర్వహిస్తుంది. ప్రతీ లీజుదారు తమకు దేవస్థానం కేటాయించిన స్థలంలో మాత్రమే వ్యాపారం నిర్వహించాలి, కేటాయించిన స్థలం ముందు మార్గాలు లేదా పక్కనున్న షాపుల ప్రదేశాల్లోకి ఎటువంటి ఆక్రమణ జరగకూడదు. అలాగే లీజు ఒప్పందంలో పేర్కొన్న అనుమతించిన వ్యాపారం మాత్రమే చేయాలి. అదనపు లేదా అనుమతించని వ్యాపార చర్యలు లీజు నిబంధనల ఉల్లంఘనగా పరిగణించబడతాయని పేర్కొన్నారు. లీజు హోల్డర్లు తమ దుకాణాలలో దేవస్థానం అనుమతించిన నమోదు చేసిన వ్యక్తులచే మాత్రమే పని చేయించాలి, బయటి వ్యక్తులను నియమించడం, అనుమతి లేని వారిని పెట్టుకోవడం, లేదా షాపులను ఇతరులకు సబ్ లీజుకు ఇవ్వడం పూర్తిగా నిషేధించబడింది. ఈ నియమం షాపులలో బాధ్యత, క్రమశిక్షణ మరియు భక్తుల భద్రత కోసం అమలు చేయబడుతుంది. ఈ అంశంలో ఎటువంటి ఉల్లంఘన జరిగినా లీజు రద్దు వరకు చర్యలు తీసుకొనబడతాయి. ప్రతీ లీజుదారు దేవస్థానం రూపొందించిన నిబంధనలను ఎటువంటి మార్పు లేకుండా కచ్చితంగా అనుసరించాలని, పై సూచనలకు వ్యతిరేకంగా వ్యవహరించడం లేదా దేవాలయానికి విచ్చేసే భక్తులకు ఇబ్బందులు కలిగించడం వంటివి తీవ్రంగా పరిగణించబడుతుంది. ఉల్లంఘన తీవ్రతను బట్టి జరిమానాలు, లైసెన్స్ నిలిపివేత లేదా లీజు రద్దు వంటి కఠినమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. దేవాలయాన్ని సందర్శించే భక్తులకు సౌకర్యమైన, సురక్షితమైన మరియు శ్రద్ధాభరితమైన సేవలందించవలెనని సూచించారు. ఈ సమావేశంలో సహాయ కార్యనిర్వహణాధికారులు, సీఎస్ఓ- ఎస్పిఎఫ్ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.