బాలల పరిరక్షణలో భాగస్వాముల పాత్ర కీలకం..!
కడప, జూలై 23(భారత శక్తి) : బాలల రక్షణ, వారి హక్కుల పరిరక్షణలో సంబందిత కమిటీల సభ్యుల భాగస్వామ్యం, వారి పాత్ర అత్యంత కీలకమైనవని.. ఐసిడిఎస్ పీడి శ్రీలక్ష్మి పేర్కొన్నారు.
కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలులో "బాలల రక్షణలో భాగస్వాముల పాత్ర" అనే అంశంపై.. జమ్మలమడుగు మరియు పులివెందుల రెవెన్యూ డివిజన్లలో ఉన్న తహసీల్దార్లు, ఎంపీడీఓలు, బాల సంక్షేమ పోలీసు అధికారులు, మండల విద్యాధికారులకు ఒక్కరోజు అవగాహన వర్క్‌షాప్ నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా.. మిషన్ వాట్సల్యా పథకంలో భాగంగా, బాలల రక్షణలో కీలకంగా వ్యవహరించే అధికారులైన తహసీల్దార్లు, మండల అభివృద్ధి అధికారీలు (MPDOs), బాల సంక్షేమ పోలీస్ అధికారులు (CWPOs), మండల విద్యా అధికారులు (MEOs) పాత్రపై విశేష అవగాహన, చర్చలు నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా.. జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి డి.శ్రీలక్ష్మి వర్క్‌షాప్‌ను ప్రారంభించి, బాలల రక్షణలో ప్రతి విభాగం సమన్వయం అవసరమన్నారు. పిల్లలకు సంబంధించిన కేసుల్లో వీరందరి పాత్ర ఎంతో కీలకమని, JJ చట్టం - 2015, POCSO చట్టం - 2012, బాలల వివాహ నిషేధ చట్టం వంటి చట్టాల అమలులో ఈ అధికారుల బాధ్యతలు స్పష్టంగా ఉండాలని అన్నారు.
వర్క్‌షాప్‌లో ముఖ్యాంశాలు..:
1) పిల్లలకు మానవీయ దృక్పథంతో సేవలు అందించడం
2) బాలల వివాహాల నిరోధంలో తహసీల్దార్ల సహకారం
3) సంక్షేమ పథకాల అమలులో MPDOల పాత్ర
4) బాలలపై నేరాల విచారణలో CWPOల బాధ్యతలు
5) స్కూళ్లలో బాలల రక్షణపై MEOల పాత్ర, అవగాహన కార్యక్రమాలు
తదనంతరం వర్క్ షాప్ నందు పాల్గొన్న అధికారులు అందరికీ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారినీ డి .శ్రీలక్ష్మి సర్టిఫికెట్స్ ఇవ్వడమైనది. చివరగా, అన్ని విభాగాల సమన్వయంతోనే బాలల రక్షణ సాధ్యమవుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా శిశు సంరక్షణ అధికారులు, సమాజ సంక్షేమ శాఖ ప్రతినిధులు, బాలల హక్కుల పరిరక్షణలో పని చేసే స్వచ్ఛంద సంస్థలు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.