ఆలయ ఘాట్ రోడ్డుకు NOC నిరాకరించిన వక్ఫ్ బోర్డు

ఆలయ ఘాట్ రోడ్డుకు NOC నిరాకరించిన వక్ఫ్ బోర్డు

నల్గొండ, భారత శక్తి ప్రతినిధి, జూలై 18:
వక్ఫ్ కోరలు పీకేశామని.. బోర్డులో సవరణలు చేశామని చెప్పుకున్నా.. ఆ రాక్షసత్వానికి నిదర్శనగా మారుతోన్న ఘటనలు చాలానే ఉన్నాయి. తాజాగా ఓ ఆలయానికి అనుబంధంగా జరుగుతోన్న అభివృద్ధి పనికి వక్ఫ్ బోర్డ్ అడ్డుగా నిలిచింది. అసలే తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆపై మైనార్టీ అనుకూల విధానాలు.. ఇంకేముంది.. వక్ఫ్ కు జీ హుజూర్ అంటూ ప్రభుత్వం ఆ పనుల జోలికి వెళ్లకుండా ఆగిపోయింది. అది రూ.140 కోట్ల ప్రాజెక్ట్. ఓ గుట్టపైకి ఘాట్ రోడ్డు నిర్మాణం. దీని ద్వారా రెండు ఆలయాలకు కనెక్టివిటీ ఉండటమే కాకుండా.. పర్యాటకానికి కూడా ప్రోత్సాహం ఇచ్చినట్లవుతుంది. భక్తుల రాకపోకలకు సులువవుతుంది. సదూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులకు సౌకర్యంగా ఉంటుంది. ఇలాంటి బృహత్తర ప్రాజెక్ట్ కు వక్ఫ్ గండం పట్టుకుంది. ఘాట్ రోడ్డు నిర్మించతలపెట్టిన ఆ ప్రాంతం తమదే అంటోంది వక్ఫ్. అది తమ పరిధిలో ఉందని.. దానికి యజమాని వక్ఫ్ అని.. రోడ్డు నిర్మాణానికి NOC సర్టిఫికేట్ జారీ చేయడానికి నిరాకరించింది.

నల్గొండలో శతాబ్ధాల చరిత్ర కలిగిన బ్రహ్మంగారి గుట్టపై వెలసిన పురాతన దుర్గాదేవీ ఆలయానికి, బ్రహ్మంగారి మఠానికి మధ్య ఘాట్ రోడ్డు నిర్మాణానికి రూ.140 కోట్ల తో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సొంత జిల్లా కావడంతో.. నిర్మాణ పనులకు సంబంధించిన పనులు శరవేగంగా మొదలయ్యాయి. శాఖాపరమైన అనుమతులు వచ్చాయి. టెండర్ల ప్రకటన కూడా చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 6 న ఘాట్ రోడ్డు నిర్మాణ పనులు కూడా ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. 

Read More దుర్గా నగర్ కాలనీలో జరుగుతున్న భూగర్భ డ్రైనేజ్ పైప్ లైన్ పనుల పరిశీలన

అంతా బాగుందన్నకున్న సమయంలో..
 అంతే.. సీన్ లోకి వక్ఫ్ బోర్డ్ ఎంటర్ అయ్యింది. ఆ ప్రాంతం తమదంటూ వాదనలకు దిగింది. రోడ్డు నిర్మాణం చేపడుతోన్న ఆ భూమి తమదని వాదించింది. తమ అనుమతి లేకుండా టెండర్ల ప్రకటన చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనికి NOC జారీ చేసేందుకు వక్ఫ్ బోర్డ్ సీఈవో నిరాకరించారు. దీంతో ఘాట్ రోడ్డు నిర్మాణ పనులు నిరవధికంగా నిలిపెయ్యాల్సి వచ్చింది. వక్ఫ్ బోర్డు జోక్యం కారణంగా, ప్రతిష్టాత్మకమైన ఆలయ అభివృద్ధి పనులు అకస్మాత్తుగా ఆగిపోయినట్లయ్యింది. దీనికి సంబంధించి జూలై 9, 2025 నాడు రోడ్లు, భవనాల శాఖకు వక్ఫ్ బోర్ట్ అధికారికంగా ఓ లేఖ రాసింది. అధికారుల అత్యుత్సాహం, అనాలోచిత నిర్ణయాలతో వక్ఫ్ ఆస్తులు కోల్పోతున్నాయని తెలిపింది. వక్ఫ్ చట్టం 1995 ప్రకారం.. ఆ భూమి వక్ఫ్ ఆస్తి అని పేర్కొంది. స్పష్టమైన అనుమతి లేకుండా ప్రజా అవసరాలకు దానిని ఉపయోగించరాదని లేఖలో స్పష్టం చేసింది. ఒకవేళ ఘాట్ రోడ్డు వేయాలంటే ముందుగా వక్ఫ్ అనుమతి తీసుకోవాలని.. అలాగే రోడ్డు వల్ల నష్టపోతున్న భూమికి సరిపడా.. వక్ఫ్ బోర్డు వారికి నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని సదరు లేఖలో పేర్కొంది.
 
అది లతీఫ్ సాహెబ్ గుట్ట..?
 వాస్తవానికి ఆలయాలు కొలువైన ఆ గుట్టకు బ్రహ్మంగారి గుట్టగా దశాబ్దాల నుంచి పేరు ఉంది. అయితే వక్ఫ్ రికార్డుల్లో మాత్రం.. ఆ గుట్టను లతీఫ్ సాహెబ్ గుట్టగా పేర్కొన్నారు. అందుకే ఆ గుట్టపై ఎలాంటి నిర్మాణ పనులు చేయాలన్నా.. వక్ఫ్ అనుమతి ఉండాల్సిందే అని బోర్డు సభ్యులు స్పష్టం చేస్తున్నారు. దీనికి సంబందించి.. నల్గొండ జిల్లాకు చెందిన ముస్లీం మైనార్టీ నాయకులు మీడియా సమావేశం కూడా నిర్వహించారు. 

Read More కడెం పోలీసు స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ.

దేవాలయ అభివృద్ధిపై వక్ఫ్ పంజా..
కేంద్రం గత ఏప్రిల్ లో వక్ఫ్ సవరణ బిల్లును తీసుకొచ్చి.. దాన్ని చట్టరూపంగా అమలు చేస్తోంది. అయినా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రభుత్వాలు వక్ఫ్ సవరణ చట్టాన్ని అమలు చేయడం లేదు. దీంతో ఆయా ప్రాంతాల్లో 1995 వక్ఫ్ చట్టమే అమల్లో ఉంది. ఈ క్రమంలో తెలంగాణలో దేవాలయ అభివృద్ధి పనులపై వక్ఫ్ అడ్డుకున్నట్లైంది. ఆలయాల అభివృద్ధిని అడ్డుకునేందుకు మతపరంగా వక్ఫ్ ను ఆయుధంగా ఉపయోగిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
 
మంత్రికి ఎదురుదెబ్బ
వక్ఫ్ బోర్డ్ ఎదురుతిరగడంతో జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. వాస్తవానికి గుట్టపైకి ఘాట్ రోడ్డు నిర్మాణంతో.. భూముల ధరలు పెంచుకోవచ్చని.. తద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగించుకోవచ్చని మంత్రిగారి అనుచరులు ప్రణాళిక వేశారనే ఆరోపణలున్నాయి. కానీ మధ్యలోకి వక్ఫ్ ఎంటర్ కావడంతో.. అసలుకే ఎసరు వచ్చినట్లైంది.

Read More రైతులు ధైర్యంగా ఉండండి

మరి ప్రభుత్వం స్పందన ఏంటి..?
బుజ్జగింపు రాజకీయాలకు పెట్టింది పేరైన కాంగ్రెస్ ప్రభుత్వం.. మైనార్టీల జోలికి వెళ్తుందని అనుకోవడం పెద్ద భ్రమ. ఎప్పుడైతే ఘాట్ రోడ్డు నిర్మించతలపెట్టిన గుట్ట తమదని చెప్పిందో.. అప్పుడే ఆ పనులు ఆగిపోయినట్లే అని అనుకోవచ్చు. ఆ మధ్య తబ్లీ గీ జమాతే మీటింగ్ కోసం ఏకంగా 2.5 కోట్లు బడ్జెట్ కేటాయించిన చరిత్ర కలిగిన రేవంత్ రెడ్డి సర్కార్ హయాంలో.. వక్ఫ్ నిర్ణయాన్ని ఎదుర్కుంటారని ఎవరూ అనుకోవడం లేదు. అయితే ఆందోళనకరమైన విషయం ఏంటంటే.. స్థానిక ఇస్లామిక్ గ్రూపులు, మైనారిటీ నాయకులు.. బోర్డు ఆధీనంలోని 530 ఎకరాల భూమిని.. మైనారిటీ కుటుంబాలకు కేటాయించాలనే డిమాండ్లు చేస్తున్నారు. దీంతో ఘాట్ రోడ్డు నిర్మాణం అనేది వాస్తవరూపం దాల్చడం చాలా కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Read More మూసీ న‌ది గ‌ర్భంలో ఆక్ర‌మ‌ణ‌ల తొల‌గింపు

About The Author