భారతం పంచమ వేదం,భగవద్గీత జీవన ప్రబోధం
ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చౌడూరి నరసింహారావు
హైదరాబాద్, భారత శక్తి ప్రతినిధి, జూలై 18:
సనాతన హైందవ ధర్మం లో శ్రీ వేదవ్యాస మహర్షి చే చెప్పబడిన అష్టాదశ పురాణములు ఒక ఎత్తైతే, శ్రీమన్మహాభారతం మరొక ఎత్తు అని, భారతం పంచమ వేదంగా ప్రసిద్ధికెక్కిందని, మానవ జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు చక్కని పరిష్కార మార్గాలను సూచించిన శ్రీమద్ భగవద్గీత జీవన ప్రబోధం గాను, జీవన గీత గాను, ఖ్యాతినొందిందని, భగవద్గీత ఉన్నందు వల్లనే మహాభారతానికి పంచమ వేదంగా ఖ్యాతి కలిగిందని, అంతటి మహత్తరమైన గీతను పెద్దలు, పిల్లలు అందరూ కలిసి కనీసం ప్రతిరోజు ఐదు శ్లోకాలనైనా సామూహికంగా గీతా పారాయణం చేయాలని, మనిషి తలరాతను మార్చగలిగే శక్తివంతమైన తరుణోపాయం కేవలం భగవద్గీతకు మాత్రమే ఉందని, అందుకే బాలబాలికలకు ప్రాథమిక స్థాయిలో పాఠ్యాంశ పుస్తకాల్లో గీతా శ్లోకాలను బోధించాలని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చౌడూరి నరసింహారావు అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్ లిబర్టీ రోడ్డులో వేంచేసియున్న సుప్రసిద్ధమైన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో తిరుమల తిరుపతి దేవస్థానములు ధర్మ ప్రచార పరిషత్ వారు ఈ నెల 16, 17 తేదీల్లో మహాభారతం భగవద్గీతల పై బ్రహ్మశ్రీ చౌడూరి నరసింహారావు ధార్మిక ప్రవచన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ చౌడూరి నరసింహారావు 16న మహాభారతంపై, 17న భగవద్గీత పై అనర్గళంగా ప్రసంగించారు. వారు తమ ప్రసంగంలో యువతను దృష్టిలో ఉంచుకొని మహాభారతం, భగవద్గీత లు నేటి యువత వ్యక్తిత్వ వికాసానికి ఎలా దోహదపడగలవో.. భారతంలోని పలు అంశాలను, భగవద్గీతలోని అనేక శ్లోకాలను ఉదహరిస్తూ భీష్మ యుధిష్టిర పాత్రలను ప్రస్తావిస్తూ.. యువతలో వ్యక్తిత్వ వికాసానికి మనోధైర్యాన్ని కలిగించేందుకు భగవద్గీతను నిత్యం పారాయణ చేయలని ఉద్భోధిస్తూ... తమ ప్రసంగాన్ని కొనసాగించారు.
ఈ కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానములు ధర్మ ప్రచార పరిషత్ ప్రోగ్రాం అసిస్టెంట్ శ్రీ టి. హరినాథ్ పర్యవేక్షించారు. రాష్ట్రపతి అవార్డు గ్రహీత, రిటైర్డ్ హెడ్మాస్టర్ శ్రీ రఘు సతీష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చక్కని ప్రవచనం చేసిన ప్రవచనకర్త శ్రీ చౌడూరి నరసింహారావుకు ప్రోగ్రామ్ అసిస్టెంట్ టి. హరినాథ్ స్వామివారి దివ్య ప్రసాదంతో సత్కరించారు.