మణుగూరును ముంచుతున్న ముసురు
ఇంకా రెండు రోజుల వరకు ఇదే పరిస్థితి.
-వాగులు వంకలు పొంగుతూ రోడ్లన్ని జలమయం..
-అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు.
-మణుగూరు, జూలై 23 (భారతశక్తి): ఎడతెరిపి లేకుండా మంగళవారం రాత్రి నుండి కురుస్తున్న వర్షాలకు మణుగూరు పట్టణంలోని సుందరయ్య నగర్, వినాయక నగర్, శేషగిరి నగర్, బాలాజీ నగర్ జలమయమయ్యాయి. ప్రతి సంవత్సరం వానాకాలం వచ్చిందంటే ఇండ్లు, రహదారులు జలమయమై పోతున్నాయని మణుగూరు పట్టణ వాసులు వాపోతున్నారు. పట్టణంలోని కాలనీల్లో ఇళ్లలోకి వరద నీరు చేరి ఇంట్లో ఉన్న సామగ్రితో పాటు నిత్యవసరాలు తడిసిపొయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు డ్రైనేజీలు, కాలువలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రహదార్లు కూడా మోకాలోతు లో జలమయం కావడంతో వాహదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చినుకు పడితే పట్టణంలోని లోతట్టు ప్రాంత కాలనీల్లో ఏ ఒక్క రహదారి కూడా నడవడానికి వీలులేని పరిస్థితి నెలకొంది. వర్షపు నీరు సాఫీగా బయటకు పోలేని పరిస్థితి. ప్రతి సంవత్సరం వర్షాకాలం ఇలా వచ్చిన వరదలకు డ్రైనేజీలు పొంగి రోడ్లపై వరద పారుతుంటే నడవడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వచ్చిన వరదంతా బయటకు వెళ్లే మార్గం లేక ఇళ్ల చుట్టూ నీరు నిల్వ ఉంటుంది. ఈ నీటిలో విపరీతమైన దోమల చేరి మలేరియా డెంగ్యూ లాంటి భయంకరమైన సీజనల్ వ్యాధులు వస్తున్నాయని అంతే కాకుండా భయంకరమైన విష సర్పాల బెడదతో భయబ్రాంతులకు గురవుతున్నామన్నారు. వరద నీరు నిల్వ ఉండడంతో మరుగుదొడ్లు, ప్రహరీ గోడలు, శిథిలావస్థకు చేరిన ఇండ్లు కూలిపోయే పరిస్థితి నెలకొందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బూడిద రంగులో కురిసిన వర్షం...మంగళవారం రాత్రి నుండి ఎడతెరపి లేకుండా వర్షం పడుతుంది. ఈ నేపథ్యంలో బుధవారం గాంధీ బొమ్మ సెంటర్, బాపనకుంట, శివలింగాపురం ఉపరితల బొగ్గుగని పరిసర ప్రాంతాల్లో బూడిద రంగులో వర్షం కురిసింది. బూడిద వర్షాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరైతే బూడిద వర్షం ను వింతగా చూస్తున్నారు. చాలా మంది బూడిద కలర్ లో కురుస్తున్న వర్షాన్ని సెల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వచ్చిన ఫోటోలు జిల్లా వ్యాప్తంగా హల్‌చల్ చేస్తున్నాయి. బూడిద వర్షం పడడానికి కారణం ఏమిటని ఆసక్తికర చర్చ మండలంలో జరుగుతుంది.
అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు.... నైరుతి రుతుపవనాలు వలన రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ప్రజలు ఎవరూ బయటకు రావద్దని మండల అధికారులు ఎంపీడీఓ, శ్రీనివాసరావు, తహశీల్దార్ నరేష్, మణుగూరు సిఐ నాగబాబు, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ లు అప్రమత్తం చేస్తున్నారు.
అదేవిధంగా మంగళవారం రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కాలువలు, వాగులు, వంకలు ఉదృతంగా పొంగిపొర్లుతున్నాయని అత్యవసరమైతే కంట్రోల్ రూమ్స్ కు ఫోన్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. మణుగూరు డిఎస్పీ రవీందర్ రెడ్డి ముందస్తు చర్యల్లో భాగంగా సహాయక చర్యల్లో భాగంగా ఎన్.డి.ఆర్.ఎఫ్ బృందాలను అప్రమత్తం చేశారు. బుధవారం ఉదయం భద్రాచలం ఆర్డీవో దామోదర్ మణుగూరు పట్టణంలోని వరద ముంపుకు గురైన సుందరయ్య నగర్ లో స్థానిక మండల అధికారులతో కలిసి పర్యటించారు. వరద నీరు నిల్వలు ఉండడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.