నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు..
దయనీయంగా ప్రభుత్వ ఆసుపత్రుల ప్రస్తుత పరిస్థితి
స్పెషల్ కరస్పాండెంట్, భారత శక్తి, హైదరాబాద్ :
* సర్కారు ఆసుపత్రికి వెళ్లాలంటేనే వణుకు..
* వసతుల లేమి..డాక్టర్ల నిర్లక్ష్యం..
* చేతికి దెబ్బ తగిలితే కన్నుకు ఆపరేషన్ చేసే పరిస్థితులు..
* క్వాలిఫైడ్ డాక్టర్లు ఉన్నా వైద్యం సున్నా..
* లక్షల్లో వేతనాలు తీసుకుంటూ.. ప్రైవేట్ క్లినిక్ ల నిర్వహణ..
* తమ వారి మెడికల్ షాపులకు రిఫర్ చేస్తున్న దైన్యం..
* సొంత డయోగ్నాస్టిక్ సెంటర్లు నడుపుతున్న గవర్నమెంట్ వైద్యులు..
* అవసరం లేకపోయినా టెస్టుల పేరుతో దోపిడీ..
* కొంతమంది నిజాయితీగా ఉన్నా ఎందుకూ పనికిరాని పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రులు..
* పట్టించుకోని ప్రభుత్వాలు.. కార్పొరేట్లకు కొమ్ము కాస్తున్న వైనం..
* ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసి..అక్రమార్జనలో మునిగితేలుతున్న దుర్మార్గం..
* సామాన్య, పేద ప్రజల తరఫున పోరాటం సాగిస్తున్న " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ"..
ఒకప్పుడు ప్రభుత్వ వైద్యశాలలు సలక్షణంగా సేవలు అందితుండేవి.. కాలానుగుణంగా కార్పొరేట్ కల్చర్ విస్తృతంగా వ్యాప్తి చెందడంతో.. సర్కారు వైద్యం అటకెక్కిపోయింది.. ప్రభుత్వాలు సైతం వైద్య వ్యవస్థపై శీతకన్ను వేసింది.. ఆసుపత్రులను పట్టించుకోవడం మానేసింది..దీంతో నిర్వహణా లోపం ఏర్పడటంతో ప్రభుత్వ ఆసుపత్రులు నీరుగారిపోయాయి.. అనుభవజ్ఞులైన, క్వాలిఫైడ్ డాక్టర్లు ఉన్నా పేదలకు వైద్యం అందడం గగనమై పోతోంది.. ఇందుకు అనేక కారణాలున్నాయి.. కార్పొరేట్ వైద్య రంగం కాలరక్కిసిలా విజృంభిస్తోంది.. వైద్యాన్ని లాభసాటి వ్యాపారంగా మార్చివేసింది.. రాజకీయ ప్రముఖులకు సంబంధించిన ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు రాజ్యమేలుతున్నాయి.. ప్రభుత్వాలు, వైద్య సంబంధిత అధికారులు సైతం ఈ కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలకు దాసోహం అంటున్నారు.. కేవలం దోపిడి అనే మార్గాన్ని ఎంచుకుని ముందుకు సాగుతున్నాయి.. ఇది ఎంతమాత్రం వాంఛనీయం కాదు.. ప్రస్తుత ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితిని వివరించే ప్రయత్నం చేస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "..
రాష్ట్రంలోని అనేక ఆసుపత్రుల్లో డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్లు తగినంతగా లేరు. ఒకే డాక్టర్ వందలాది మంది రోగులను పరీక్షించాల్సి వస్తోంది. నర్సులు కూడా ఒకే సమయంలో అనేక విభాగాల్లో విధులు నిర్వర్తించాల్సి రావడంతో సేవా నాణ్యత తగ్గిపోతోంది.
మౌలిక వసతుల లోపం :
ఆసుపత్రుల భవనాలు పాడైపోవడం, మంచాలు సరిపడకపోవడం, శుభ్రత లేకపోవడం వంటి సమస్యలు రోగులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. చాలా చోట్ల టాయిలెట్లు, తాగునీటి సౌకర్యం కూడా దయనీయంగా ఉంది.
ఔషధాల సరఫరా లోపం :
ప్రభుత్వం ఉచితంగా మందులు ఇవ్వాలని నిర్ణయించినా, చాలా సార్లు స్టాక్ పూర్తిగా ఖాళీ అయిపోతుంది. రోగులు బయట ఫార్మసీల నుంచి మందులు కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇది పేదలపై అదనపు భారంగా మారింది.
ఆధునిక పరికరాల కొరత :
స్కానింగ్, ఎక్స్-రే, ఆపరేషన్ థియేటర్ పరికరాలు పనిచేయకపోవడం లేదా సరిపడకపోవడం సాధారణంగా మారిపోయింది. ఫలితంగా అత్యవసర సేవలు అందించడంలో ఆలస్యం అవుతోంది. కొన్నిసార్లు ప్రాణనష్టానికీ దారితీస్తోంది.
అధిక రద్దీతో తలపట్టుకుంటున్న వైద్యులు :
ప్రైవేట్ ఆసుపత్రుల ఖర్చు భరించలేని వేలాది మంది రోగులు ప్రభుత్వ ఆసుపత్రులకే వస్తున్నారు. దీని వల్ల విపరీతమైన రద్దీ ఏర్పడుతోంది. ఒక్కో రోగికి సరైన సమయం కేటాయించలేక, పరీక్షలు కూడా త్వరగా ముగించేస్తున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రులు పేద ప్రజల కోసం ఒకే ఆధారం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సరైన సిబ్బంది, మౌలిక సదుపాయాలు, ఔషధాలు లేకపోవడం వలన ప్రజల నమ్మకం తగ్గిపోతోంది. వైద్య రంగాన్ని బలోపేతం చేయాలంటే ప్రభుత్వమే ముందుకు వచ్చి సిబ్బంది నియామకాలు, కొత్త పరికరాల కొనుగోలు, శుభ్రతపై దృష్టి పెట్టాలి. లేనిపక్షంలో “ప్రజల కోసం” అన్న నినాదం కేవలం నినాదంగానే మిగిలిపోతుంది.
ప్రజలు అప్పులు చేసి మరీ ప్రైవేట్ వైద్యం కోసం పరుగులు పెట్టాల్సిన అవసరం లేకుండా.. ఆరోగ్య శ్రీ లాంటి పథకాలపై కోట్లు కుమ్మరించే బదులు.. ఆ పైకాన్ని ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణకోసం ఖర్చుపెట్టగలిగితే పేదలు, సామాన్యజీవుల ఆరోగ్యాన్ని కాపాడగలుగుతాం.. ఈ విషయాలపై దృష్టి సారించాలని కోరుతోంది "ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ"..