ప్రశాంత పోలింగ్ నిర్వహణకు చర్యలు

జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి

 
1000187019
కడప, ఆగష్టు 9 : ఈ నెల 12న పులివెందుల, ఒంటిమిట్ట మండలాల్లో జరగనున్న జెడ్పిటిసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రకాల భద్రతా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు.
పులివెందుల, ఒంటిమిట్ట మండలాల పరిధిలో సమస్యాత్మకంగా గుర్తించిన పలు పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి.. జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్, ఆర్వో ఓబులమ్మ లతో కలిసి పరిశీలించారు.
 
ముందుగా పులివెందుల మండలంలోని కనంపల్లె(ఎంపిపి స్కూల్), మొట్నూతల (ఎంపిపి స్కూల్), ఇ-కొత్తపల్లె (ఆదర్శ పాఠశాల), నల్లపురెడ్డి పల్లె (జెడ్పి హైస్కూల్), నల్లగొండువారిపల్లె (ఎంపీపీ స్కూల్) పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పులివెందుల ఆర్డీవో చిన్నయ్య,   ఏఆర్వో వెంకటపతి, డిఎస్పీ మురళి, తహశీల్దార్లు, ఎంపిడివోలు సంబంధిత రెవెన్యూ, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
 
అనంతరం ఒంటిమిట్ట మండలంలోని కొత్తమాధవరం (జెడ్పి హైస్కూల్) పోలింగ్ కేంద్రాన్ని, ఒంటిమిట్ట గ్రామంలో (జెడ్పి హైస్కూల్), మంటపంపల్లె (ఎంపీపీ స్కూల్) పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్, ఎస్పీలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కడప ఆర్డీవో జాన్ ఇర్విన్, ఏఆర్వో రంగస్వామి, డిఎస్పీ వెంకటేశ్వర్లు, తహశీల్దార్లు, ఎంపిడివోలు తదితరులు పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ.. రానున్న సాధారణ ఎన్నికల పోలింగ్ ను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు మధ్య పోలింగ్ నిర్వహించేందుకు అన్ని రకాల ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటామన్నారు. ఓటర్లందరూ తమ ఓటు హక్కును ప్రశాంతంగా సద్వినియోగం చేసుకునేలా పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి భద్రతా చర్యలు చేపడుతున్నామన్నారు. 
 

About The Author