మెడికల్ మాఫియాతో ప్రాణాలు గల్లంతు..
అమాయకులు టార్గెట్ గా రెచ్చిపోతున్న అక్రమ దందా..
- అనుమతిలేకుండా అనేక రకాల మందుల అమ్మకం..
- బ్రాండ్ ల పేర్లు మార్చి అక్రమంగా అమ్మకం..
- కొరవడిన ప్రభుత్వ నిఘా.. తగిన వనరులు లేవంటూ కథలు..
- డీసీఏ ఎందుకు నిస్సత్తువుగా మారింది..?
- నిరోధించాల్సిన అధికారులే లంచాలకు బానిసలవుతున్నారు.. !
- ఈ ఔషధాల దందాపై ఉక్కుపాదం మోపాలి అంటున్న మేధావులు..
- ఔషధ నియంత్రణ విభాగంలో నిజాయితీ పరులకు స్థానం కల్పించాలి..
గుడిలో దేవుడికి పెట్టిన నైవేద్యం, తీర్ధం ఎంతో పవిత్రంగా భావించి స్వీకరిస్తుంటాం.. ఇవి స్వీకరించడం వల్ల కొన్ని రోగాలు నయమైపోతాయని కూడా నమ్మకం.. ఎందుకంటే దేవుడికి నివేదించే తీర్ధ ప్రసాదాల్లో కొన్ని ఔషధ గుణాలుంటాయి.. ఇది వాస్తవం.. ఇటీవలే ఒక ఆశ్చర్యకరమైన విషయం కూడా వెలుగు చూసింది.. తమిళనాడులోని ఒక దేవాలయంలో తీర్ధం స్వీకరిస్తే చక్కర వ్యాధి నయమైపోతుందట.. దీంతో లక్షలాదిమంది ఆ గుడిని సందర్శించి అక్కడి తీర్ధ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.. ఇప్పుడిదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే.. పవిత్రమైన తీర్ధ ప్రసాదాలకంటే ఎక్కువుగా మనం డాక్టర్లు రాసిచ్చే ఔషధాలు ప్రాధాన్యత ఇస్తున్నాం.. నమ్మి ఆ మందులను కొంటున్నాం.. రోగం తగ్గుముఖం పడుతుందని ఆశిస్తున్నాం.. కానీ దురదృష్టం ఏమిటంటే ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ కొన్ని ఔషధ తయారీ కంపెనీలు నకిలీ మందులను తయారు చేస్తున్నారు.. విచ్చలవిడిగా వాటిని సరఫరా చేస్తున్నారు.. డ్రగ్స్ మాఫియా దేశంలో పెద్ద ఎత్తున పాతుకుని పోయింది.. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ మాఫియా రెచ్చిపోతోంది.. ఈ మాఫియాకు అడ్డుకట్ట వేయకపోతే.. భవిష్యత్తులో ఎక్కడ చూసినా మరణ మృదంగాలు మోగుతాయి.. " ఫోరమ్ ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ " పరిశోధనలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.. అవేమిటో ఇప్పుడు చూద్దాం..
హైదరాబాద్, జులై 18 ( భారత శక్తి ) :
రాష్ట్రంలో కొందరు ఔషధాల దుకాణదారులు అనుమతి లేకుండా అనేక రకాల మందులను విక్రయిస్తున్నారు. అధిక ధరలతో వినియోగదారులను మోసగిస్తున్నారు. పలు ఫార్మా సంస్థలు సైతం బ్రాండ్‌ల పేర్లు మార్చి అవి తామే తయారు చేసినట్టు కలరింగ్ ఇస్తూ చట్ట ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయి. ఈ ఔషధాల దందాపై ఉక్కుపాదం మోపి, అడ్డుకట్ట వేయాల్సిన ఔషధ నియంత్రణ విభాగం తగినంత వనరులు లేక నిస్సత్తువగా మారింది అని చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సి వస్తోంది..
రాష్ట్రంలో మొత్తం 40 వేలకుపైగా ఔషధాల దుకాణాలు ఉన్నాయి. 750కి పైగా ఔషధ పరిశ్రమలు అంటే ఫార్మాస్యూటికల్స్ మందులను ఉత్పత్తి చేస్తున్నాయి. వీటికి తోడు బ్లడ్ బ్యాంకులపై పర్యవేక్షణ చేయాల్సింది కూడా డీసీఏనే. కానీ ఈ విభాగంలో 70 మంది డ్రగ్ ఇన్‌స్పెక్టర్లే ఉన్నారు. మరోవైపు రాష్ట్రంలో డ్రగ్ పరీక్షల ప్రయోగశాల కేవలం ఒక హైదరాబాద్‌లో మాత్రమే ఉంది. ఇక్కడ నెలకు సుమారు 350 నుంచి 400 వరకు మాత్రమే నమూనాలు పరీక్షించే వీలుంది. ఔషధాల వ్యాపారంలో నిబంధనలు ఉల్లంఘించేవారిపై డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు ప్రత్యేక నిఘా పెట్టారు. గతేడాది డీసీఏ అధికారులు 573 కేసులు నమోదు చేశారు. 2024లో 92 మందికి శిక్షలు పడ్డాయి. కానీ ఔషధాల దందాను సమర్థంగా అరికట్టాలంటే మరో మూడు, నాలుగు ప్రయోగశాలలు అవసరం. ఇప్పుడున్న ప్రయోగశాల సామర్థ్యం సైతం పెంచాల్సిన అవసరం ఉంది. అన్ని ల్యాబ్‌లలో కలిపి కనీసం నెలకు 2వేల నమూనాలు పరీక్షించేందుకు సౌకర్యాలు ఉండాలి. మరో 70 నుంచి 100 డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల నియామకం జరిగితే తనిఖీలు ఎక్కువ సంఖ్యలో జరిపి, ఉల్లంఘనలకు పాల్పడే వారిపై కఠినంగా చర్యలు తీసుకునే వీలుంటుంది.
రాష్ట్రంలో కొత్తగా మరో నాలుగు ప్రయోగశాలల అవసరం ఉంది. వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్గొండలో ప్రాంతీయ ప్రయోగశాలల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. వీటితోపాటు డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల సంఖ్యను కూడా పెంచాలని కోరాం. అంటున్నారు అధికారులు.. కానీ ఎప్పటికి కార్యరూపం దాలుస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొని ఉంది.. ప్రజలకు ప్రాణాలు పోయాల్సిన ఔషధ కంపెనీలు ప్రాణాలు హరించే మందులను తయారు చేస్తుంటే.. అరికట్టలేని దౌర్భాగ్యం నెలకొంది.. కారణాలు అనేకానేకం.. లోపభూయిష్టమైన చట్టాలు, సాక్షాలు మాత్రమే చూసే న్యాయస్థానాలు, అవినీతికి జై కొడుతున్న రాజకీయం.. అక్రమార్జనకు మరిగిన అధికారులు.. వీటన్నింటినీ ఒక మార్గంలో పెట్టడానికి కృషి చేస్తోంది " ఫోరం ఫేర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ " సమాజంలోని రుగ్మతలను రూపుమాపడానికి మేము చేస్తున్న ఈ యుద్ధంలో అందరూ భాగస్వాములు కావాలని వేడుకుంటున్నాం.. జైహింద్..