అవినీతి మురికిలో కూరుకుపోయిన "గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ "
గ్రేటర్ అని చెప్పుకోవడం తప్ప.. అంత గొప్ప ఏమీ లేదన్నది నిర్విదాంశం..
టౌన్ ప్లానింగ్ విభాగాలలో పెచ్చుమీరిపోతున్న లెక్కలేనితనం..
- బహిరంగ మార్కెట్ లో నిస్సిగ్గుగా పర్మిషన్లు అమ్ముకుంటున్న దౌర్భాగ్యం..
- లంచాలు తీసుకుంటూ పట్టుబడినా పద్ధతి మార్చుకోని అధికార గణం..
- మహా అయితే సస్పెండ్ అవుతాం.. తిరిగి విధుల్లో చేరతాం అన్న అహంభావం..
- అవసరమైతే కోర్టుకు వెళతాం.. శిక్షనుంచి తప్పించుకుంటాం..
- చట్టాలు, విధి విధానాలు మాకు అవసరం లేదు..
- అక్రమంగా ఆర్జిస్తాం.. లెక్కలేని సంపదను కూడగట్టుకుంటాం..
- ప్రజలేమైతే మాకేంటి..? మాకు ఆమ్యామ్యాలే ముఖ్యం..
- జీ.హెచ్ఎం.సి. అవినీతిపై ఏసీబీ దృష్టి పెట్టిందా..?
- ప్రక్షాళన మొదలవుతుందా..? అన్నది అనుమానాస్పదమే..
- లంచం తీసుకుంటూ పట్టుబడితే సస్పెండ్ చేయడం కాదు.. ఏకంగా విధుల నుండి తొలగించాలని
డిమాండ్ చేస్తున్న " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "
గ్రేటర్ హైదరాబాద్ వాసులకు అత్యున్నతమైన, అత్యవసరమైన సేవలను అందించడానికి అకుంఠత దీక్షతో పనిచేయాల్సిన జీ.హెచ్.ఎం.సి. అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిపోయింది.. లంచాల మత్తులో జోగుతూ, కోట్లు వెనుకేసుకుంటున్న జీ.హెచ్.ఎం.సి. అధికారులు మాయని మచ్చగా మిగిలిపోతున్నారు.. రోజు రోజుకూ అవినీతి పెచ్చుమీరిపోతోంది.. ఈ క్రమంలో ఈ అవినీతికి అడ్డుకట్ట వేయాలనే దృక్పథంతో అవినీతి నిరోధక శాఖ ముందడుగు వేయనున్నట్లు తెలుస్తోంది.. ఇదే గనుక వాస్తవరూపం దాలిస్తే హైదరాబాద్ మహానగరంలో జీవనం సాగిస్తున్న ప్రజలకు కొంతమేర ఊరట లభించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది..
హైదరాబాద్, 22 జులై ( భారత శక్తి ) : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో వేళ్ళూనుకుపోయిన అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు, త్వరితగతిన సేవలందించేందుకు ప్రభుత్వం ఎన్నిసంస్కరణలు తీసుకుని వచ్చినా ఎలాంటి ఫలితం లేకుండా పోతోంది.. కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులు మొదలుకొని భవన నిర్మాణ అనుమతుల జారీ.. మరీ నీచంగా బర్త్, డెత్ సర్టిఫికెట్లు జారీ చేయాలన్నా, చేతులు తడపాల్సిందే.. కనీసం కొత్త కమిషనర్ వచ్చారన్న భయం కూడా లేకుండా, బహిరంగంగా లంచాలు డిమాండ్ చేస్తున్నట్లు బహిరంగంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి..
ఒక సంఘటన చూద్దాం.. భవన నిర్మాణ అనుమతి జారీ చేసేందుకు సికిందరాబాద్ జోన్ ఆఫీసులోని టౌన్ ప్లానింగ్ కు చెందిన అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఏకంగా రూ. 8 లక్షల లంచం డిమాండ్ చేసి, అందులో రూ.4 లక్షలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కిన సంఘటన తీవ్ర అలజడి సృష్టించింది.. ఈ విధంగా నగరంలోని ప్రతి జోన్, ప్రతి సర్కిల్ లోనూ ప్రతి సర్వీసుకు ఓ పత్యేకమైన ప్రైవేట్ టారీఫ్ ను అమలు చేస్తూ.. బహిరంగంగా లంచాలు, బేరసారాలు కొనసాగుతున్నాయి.. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవటం లేదు అన్నది జగమెరిగిన సత్యం..
మరో సంఘటనలో రెండు నెలల క్రితం అర్బన్ బయోడైవర్శిటీకి చెందిన ఓ అసిస్టెంట్ డైరెక్టర్ రూ.80 వేలు లంచం తీసుకుంటూ చిక్కగా, అంతకు ముందు శేరిలింగంపల్లి జోన్ లో మరో ఇంజనీర్ కూడా లంచాలు తీసుకుంటూ దొరికిపోయాడు.. ఇలా వరుసగా మూడు నెలల్లో ముగ్గురు అవినీతి అధికారులు అవినీతి నిరోధక శాఖ అధికారుల వలలో చిక్కారు. ఇక ఇంజనీరింగ్ విభాగంలో పర్సెంటేజీలు చెల్లించినదే బిల్లులు చెల్లింపులు జరగటం లేదని ఎన్నోసార్లు ఎంతోమంది కాంట్రాక్టర్లు బహిరంగంగానే ఆరోపించడం కూడా చూశాం..
బిల్లింగ్ సెక్షన్ లోని కొందరు అధికారులైతే ముందుగానే తమ పర్సెంటేజీని వసూలు చేసుకుని, ఆ తర్వాత బిల్లుల చెల్లింపులు జరుపుతున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రధాన కార్యాలయం కన్నా జోనల్ ఆఫీసుల్లో.. ఎక్కువగా టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ సెక్షన్లలో అవినీతి జరుగుతుందన్న విషయాన్ని ఏసీబీ అధికారులు గుర్తించినట్లు సమాచారం.. జోనల్ ఆఫీసులపైనే ఎక్కువగా నిఘా పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం.
ఇక ఈ క్రమంలో జీహెచ్ఎంసీ అధికారులపై ఫిర్యాదు రావటమే ఆలస్యం, ఆగమేఘాలపై ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి కొరడా ఝుళిపిస్తున్నారు.. ప్రధాన కార్యాలయంపై కూడా ఏసీబీ అధికారులు నిఘా పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో పలువురు అధికారులు లంచాలు తీసుకుంటూ పట్టుబడిన నేపథ్యంలో ప్రధాన కార్యాలయంలోని అవినీతి అధికారుల వివరాలను ఏసీబీ పూర్తిగా సేకరించినట్లు తెలుస్తోంది..
కాగా ఇటీవలీ కాలంలో శేరిలింగంపల్లిలో యూబీడీ అసిస్టెంట్, కొద్దిరోజుల క్రితం సికిందరాబాద్ జోన్ లో టౌన్ ప్లానింగ్ ఏసీపీ లంచం తీసుకుంటూ పట్టుబడటంతో సికిందరాబాద్, శేరిలింగంపల్లి జోన్ లలో ఎక్కువగా అవినీతి జరుగుతున్నట్లు ఏసీబీ నిర్థారించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ రెండు జోన్లలోని టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాల్లో ఏసీబీ ఎపుడైనా ఆకస్మిక తనిఖీలు నిర్వహించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.. కనీసం ఇప్పటికైనా ప్రక్షాళన జరుగుతుందా..? గ్రేటర్ అన్న పదానికి నిజమైన అర్ధం లభిస్తుందా..? అన్నది వేచి చూడాలి.. అదే విధంగా ఎల్.బీ. నగర్ మున్సిపల్ పరిధిలోకూడా లెక్కలేనంత అవినీతి రాజ్యమేలుస్తోంది.. దీనిపై పూర్తి ఆధారాలు వెలుగులోకి తీసుకుని రానుంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "..