వామపక్ష హింసను ధైర్యంగా ప్రతిఘటించి

జాతీయవాదంతో కన్నూర్ ముఖ చిత్రాన్ని మార్చిన ‘‘మాస్టారు’’

వామపక్ష హింసను ధైర్యంగా ప్రతిఘటించి

భారత శక్తి ప్రతినిధి, న్యూఢిల్లీ, జూలై 15:
ధైర్యానికి నిలువెత్తు రూపం, సైద్ధాంతిక నిబద్ధతకు ప్రతిరూపం, అట్టడుగు స్థాయి నుంచి ఎదిగి, శక్తిమంతునిగా నిరూపింతం చేసుకున్న వ్యక్తి, కేరళలోని కన్నూర్ కి చెందిన ప్రముఖ విద్యావేత్త, ఆరెస్సెస్ కార్యకర్త సదానందన్ మాస్టర్ ను రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేశారు. 
సామాజిక సేవలో నిత్యం ముందుండే సదానందన్ మాస్టర్ ను బీజేపీలో అందరూ ‘‘మృత్యుంజయుడు’’ గా పిలుచుకుంటారు. 1994 లో సీపీఎం కార్యకర్తలు ఆయనపై ఘోరంగా దాడికి దిగారు. ఈ దాడిలో సదానందన్ మాస్టర్ రెండు కాళ్లూ పోగొట్టుకున్నారు. అయినా.. సీపీఎం నేతల గుండాగిరీకి ఏమాత్రం వెరవలేదు. సిద్థాంతం పట్ల, అంతే స్థిరచిత్తంతో సామాజిక సేవలో పాల్గొన్నారు. మేరు పర్వంతం లాంటి ధైర్యాన్ని ప్రదర్శిస్తూ.. ముందుకే సాగారు. నిత్యం చిరునవ్వు, నిండైన ధైర్యం, సంకల్ప బలంతో పుష్టిగా వున్న వ్యక్తి మాస్టారు.

తన రెండు కాళ్లూ పోగొట్టుకున్నా... మున్ముందుకే సాగారు. గ్రామీణ విద్యకే తన జీవితాన్ని అంకితం చేశారు. నిత్యం రాజకీయ హింస చెలరేగే కన్నూర్ లోనే మార్పుకు శ్రీకారం చుట్టారు. కన్నూర్ రాజకీయ బాధితుల పక్షాన నిలబడి వాదించారు కూడా. అమానవీయ కమ్యూనిస్టు భావజాలం, దాని హింసకు వ్యతిరేకంగా నిలబడుతూ, జాతీయవాదానికి చిహ్నంగా నిలబడ్డారు.

అయితే.. విచిత్రం తెలుసా.... చిన్నతనంలో సదానందన్ మాస్టారు సీపీఎం సభ్యుడు. యూనిట్ కార్యదర్శి కూడా. అయితే ఎదుగుతున్నా కొద్దీ ఆ భావజాలంలో వున్న శూన్యతను, డొల్లతనాన్ని, హింసావాదాన్ని వ్యతిరేకించాడు. ఆ తర్వాత సీపీఎంను విడిచిపెట్టి, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వైపు ఆకర్షితులై, కార్యకర్తగా ఎదిగారు. కన్నూర్ ప్రాంతంలో ఆరెస్సెస్ విస్తరణకు విశేషంగా కృషి చేశారు. జిల్లా బౌద్ధిక్ ప్రముఖ్ కూడా అప్పట్లో బాధ్యతలు నిర్వర్తించారు. ఇదే అక్కడి కమ్యూనిస్టు నేతలకు ఆకళింపు కాలేదు. సీపీఎంను వదిలి ఆరెస్సెస్ వైపు వెళ్లడాన్ని అదో పెద్ద నేరంగా భావించారు. జాతీయవాద భావజాలాన్ని, జాతీయవాదుల్ని అణచడానికి సీపీఎం వారు హింసాత్మక మార్గాలన్ని ఎంచుకున్నారు. అవకాశం కోసం కాచుక్కూర్చున్నారు.
 
సదానందన్ మాస్టార్ తన సోదరి వివాహానికి సంబంధించిన సన్నాహాల్లో మునిగారు. ఆహ్వాన పత్రాలు పంచే పనిలో వున్నారు. సరిగ్గా అదే సమయంలో అంటే (1994, జనవరి 25) న కమ్యూనిస్టు కార్యకర్తలు సదానందం మాస్టార్ వాహనాన్ని అడ్డగించారు. ఆయన్ను బయటికి లాగి, దారుణంగా కొట్టారు. అత్యంత పాశవికంగా, గూండాల మాదిరి ప్రవర్తిస్తూ అతని రెండు కాళ్లనూ నరికేశారు. దీంతో రోడ్డు మీదే విపరీతమైన నొప్పితో మాస్టారూ విలవిలడారు. రక్తపు మడుగులో పడిపోయారు. దీంతో అతడు చనిపోయాడని కమ్యూనిస్టు కార్యకర్తలు భావించి, రోడ్డుమీదే వదిలేసి వెళ్లిపోయారు. ఇంత క్రూరాతి క్రూరంగా కమ్యూనిస్టు నేతలు ప్రవర్తించారు.
 
కానీ... సదానందన్ మాస్టారు బతికే వున్నారు. వెంటనే అతని స్నేహితులు, సంఘ స్వయంసేవకులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. తెగిపడ్డ రెండు కాళ్లను కూడా ఆస్పత్రికే తీసుకెళ్లారు. ఆ తర్వాత మాస్టారు ప్రాణాలతో బయటపడ్డారు. కానీ కాళ్లను కోల్పోయారు. అప్పటి నుంచి కృత్రిమ కాళ్లను అమర్చుకొని, నడుస్తున్నారు. నేటికీ సిద్ధాంతాన్నే అసిధార వ్రతంగా ఉపాసిస్తూ, అచంచలమైన నిబద్ధతతో ముందుకు సాగుతున్నారు. కేరళలో జాతీయవాద ఉద్యమానికి దృఢమైన సంకల్పానికి ప్రతీకగా నిలిచారు. తరువాత బీజేపీలో చేరి, ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. మరో కీలకమైన విషయం కూడా మాస్టారి జీవితంలో వుంది. ఇంత దారుణమైన దాడి జరిగి, కాళ్లు పోగొట్టుకున్న సమయంలోనే ఆయన వివాహం కూడా నిశ్చయమైంది. ఆయన్ను బెడ్ మీద చూసిన కాబోయే భార్య చలించిపోయింది.కొంత కాలం డ్రిపెషన్ లోకి కూడా వెళ్లిపోయారు. అయినా.. తాను సదానందం మాస్టార్ నే పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పారు. ఆయన్నే వివాహం కూడా చేసుకున్నారు. కోలుకున్న తర్వాత ఆయన పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేశారు. విద్యార్థులు సదానందన్ మాస్టార్ ను ఓ హీరోగా ఉపాసించారు. మాస్టారూ తన కృత్రిమ అవయవాలతోనే పుస్తకాలు, లంచ్ బ్యాగును తీసుకొని, నిత్యం చిరునవ్వుతోనే పాఠశాలకు వెళ్లి, ఉపాధ్యాయత్వాన్ని నెరవేర్చారు. విద్యార్థులందరూ అతడ్ని ప్రేమతో ‘‘మాషే’’ అని పిలుచుకుంటారు.

కమ్యూనిస్టు పార్టీ గ్రామం ‘‘కన్నూర్’’..  కన్నూర్ అనేది కమ్యూనిస్టులకు బలమైన కోట. దాదాపు 40 గ్రామాలు సీపీఎం పార్టీకి గట్టి పట్టున్న ప్రాంతాలే. ఇతర పార్టీలు పనిచేయడానికి గానీ, విస్తరణకు గానీ అనుమతించరు కూడా. పత్యం, మోకేరి, కిజక్కే, కాతిరూర్, కయ్యూర్, చోక్లి, పంథక్కల్, మడపీడిక, పూక్కోమ్, పరాడ్, మనంతేరి ప్రాంతాలు అందులో ముఖ్యమైనవి. ప్రజాస్వామ్యాన్ని తుంగులో తొక్కి, కమ్యూనిస్టులు.. అక్కడ రాజకీయాలు చేస్తుంటారు. కొన్ని గ్రామాల్లో అయితే ఏకంగా ‘‘కమ్యూనిస్టు పార్టీ గ్రామానికి స్వాగతం’’ అని బోర్డులే వుంటాయి. నిజమైన ఫాసిజం ఈ ప్రాంతాల్లో కనిపిస్తుంది. అంతేకాకుండా కమ్యూనిస్టు పార్టీ జెండాలు, గోడ పోస్టర్లు, బ్యానర్లు మాత్రమే వుంటాయి. ఇతర పార్టీల జెండాలు గానీ, గోడ పోస్టర్లు గానీ, బ్యానర్లను కానీ అనుమతించరు.ఇంత ఘోరంగా రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను కమ్యూనిస్టు నేతలు తుంగలో తొక్కేస్తారు. 

ఇంకో ప్రమాదకర విషయం ఏమిటంటే ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కూడా లేవు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఈ గ్రామాలుంటాయి. నిరుద్యోగం కూడా అంతే స్థాయిలో వుంటుంది. 
అయితే.. ప్రస్తుతం అక్కడి పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. సదానందం మాస్టార్ చేసిన కృషి, జాతీయవాదులు, స్వయంసేవకుల కృషి, ఆదర్శవాదంతో కమ్యూనిస్టు గ్రామాల సంఖ్య క్రమంగా తగ్గిపోతున్నాయి. కమ్యూనిస్టు నేతల కబంధ హస్తాల నుంచి ప్రజలు బయటికి వస్తున్నారు. ఇంతటి మార్పు రావడానికి చాలా మంది స్వయంసేవకులు తమ ప్రాణాలను మాత్రం కోల్పోయారు.

About The Author

Advertisement

Bharatha Sakthi Read Epaper Online

Latest News

ఫిర్యాదుదారులకు త్వరితగతిన పరిష్కారం అందించండి ఫిర్యాదుదారులకు త్వరితగతిన పరిష్కారం అందించండి
వైయస్సార్ కడప జిల్లా, జులై 15(భారత శక్తి) : పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారం అందించాలని జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ అన్ని...
పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలి
వామపక్ష హింసను ధైర్యంగా ప్రతిఘటించి
పేదరికాన్ని రూపుమాపేందుకే పి4
ఆదివాసులను అణిచివేసేందుకే చట్టాలు
చదువుకునే ప్రతి ఒక్క బిడ్డకి తల్లికి వందనం పథకం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది
దళితులభూముల కబ్జా, వివక్షత, హక్కుల హరణ పై పోరాడాలి