హైదరాబాద్ మహానగరంలో ఏమి జరుగుతోంది..?
...నగర యువత మత్తుకు బానిసైపోతోంది...
- విచ్చలవిడిగా గంజాయి సరఫరా..?
- యాంటీ నార్కోటిక్ సంస్థ కళ్లు గప్పుతున్న ఆగంతకులు..
- గల్లీల్లో, పాన్ డబ్బాల్లో, కల్లు దుకాణాల్లో అమ్మకం..
- 'వీడ్' అంటూ గంజాయిని పిలుచుకుంటారు..
- సిగరెట్స్ లో కూరుకొని బహిరంగంగానే వినియోగం..
- పెద్దవాళ్ల హస్తం ఉన్నట్టు కొన్ని ఆధారాలు..
- కోట్లలో జరుగుతున్న వ్యాపారం..
- యువత నిర్వీర్యమై.. దేశ భవిష్యత్తు చీకటి అవుతోంది..
- ఫోరమ్ ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ
- పరిశోధనలో వెలుగు చూసిన భయంకర వాస్తవాలు..
ప్రశ్నించే తత్వం యువతలో నిగూఢమై ఉంటుంది.. పోరాట స్ఫూర్తి నరనరానా నిబిడీకృతమై ఉంటుంది.. యువత మేల్కొంటే సమసమాజం స్థాపితమవుతుంది.. అందుకే ఓ యువతా మేలుకో అని పిలుపునిచ్చారు స్వామి వివేకానంద.. కానీ యువత నానాటికీ నిర్వీర్యమైపోతోంది.. పోరాట పఠిమ నీరుకారిపోతోంది.. దీనికి కారణం ఏమిటి..? యువత నిరాశా నిస్ప్రుహలకు గురికావడమే అన్నది మా పరిశోధనలో తేలింది.. కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అని మహాకవి శ్రీ శ్రీ అన్నదాంట్లో వాస్తవం లేకపోలేదు.. కానీ అలాంటి భయానక పరిస్థితులు కల్పించింది ఎవరు..? విస్తుపోయే వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటపడుతుంటే హృదయం ద్రవించకమానదు.. భారత శక్తి పాఠకులకోసం ఫోరమ్ ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ అందిస్తున్న హృదయాంతరాళాలను తట్టి లేపే కథనం..
హైదరాబాద్, జులై 14 (భారత శక్తి) :
రాజకీయం అరాచకీయంగా మారిపోతోంది.. నానాటికీ విలువల వలువలు ఊడిపోతున్నాయి.. స్వార్ధపూరిత, కక్షపూరిత రాజకీయాలు నేడు రాజ్యమేలుతున్నాయి.. భారత రాజ్యాంగం రాజకీయ నాయకులకు అత్యున్నతమైన అధికారాలు కల్పించింది.. ఆ అధికారాలు ప్రజా శ్రేయస్సు కోసం వినియోగించాల్సి ఉంటుంది.. కానీ ప్రస్తుత రాజకీయాలు కీచకుల మాదిరిగా తయారైపోయాయి.. ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్నాయి.. కొంత మంది వయసుడిగిన మేధావులు పోరాడే శక్తి లేక ఇంటికే పరిమితమై పోతున్నారు.. దీన్ని అలుసుగా తీసుకున్న కుహనా రాజకీయ నాయకులు చెలరేగిపోతున్నారు.. అయితే ఇలాంటి దుర్మార్గులను ప్రశ్నించడం, నిలదీయడం, దారిలో పెట్టడం ఒక యువత వల్లే సాధ్యం అవుతుంది.. యువత సమ సమాజాన్ని స్థాపించే యత్నంలో విజయం సాధించిన సంఘటనలు ఎన్నెన్నో చూసాం.. అయితే ఉడుకురక్తం ప్రవహించే యువతను అణగద్రొక్కడానికి రాజకీయ నీచులు అనేకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.. ముఖ్యంగా వారిని నిరాశా నిస్ప్రుహలకు గురి చెయ్యడం.. మత్తుకు బానిసలను చెయ్యడం.. ఎందుకూ పనికిరాకుండా వారిని జీవశ్చవాల్లా మార్చి వేయడం.. ఈ మూడు ప్రక్రియలు ప్రయోగిస్తూ యువత ముందుకు రాకుండా.. ప్రశ్నించకుండా.. పోరాటం చెయ్యకుండా నిలువరిస్తున్నారు.. ఇది వినడానికి కొంత ఆశ్చర్యం కలిగించే విషయం అయినా ఇది వాస్తవం.. ఎవరూ గ్రహించలేని భయంకర నిజం..
ఉద్యోగాలు లేకుండా చేయడం :
యువత తాము చదివిన చదువుకు తగిన వుద్యోగం సంపాదించుకుని వ్యవస్థలోని లోటుపాట్లను అవగాహన చేసుకుని, అవినీతికి తావులేకుండా బాధ్యతలు నిర్వహిస్తే.. తమ ఆటలు సాగవు అని గ్రహించిన రాజకీయ నాయకులు.. అధికారం అందుకోగానే యువతను ఉద్యోగాలకు దూరం చేస్తున్నారు.. ఎలాంటి నోటిఫికేషన్లు వేయకుండా ప్రభుత్వ కొలువులు వారికి అందకుండా చేస్తున్నారు.. దాంతో తీరని వ్యథకు లోనైన యువత బ్రతుకు తెరువుకోసం ఎదో ఒక పని చేసుకుంటూ చాలీ చాలని సంపాదనతో పూర్తిగా కడుపుకూడా నింపుకోలేక బ్రతుకునీడుస్తున్నారు.. ఈ క్రమంలో తమలో ఉన్న ప్రశ్నించే తత్వం.. పోరాడే గుణాన్ని పూర్తిగా మర్చిపోతున్నారు.. కాగా ఏ కొంతమందికో కార్పొరేట్ సంస్థల్లో మంచి ఉద్యోగాలు లభించినా అక్కడ వృత్తిలో ఎదురవుతున్న వత్తిడులకు గురౌతూ సమాజాన్ని గురించి ఆలోచించేంత సమయం, ఓర్పు లేకుండా పోతోంది..
యువతను మత్తులో ముంచేయడం :
ఇక చదువుకుంటున్న యువతే కాకుండా.. కాస్తో కూస్తో ఏదోక పని చేసుకుంటున్న యువతను మత్తు వైపు మళ్లేలా చేస్తున్నారు.. దీంతో వాస్తవిక ప్రాపంచాన్ని మరిచిపోయిన యువత కేవలం మత్తులో గడుపుతూ తమ బాధ్యతలను వదిలేస్తున్నారు.. ఒక సందర్భం వరకు ఖరీదైన మాద్యాన్ని తీసుకునే యువత జోబులు ఖాళీ కాగానే చౌకగా దొరికే మత్తు పదార్ధాల వైపు చూస్తున్నారు.. ఇందులో ప్రధమంగా గంజాయి సేవనం ఒకటి.. తక్కువ ఖర్చుతో ఎక్కువ మత్తును ఆస్వాదిస్తున్నారు.. కాగా గంజాయి నగర వ్యాప్తంగా విచ్చలవిడిగా దొరుకుతోంది.. ఎక్కడ పడితే అక్కడ బహిరంగంగానే అమ్ముతున్నారు.. ఎలాంటి భయం లేకుండా సిగరెట్స్ లో గంజాయి పొడి నింపుకుని తాగేస్తున్నారు.. టన్నుల కొద్ది గంజాయి నగరానికి సరఫరా అవుతోంది.. నిఘా సంస్థలు ఎంత ప్రయత్నించినా అరికట్టలేకపోతున్నాయి.. కారణం ఆ నిఘా సంస్థలకు చెందిన అధికారులు, వీరితో పాటు పోలీసులు, ఎక్సయిజ్ శాఖకు చెందిన ఉద్యోగులు కొందరు అవినీతికి దాసోహం అంటుండమే.. లంచాలకు మరిగి గంజాయి సరఫరాను చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు.. వీరి వెనుక కొందరు రాజకీయ నాయకులు కూడా ఉన్నట్లు పరిశోధనలో తేలింది.. రాజకీయ నాయకులకు కావాల్సింది ఒక్కటే యువత ఎప్పటికీ మత్తులోనే ఉండి పోవడం.. తమను ప్రశ్నించకుండా ఉండటం.. పోరాటానికి గుడ్ బై చెప్పడం.. ఇప్పుడు అదే జరుగుతోంది.. నిజానికి యాంటీ నార్కోటిక్ లాంటి సంస్థలు గంజాయి సరఫరాను నిరోధించడం పెద్ద కష్టమేమీ కాదు.. కానీ ఆదిశగా అడుగులు పడటం లేదు.. వీరందరి టార్గెట్ కేవలం యువత మాత్రమే.. యువతను నిద్రావస్థలో ఉంచడమే.. ఎన్నో సార్లు చూసాం గంజాయి పట్టుపడటం, డ్రగ్స్ పట్టు పడటం.. మత్తు పదార్ధాలు పట్టు పడటం.. కానీ ఈ కార్యక్రమాలన్నీ కేవలం కంటి తుడుపుగా మాత్రమే జరుగుతున్నాయి.. ఎలాంటి ఫలితం ఉండటం లేదు.. మేము కూడా పనిచేస్తున్నాం అని చెప్పుకోవడానికి మాత్రమే పనికివస్తున్నాయి.. నగరంలో పలుచోట్ల పర్యటించినప్పుడు.. పరిశోధనలు చేసినప్పుడు గంజాయి వినియోగం, గంజాయి సరఫరా విచ్చలవిడిగా జరుగుతున్నట్లు తెలిసింది.. గంజాయి అమ్ముతున్న వాళ్ళను నిలదీస్తే.. బాజాప్తా అమ్ముతాం ఏమి చేసుకుంటారో చేసుకోండి.. మా వెనుక పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు.. మాకేమీ కాదు.. అని నిర్భీతిగా, నిస్సిగ్గుగా చెబుతుండటం ఎంతో ఆందోళన కలిగించింది..
నిరోధించే మార్గం లేదా..?
ఖచ్చితంగా నిరోధించవచ్చు.. కానీ ముందుగా యువతలో స్ఫూర్తిని నింపాలి.. వారిని మేలుకొలపాలి.. చైతన్యం నింపాలి.. వారికి వాస్తవాలు తెలియజెప్పాలి.. అలాంటి బృహత్తర ప్రయత్నమే చేస్తోంది "ఫోరమ్ ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ"... మాప్రయత్నం అందరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాం.. మత్తుకు బానిసలైపోతున్న యువత హింసాత్మక మార్గంలో నడుస్తోంది.. దేశ భవిష్యత్తుకు మూల స్తంభాలుగా ఉండాల్సిన యువత నేర ప్రపంచంలోకి నెట్టివేయబడుతున్నారు.. ఈ మత్తు వల్ల మహిళలు అన్యాయానికి గురైపోతున్నారు.. రక్తపాతం నిరంతరంగా ప్రవహిస్తోంది.. మేధస్సు ఎందుకూ పనికిరాని మట్టిగా మారిపోతోంది.. ఇలాగే కొనసాగితే భవిష్యత్తు ఎలా ఉండబోతోందో అని ఆలోచిస్తేనే భయం ఆవహిస్తోంది..
దయచేసి మేము చేస్తున్న పోరాటానికి మీ అందరి మద్దతు ఇవ్వండి.. ఇంట్లో కూర్చుంటున్న మేధావులు మాతో చేతులు కలపండి.. కలిసి పోరాడుదాం.. యువతను మేల్కొల్పుదాం.. అవినీతి రహిత సమాజాన్ని నిర్మిద్దాం..