స్వామివారికి 4 కోట్ల విలువైన ఆస్తి విరాళమిచ్చిన భక్తుడు
యాదగిరిగుట్ట :
హైదరాబాద్ లో మూడంతస్తుల భవనం స్వామి వారి పేరిట రిజిస్ట్రేషన్
ఆలయ ఈవో, చైర్మన్ కు రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేత
భక్తుడికి అభినందనలు తెలిపిన మంత్రి సురేఖ, శైలజా రామయ్యర్

హైదరాబాద్ తిలక్ నగర్ కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి ముత్తినేని వెంకటేశ్వర్లు (77) అనే భక్తుడు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి అపురూప కానుక సమర్పించుకున్నారు. హైదరాబాద్ తిలక్ నగర్ ప్రాంతంలో గల 152 గజాలలో నిర్మించుకున్న సుమారు 4 కోట్ల విలువైన మూడంస్తుల భవనాన్ని గురువారం నాడు చిక్కడపల్లి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎస్.వెంకట్రావు ఐఏఎస్, ఆలయ అనువంశిక ధర్మకర్త భాస్కరాయని నరసింహమూర్తి మరియు ఇతర అధికారుల సమక్షంలో దేవస్థానానికి అప్పగించియున్నారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ దాత వెంకటేశ్వర్లును అభినందించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో, చైర్మన్ లు దాత వెంకటేశ్వర్లు శాలువాతో సన్మానించి, స్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు. ఇంత ఉన్నతమైన ఆలోచనతో గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు స్వామి వారి కృప ఎల్లపుడూ వారికి వారి కుటుంబ సభ్యులకు ఉంటుందని, ఇది ఎంతో మందికి ఆదర్శమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో భాస్కర శర్మ తదితరులు పాల్గొన్నారు.
