లింగంపల్లి చౌరస్తాలో ఆటో డ్రైవర్లకు పార్కింగ్ స్థలం కేటాయించండి
ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్చెరు, జూలై 18(భారత శక్తి )
జాతీయ రహదారి విస్తరణలో భాగంగా లింగంపల్లి చౌరస్తాలో ఆటో డ్రైవర్ల స్టాండ్ లేకపోవడంతో నిరంతరం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. లింగంపల్లిలో నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్ కింద సరిపడా స్థలం కేటాయించాలని జాతీయ రహదారుల సంస్థ ప్రాంతీయ అధికారి కృష్ణ ప్రసాద్ ను పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు.
శుక్రవారం హైదరాబాద్ లోని జాతీయ రహదారుల సంస్థ కార్యాలయంలో కృష్ణ ప్రసాద్ తో ఎమ్మెల్యే జిఎంఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. శేరిలింగంపల్లి నుండి ఇస్నాపూర్ వరకు ఆటోలు నడిపిస్తూ జీవనోపాధి పొందుతున్న వేలాది మంది డ్రైవర్లకు లింగంపల్లి చౌరస్తాలో ఆటో స్టాండ్ లేకపోవడం మూలంగా గిరాకీలు లేక ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం మూలంగా ఇప్పటికే తీవ్రంగా నష్టపోయామని ఇటీవల ఆటో డ్రైవర్ల జేఏసీ సైతం తమకు విన్నవించిందని తెలిపారు.
నూతనంగా నిర్మించిన లింగంపల్లి ఫ్లైఓవర్ కింద ఆటో డ్రైవర్లకు అనుగుణంగా పార్కింగ్ స్థలం కేటాయిస్తే వారి జీవితాలలో కొత్త వెలుగులు నింపవచ్చని కోరారు. ఇందుకు స్థానుకూలంగా స్పందించిన ప్రాంతీయ అధికారి కృష్ణ ప్రసాద్.. త్వరలోనే ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు.