రైతులకు ఎరువుల కొరత లేకుండా చర్యలు చేపట్టాలి
ఎరువుల దుకాణాలు తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
భారత శక్తి ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యూరో, జూలై 23: నిర్మల్ జిల్లాలో రైతులకు ఎరువుల కొరత రాకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.
బుధవారం నిర్మల్ మినీ ట్యాంక్‌బండ్ సమీపంలోని గాయత్రి ఫర్టిలైజర్‌తో పాటు కొండాపూర్ గ్రామంలోని శ్రీ సాయి ఎరువుల దుకాణాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణాలలో ఉన్న విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల ప్యాకింగ్ లేబుళ్లు, తయారీదారుల వివరాలు, గడువు తేదీలు, రిజిస్టర్లు, రసీదుల పుస్తకాలను పరిశీలించారు. అన్ని రికార్డులు సరిగ్గా నిర్వహించాలని యజమానులకు సూచించారు.
రైతులకు అవసరమైన పరిమాణంలో మాత్రమే ఎరువులు విక్రయించాలన్నారు. ఎరువుల కొనుగోలుకు వచ్చిన రైతులతో మాట్లాడిన కలెక్టర్, వారి సాగు చేసిన పంటలు, భూమి విస్తీర్ణం వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు నకిలీ విత్తనాలు, మందులు కొనకూడదని, ఎరువుల కృత్రిమ కొరత సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎరువులు, క్రిమిసంహారక మందులు భూసారానికి అనుగుణంగా వాడాలని, అధికంగా వాడితే దిగుబడిపై ప్రభావం ఉంటుందని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో జిల్లా వ్యవసాయ శాఖాధికారి అంజి ప్రసాద్, తహసీల్దార్లు రాజు, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.