పారిశుధ్యంపై పట్టింపేది..!
- తుతూ మంత్రంగా ఫ్రైడే డ్రైడే ఫోటోలకే పరిమితం.
- కుంటాల మండల పరిధిలోని ఓలా గ్రామంలో రోడ్డు పక్కన చెత్తాచెదారం.
- మండల అధికారుల పనితీరు వై ప్రజల ఆవేదన.
భారత శక్తి ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యూరో, జూలై 22:
కుంటాల మండలంలోని ఓలా గ్రామంలో దోమలు విజృంభిస్తున్నాయి. పై స్థాయి ఉద్యోగుల నిర్లక్ష్యం కారణంగా ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారం పేరుకుపోయాయి. డ్రైనేజీలు మినీ డంప్యార్డుల్లా మారాయి. ఫలితంగా దోమలు పుట్టుకొస్తున్నాయి. కాలనీల్లో దోమల బెడద ప్రజలను కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. దీంతో వ్యాధులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. డెంగీ లాంటి ప్రమాదకర వ్యాధులు కూడా అక్కడక్కడా వెలుగు చూస్తున్నాయి. మండలంలో ఫాగింగ్ చేపట్టకపోవడంతో దోమలు వృద్ధి చెందుతూనే ఉన్నాయి. వ్యాధులు పెరుగుతూనే ఉన్నాయి.
అధ్వానంగా పారిశుధ్యం
మండలంలోని చాలా ప్రాంతాల్లో పారిశుధ్యం పరిస్థితి అధ్వానంగా మారింది. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో మరింత దిగజారిపోయింది. ఆయా గ్రామాల్లో పారిశుధ్య కార్మికులు తిరుగుతున్నా, వారంతా కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతున్నారు. అందునా పైపెనే పనులు చేస్తున్నారు. చాలా చోట్ల చెత్తా చెదారం పూర్తిగా తొలగిపోవడం లేదు. డ్రైనేజీలు శుభ్రం చేయడానికి కనీసం పారిశుధ్య కార్మికులు రాని ప్రాంతాలు కూడా ఇప్పటివరకు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. దీంతో డ్రైనేజీల్లో మురుగునీరు నిలిచి, రోడ్లపై చెత్తాచెదారం పేరుకుపోయి దోమలు పుట్టుకొస్తున్నాయి. కుంటాల మండలంతొ పాటు ఆయా గ్రామాల కాలనీల్లో వ్యాధులు పెరుగుతుండడంతో ప్రజలు ఆసుపత్రులకు వరుస కడుతున్నారు.
జాడ లేని ఫాగింగ్
దోమల నియంత్రణకు విని యోగించాల్సిన ఫాగింగ్ల జాడ కనిపించడం లేదు. ఓ వైపు కాలనీల్లో దోమలు వి జృంభిస్తుంటే, ఎక్కువ ప్రాంతాల్లో ఫాగింగ్ చేపట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాము ఫాగింగ్ చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నా, ఆచరణలో మాత్రం కనిపించడం లేదని కాలనీవాసులు పే ర్కొంటున్నారు. అంతకుముందు ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్లో భాగంగా ఇంటింటికీ మూడు నాలు గు సార్లు స్ప్రే చేయనున్నట్లు కూడా గతంలో పేర్కొంది. కాని నాలుగైదు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఒక్కసారి కూడా స్ప్రే చేయని ఇళ్లు ఎన్నో ఉన్నాయి. దోమల నియంత్రణ లేకపోవడంతో మండలంలో మెల్ల మెల్లగా వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికై నా ఎప్పటికప్పుడు పారిశుధ్య నిర్వహణ చేపట్టి, తమను వ్యాధుల బారి నుంచి కాపాడాలని మండల వాసులు అధికారులను కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం లేకుండా ఎంపీడీవో ఎంపీఓ పారిశుద్ధ్య పనులపై శ్రద్ధతొ పనిచేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.