హరిహరులకు ప్రీతికర మాసం కార్తికం

సనాతన హైందవ ధర్మం లో హిందువులకు ఈ కార్తిక మాసంలో ప్రతిరోజూ పరమ పవిత్రమైనదే. ప్రతిరోజూ పండుగే. శివకేషవుల పూజలకు ఈ కార్తికం ఎంతో ప్రత్యేకమైనది. హరిహరసుత అయ్యప్ప స్వామి దీక్షలకు కడు పవిత్రమైనది. ఈ మాసము స్నానములకు, దీప దానములకు,వివిధ వ్రతములకు శుభప్రదమైనది. ఈ మాసంలోనే ఉభయపక్షములందు అనేక వ్రతములు ఉన్నాయి. శరణు ఘోషలతో అయ్యప్ప దీక్షలు కూడా ఈ నెలలో ప్రారంభమై మకర సంక్రాంతి (మకర జ్యోతి దర్శనం) వరకు కొనసాగుతుంది. సామాజిక సమరసతకు ఈ మాసం అద్దం పడుతుంది.
న కృతేన సమం యుగమ్
న వేదసదృశం శాస్త్రం
న తీర్థం గంగయా సమమ్
హరిహరులకు ప్రీతికరం
చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో, ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుంది. కృత్తికా నక్షత్రంలో చంద్రుడు పూర్ణుడై సంచరించుట వలన ఈ మాసానికి కార్తిక మాసమని పేరు. కార్తిక మాసమునకు సమానమైన మాసము, విష్ణుదేవుని కంటే సమానమైన దేవుడు, వేదములకు సమాన మైన శాస్తమ్రులు, గంగకంటే పుణ్యప్రథములైన తీర్థములు లేవన్నది పురాణ వచనం. కార్తిక మాసము అత్యంతపవిత్రమైనది. మహిమాన్వితమైనది. శివకేశవు లకు ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో దేశం నలుమూ లలా ఉన్న ఆలయాలలో రుద్రాభి షేకాలు, లక్ష బిల్వార్చనలు, రుద్ర పూజలు విశేషంగా జరుపుతారు. విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై వారి అభీష్టాలను తీరుస్తాడని భక్తులు విశ్వసిస్తారు. అందుకే ఆ స్వామికి ‘అశుతోషుడు’ అన్న పేరు వచ్చింది. ‘అభిషేక ప్రియః శివః’ శివునికి అలంకారాలతో రాజోపచారములతో, నైవేద్యములతో పనిలేదు. మనస్సులో భక్తినుంచుకుని శివుడ్ని ధ్యానిస్తూ చేసే అభిషేకంతో శివుడు ప్రీతి చెందుతాడు. శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి సకల శుభాలను కలగజేస్తుంది. ఈ మాసంలో శివార్చన చేసినవారికి గ్రహదోషాలు, ఈతిబాధలు ఉండవు. శివుడిని శ్రీవృక్ష పత్రములతో (బిల్వదళములు) పూజించిన స్వర్గమున లక్ష సంవత్సరములు జీవించును. ప్రదోషకాలంలో పరమేశ్వరుడు, ఏకకాలంలో రెండురూపాలని ప్రదర్శిస్తూ ఎడమభాగాన పార్వతి, కుడి భాగాన పరమేశ్వర రూపంగా అర్ధ నారీశ్వరునిగా దర్శనమిచ్చే సమయం ఈ ప్రదోషకాలంగా చెప్పబడింది. ప్రదోషకాలంలో శివారాధన,శివదర్శనంచేసుకుంటే శివుని అనుగ్రహానికి పాత్రులగుదురు. శివాలయములో ప్రార్థన, లింగార్చన, బిల్వార్చన వంటి పుణ్య కార్యములు ఆచరించుట ఈ మాసంలో విశేష ఫలాన్ని ప్రసాదిస్తాయి. అష్టోత్తర లింగార్చన, మహా లింగార్చన, సహస్ర లింగార్చన ఉత్తమోత్తమ మైన అర్చన. ఈ మాసంలో ఈ అర్చనలు చేస్తే సంవత్సర మొత్తం చేసిన ఫలాన్నిస్తాయి. తులసి దళాలతో శ్రీ మహావిష్ణుని కార్తికమాసంలో పూజిస్తే ముక్తిదాయకం అని శాస్త్ర వచనం. ఈ మాసంలో విష్ణువు దామోదర నామంతో పిలవబడతాడు. ‘కార్తిక దామోదర ప్రీత్యర్ధం’ అని ఈ మాసాన వ్రత దీక్ష ఆచరించాలి. తులసి చెంత హరిపూజ పుణ్యప్రదం. సత్యనారాయణ వ్రతం, విష్ణు సహస్రనామ పారాయణ, రుద్రాభిషేకాలు చేయడం శ్రేష్టం. శివానుగ్రహానికి, విష్ణువు అనుగ్రహానికి ఈ మాసం ఉతృష్టమైంది. కార్తిక మాసంలో ఏమంత్ర దీక్ష తీసుకున్నా మంచి ఫలితాలను ఇస్తుందని శాస్త్ర వచనం. ‘కార్తిక పురాణం’ రోజుకో అధ్యాయం పారాయణ చేయడం శుభకరం. ఈ మాసం మొదటి నుండి సూర్యోదయానికి పూర్వమే నదీస్నానం అత్యంత ఫలప్రదం. కార్తిక నదీ స్నాన విషయంలో ఆరోగ్య సూత్రం కూడా ఇమిడి ఉంది. నదీ జలాలు కొండలలోను, కోనలలోను, చెట్టు పుట్టలను తాకుతూ ప్రవహిస్తాయి. అలా ప్రవహించడం ద్వారా ఎన్నో వనమూలికల రసం నదీ జలాల్లో కలుస్తుంది. ఈ మాసంలో గృహిణులు, యువతులు వేకువనే స్నానం చేసి తులసి కోట ముందు దీపారాధన చేసి గౌరీదేవిని పూజిస్తే ఈశ్వరాను గ్రహంతో సౌభాగ్యాన్ని, సకల శుభాలను పొందుతారు. మాసమంతా స్నాన విధిని పాటించలేని వారు పుణ్య తిథులలోనైనా స్నానం ఆచరించాలి. కార్తీక మాసం మొదలునుండే ‘ఆకాశదీపం’ ప్రారంభమవుతుంది. ఉభయ సంధ్యలలో గృహమందు, పూజామందిరంలోను, తులసి సన్నిధిలోను, ఆలయమలలో దీపారాధన, ఇహ, పర సౌఖ్యాలను కలగచేస్తుంది. ఈ మాసం దీపారాధనకు ప్రశస్తం. దీపదానమందు ఆవునెయ్యి ఉత్తమం. మంచి నూనె మధ్యమము. ఏకాదశి అత్యంత విశేషమైనది. ‘ఉత్థాన ఏకాదశి’ కార్తిక శుద్ధ ద్వాదశి కార్తిక పౌర్ణమి లాంటి దినాలు ప్రశస్తమైనవి.
కార్తిక మాసం నామ ఔచిత్యం
సనాతన హిందూ సంప్రదాయం లో కాలం అనంతమైనది. కాలం ఎంతో బలమైనది. కాలం సమస్తమైనది. అందుకే భగవద్గీతలో గీతాచార్యుడు 'కాలాత్ కలయికాం అహం' అంటాడు. (నేను భావ స్వరూపంలో ఉండి కాలం లెక్కలు కట్టుకుంటూ ఉంటాను.) అనాది ప్రతి తెలుగు మాసం పున్నమి నుండి అమావాస్య వరకు గల కాలాన్ని 'సర్వసంధి కాలం' అంటారు. అమావాస్య నుండి పౌర్ణమి వరకు గల 16 రోజులలో ఒక్కొక్క రోజు చంద్రుడికి ఒక్కొక్క కళ హెచ్చుతూ ఉంటుంది. 16 కళలతో ఒప్పి పూర్ణిమనాడు చంద్రుడు సంపూర్ణ కాంతివంతుడు అవుతాడు. అలా చంద్రుడు 16 కళలతో సంపూర్ణమైన వెలుగులతో ప్రకాశించే దినాలు ఏడాదికి 12 వస్తాయి అంటే ఏడాదికి 12 పూర్ణిమలు వస్తాయన్నమాట. ఏడాదిలో వచ్చే 12 పున్నమలలోనూ ఒక్కొక్క నక్షత్రంతో కూడి ఉంటాడు చంద్రుడు ఆ రోజు చంద్రుడు ఏ నక్షత్రంతో కూడి ఉంటాడో ఆనాటి నక్షత్రాన్ని బట్టి ఆ పౌర్ణమికి ఆ పేరు కలుగుతుంది. అట్లే ఆ మాసం కూడా ఏర్పడుతుంది. ఆ నక్షత్రం పేరుతోనే ఆ మాసాన్ని వ్యవహరిస్తారు. కార్తిక మాసంలో పౌర్ణమి రోజు చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కూడి ఉండటం వలన ఆ పౌర్ణమిని 'కార్తిక పౌర్ణమి' అని, ఆ మాసానికి 'కార్తికమాసం' అని పేరు వచ్చింది. తెలుగు నెలల ప్రకారం సంవత్సరంలో 8వ మాసం కార్తిక మాసం. ఈ కార్తిక మాసానికి 'కౌముది మాసం' అని కూడా పేరు. కార్తిక మాసానికి అధి దేవత దామోదరుడు.
త్రిపుర పౌర్ణమి కౌముది మాసం
తెలుగు మాసముల ప్రకారం సంవత్సరంలో 8వ మాసం కార్తీక మాసం కార్తీక మాసానికి కౌముది మాసం అని కూడా పేరు కార్తీక మాసానికి అది దేవత దామోదరుడు కార్తీక మాసంలో వచ్చే పూర్ణిమను త్రిపుర పూర్ణిమ అంటారు ఇది శంకరుడికి మిక్కిలి ప్రీతికరమైన రోజు ఈ రోజు శంకరుడు త్రిపురాసురుని సంభవించినందుకు దీనికి త్రిపుర పౌర్ణమి అనే పేరు కూడా స్థిరపడింది శంకరుని కీర్తిని నా రోజు నీ వలన విని త్రిపురాసురుడు శంకరుడి కంటే తానే బలవంతుడనని అహంకారపడతాడు శంకరుడు అంటే అసూయ చెందుతాడు అంతటితో ఆగక త్రిపురాసురుడు కైలాసం మీదకు దండెత్తి శివుని యుద్ధానికి పులికొలుపుతాడు మూడు రోజులు యుద్ధం తీవ్రంగా జరుగుతుంది. ఆ యుద్ధంలో శివుడు త్రిపురాసురుని సంహరించగా అప్పుడు దేవతలు పరమశివుని స్తోత్రం చేశారు అందుకే ఈనాటి రాత్రి మహిళలు శంకరుని విజయాన్ని స్మరిస్తూ తులసి కోట వద్ద 720 దూది వత్తులను నీతిలో ముంచి పెద్ద దీపం వెలిగిస్తారు అని ఒక పురాణ కథ వివరిస్తుంది.
పదహారు కళలతో కార్తిక పౌర్ణమి
కార్తిక పౌర్ణమి రోజున చంద్రుడు కృత్తిక నక్షత్రంలో ఉంటాడు కృత్తికకు అగ్ని నక్షత్రం అని పేరు ఈ నక్షత్రానికి అధిపతి అగ్నిదేవుడు కనుక ఈ రోజున దీపారాధన మూలకంగా అగ్నిని ఆరాధించాలని శాస్త్రం ప్రకారం కార్తీక పౌర్ణమి రోజు ఆలయాలలో అనంతమైన దీపాలను వెలిగించే ఆచారం అనాదిగా వస్తుంది ఇది కూడా ఒక విధమైన దీపాల పండుగ వంటివి అయితే చిమ్మ చీకట్లు కమ్మిన అమావాస్య రోజున దీపావళి వస్తే ఆ పండుగ పూర్ణచంద్రుడు 16 కళలతో వెలిగే నిండు పున్నమి నాడు రావడం ఎంతో విశేషం.
కన్నుల పండుగగా కార్తిక దీపోత్సవం
ఈ కార్తీక మాసంలో శివకేశవుల భేదాలు లేకుండా అన్ని ఆలయాలలో ఒకే రోజున ఒకే విధంగా జరిపే ఉత్సవమే కార్తీక పౌర్ణమి ఇది ఎంతో కన్నుల పండుగగా జరిగే దీపోత్సవం మామూలుగా కృత్తికా నక్షత్రం కార్తిక పౌర్ణమి తిథి కలిసి వస్తుంటాయి అప్పుడప్పుడు నక్షత్రము ఒక రోజున పౌర్ణమి ఒక రోజున విడివిడిగా రావడం కూడా జరుగుతుంది ఎక్కువగా కృత్తికా నక్షత్రాన్ని ఈ దీపారాధనకు ముఖ్యమని భావిస్తారు అందుకే ఈ దీపారాధనకు కృత్తికా దీపం లేదా కార్తీకదీపం అని పేరు వచ్చింది. పవిత్రమైన అరుణాచల క్షేత్రంలో ఈరోజున కృత్తిక దీపం వెలిగించే ఆచారం అనాదిగా వస్తుంది ఎంతో కన్నుల పండుగగా అరుణాచల కృత్తికా దీపం మహోత్సవం జరుగుతుంది.
ఆరోగ్య ఆనందాలతో కార్తిక వనభోజనం
కార్తీక మాసంలో చేసే వనభోజనం ఎంతో ఆరోగ్యప్రదం ఆనందకరం వనభోజనం అన్న మాటకు యదార్ధమైన అర్థం వనం అన్నమాటకి అమర కోసం వ్యాఖ్యానం చేసింది వనం అంటే మాట అందరూ అడవిని ప్రేమించి అక్కడ కలిసి మెలిసి సంతోషంగా భక్ష్య భౌజియా పానీయాలతో కూడిన షడ్రసోపేతమైన పదార్థాలను ఆరాధిస్తూ మంచి మాటలు వినాలి ఇకపై వీలైనంతవరకు వైరాగ్యభావంతో జీవించాలని అర్థం. కానీ అన్నం ఒక్కటే తినడానికి వనభోజనానికి వెళ్ళక్కర్లేదని శాస్త్రాలు చెబుతున్నాయి వాస్తవంగా ఆలోచిస్తే అందరము చివరికి జనాలను విడిచి వనాలకు వెళ్లాల్సిన వారమే కదా ఈ వాస్తవాన్ని కార్తీక మాసం వనభోజనం మనకు తెలియజేస్తుంది. పుత్రం పవిత్రం సమాసాధ్య వానప్రస్తాశ్రమేవసేద్ భార్యాపుత్రిం నివేష్యచ అన్నాడు వేదవ్యాస మహర్షి అందుకే వనభోజనానికి వెళ్లేవారు వైరాగ్య భావనతో పవిత్రచింతనతో నిష్కల్మష హృదయంతో వెళ్లాలి ప్రకృతిలో ఆరోగ్యాన్ని సిద్ధింపజేసే అమలక ఉసిరి చెట్లు వృక్షాలు తులసి వనం మామిడి చెట్లు ఎక్కడ ఉన్నాయో అక్కడికే వెళ్లాలి మామిడి చెట్టుకు సంస్కృతంలో రసాలం అని పేరు పరమేశ్వరుడు ఉన్న ఏకైక చెట్టు రసాలం అనగా మామిడి చెట్టు ఉసిరి మామిడి తులసి చెట్లున్న వనానికి వెళ్లి మాత్రమే భోజనం చేయాలి అలా చేసిన భోజనమే కార్తీకమాస వనభోజనం అవుతుంది.
జ్వాలాతోరణం ఆకాశదీపం నందా దీపం
కార్తీక మాసంలో పూర్ణిమ నాడు చేసే మరొక దీపోత్సవం ఇది ఎదురెదురుగా రెండు స్తంభాలు పాతి వాటికి అడ్డంగా ఒక దూలాన్ని కడతారు ఎండు గడ్డిని ఆ మూడు బాదులకు దట్టంగా చుట్టి దాన్ని అంటిస్తారు ఆ గడ్డి మండుతూ ఉండగా దాని క్రిందుగా పల్లకిలో స్వామివారిలను మూడుసార్లు తిప్పే ఆచారాన్ని కొన్ని పురాణ కథలు వివరిస్తున్నాయి జ్వాలాతోరణ రూపంలోనే గాక ఆకాశదీపం నందా దీపం గొప్పలలో దీపాలు వెలిగించి పొలాల్లో తటాకాల్లో వదలడం వంటి ప్రక్రియల రూపంలో ఈరోజు ప్రధానంగా అగ్నిని ఆరాధించే ఆచారం ఉంది ఈ మాసం పూర్తిగా ప్రతి సాయంత్రం ప్రతి ఇంటిలో ద్వారానికి రెండు వైపులా ద్వీపాలు వెలిగిస్తారు ఇంటి ముంగిట గుమ్మట దీపాలు వేలాడదీస్తారు.ఆకాశ దీపం పెట్టే సమయంలో ఈ క్రింది శ్లోకాలను భక్తితో పఠించాలి.
దామోదరాయ నభసి;
తులాయాన్ డోలయాసః।
ప్రదీపంతే ప్రయచ్ఛామి;
నమో అనంతాయ వేధసే॥
తులాయాం తిలతైలేన;
సాయంకాలే సమాగతే।
ఆకాశ దీపం యో దధ్యాత్;
మాసమేకం హరింప్రతి॥
యాలక్ష్మీ దివసే పుణ్యే;
దీపావళ్యాస్చ భూతలే।
గవాం గోష్టిం చ కార్తిక్యాం;
సాలక్ష్మీ వరదా మమ॥
కీటాః పతంగాః మశకాస్చవృక్షాః;
జలే స్థలే అలే ఏ నివసంతి।
జీవా దృష్ట్యా ప్రదీపం
న చ జన్మ భాగినః;
భవతింత్వ స్వపచాహి విప్రాః॥
( దామోదరుని ప్రీత్యర్థం కార్తిక మాసము నందు వెలిగించే ఈ ఆకాశదీపం శ్రీహరికి ప్రియమగు నట్లు వెలిగించే ఈ దీపం నీరు, భూమి, వృక్షాలు, పండ్లు వంటి వాటిలో నివసించే కీటకాలు, పతంగులు, జీవజాల మంతా దీపం చూడగానే అవి పాపములు తొలగించుకొని మరల పుట్టుక లేకుండా పుణ్యఫలం పొందుతాయని నమ్మకం. ఈ ఆకాశ దీపం ద్వారా సమస్త జీవరాసులకు శుభం కలుగుతుంది. ఇంట లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అనే భావంతో కూడుకున్న ఈ శ్లోకాన్ని భక్తిశ్రద్ధలతో పఠించాలి.
ఈ దీపాన్ని సూర్యాస్తమయం తర్వాత మాత్రమే వెలిగించాలి. ఈ దీపాన్ని ఇంటిముందు లేదా పైకప్పు పైన ఉంచి ఆకాశం వైపు చూడాలి. భక్తితో రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ పై శ్లోకాలను పఠించాలి. ఆకాశదీపం మసక భారేంతవరకు దాన్ని కదిలించకూడదు.
ఈ నియమాలు పాటిస్తూ ప్రతి ఇంటి ముంగిట ఆకాశ దీపాలు వెలిగించడం కార్తిక మాసంలో సంప్రదాయం. ఏది ఏమైనా పగలు తగ్గి రాత్రి హెచ్చుగా ఉండే ఈ కాలంలో నెమ్మదిగా చలి ప్రభావం పెరుగుతుంది. ఆ చలి ప్రభావాన్ని తగ్గించి, వాతావరణంలో ఉష్ణాన్ని పెంచి, వాతావరణ సమతుల్యతను కాపాడటానికి ఇంటింటా ఈ దీపారాధనలు దోహదం చేస్తాయన్నది వాస్తవమైన విషయం. దీన్ని పెద్దలు చెప్పిన ఆచారంగా మనం పాటిస్తే మనకు తెలియకుండానే మనందరికీ ఎంతో ఉపకారం జరుగుతుంది. అందుకే 'పెద్దల మాట సద్దన్నం మూట' అనే నానుడి ప్రచారంలోకి వచ్చింది.
దక్షిణ భారత దేశంలో కార్తిక మాసానికి, కార్తిక దీపోత్సవాలకు ఎంతో విశేషమైన ప్రాధాన్యత ఉంది అని చెప్పక తప్పదు. ఈ మాసంలో శివుడు అగ్ని రూపంలో వ్యక్తం అవుతాడని పురాణాలు చెబుతున్నాయి. అగ్ని అన్నింటిలో ఉండే అపవిత్రతని ఏ విధంగా నశింపజేస్తాడు అదేవిధంగా భగవంతుడు మానవునిలోని అజ్ఞానం అహంకారం అసూయ మొదలైన దుర్గుణాలను నశింపజేసి, జ్ఞానమనే ఒక్క దీపాన్ని వెలిగింపజేసి ప్రకాశవంతం చేస్తాడని ఈ కార్తిక మాసంలో జరిపే దీపోత్సవం మనకు తెలియజేస్తుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటూ తాత్విక చింతనతో కార్తిక మాసాన్ని వైభవంగా జరుపు కుందాం! సనాతన ధర్మ వైశిష్యాన్ని అర్థం చేసుకొని ధర్మబద్ధులుగా జీవిద్దాం!
"సాహిత్య కళా విభూషణ్"
చౌడూరి నరసింహారావు
ప్రవచన కర్త, ఆధ్యాత్మిక విశ్లేషకులు
