రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి
బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ డిమాండ్
(భారత శక్తి ప్రతినిధి) కామారెడ్డి, జులై 19: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని బహుజన లెఫ్ట్ పార్టీ (బహుజన కమ్యూనిస్టు) బిఎల్ పి రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్ నల్లకుంటలో గల రాష్ట్ర కార్యాలయంలో దండి వెంకట్ అద్యక్షతన జరిగిన పార్టీ రాష్ట్ర కమిటి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది బహుజన శ్రామిక కులాల ప్రజలు ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న అర్హులైన నిరుపేద కుటుంబాలకు పట్టాలు మంజూరు చేసి ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం చేపట్టాలని దండి వెంకట్ డిమాండ్ చేశారు. బీసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, అగ్రకుల పేదలైన బహుజన కార్పొరేషన్ లకు జనాభా దామాషా ప్రకారం నిధులు మంజూరు చేసి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.
తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టులకు తగిన నిధులు మంజూరు చేయించడంలో రాష్ట్రం ఎన్నికైన 8 మంది పార్లమెంటు సభ్యులు ఉత్సవ విగ్రహాల్లా మిగిలి పోయారని చెప్పారు. ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడంలో బీఆర్ఎస్ పార్టీ వైఫల్యం చెందిందని వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు నల్లా సూర్యప్రకాష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. సిద్ది రాములు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సబ్బని లత, ఎలిమినేటి శ్రీశైలం, సహాయ కార్యదర్శి వడ్ల సాయి కృష్ణ, మారోజు సునిల్, పాండు నాయక్, వెంకటేష్, అరుణ, ప్రభు లింగం, నాగరాజు, గంగాధర్, సమ్మయ్య, చైతన్, తదితరులు అన్ని జిల్లాలకు చెందిన పార్టీ కన్వీనర్ లు పాల్గొన్నారు.