సమిష్టి నిర్ణయంతో వ్యక్తిగత బాధ్యతలను నిర్వర్తించండి : కూనంనేని
పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు.... బాధ్యతలు స్వీకరించిన దండి, జమ్ముల
ఖమ్మం ప్రతినిది (భారత శక్తి న్యూస్ ), జూలై 21:
భారత కమ్యూనిస్టు పార్టీ ఖమ్మం జిల్లా సమితి సమిష్టి నిర్ణయాలు, వ్యక్తిగత బాధ్యతలు నిర్వర్తిస్తూ బలోపేతం కావాలని కూనంనేని సాంబశివరావు సూచించారు. నూతన నాయకత్వం సమర్థవంతంగా పనిచేయాలని నూతన ప్రాంతాలకు పార్టీ విస్తరించే -దిశగా కార్యక్రమాలను తీసుకోవాలని ఆయన కోరారు. సిపిఐ 23వ జిల్లా మహాసభలో జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన దండి సురేష్, సహాయ కార్యదర్శిగా ఎన్నికైన జమ్ముల జితేందర్రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పాల్గొని ఇద్దరిని శాలువలతో సత్కరించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో సిపిఐ కార్యకర్తలు హాజరై నూతన నాయకత్వాన్ని -అభినందించారు.
ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు పార్టీకి ఒక చారిత్రిక నేపథ్యం ఉందని అనేక పోరాటాలతో వినతికెక్కిందన్నారు. పాలక వర్గాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై బహుముఖ పోరాటాలకు క్యాడర్ను సిద్దం చేయాలన్నారు. పార్టీ శత వసంతాల ముగింపు సభ ఖమ్మంలో జరగనుందని అందుకు తగిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. డిసెంబర్ 26న ఐదు లక్షల మందితో బహిరంగ సభ జరగనుందని ఇందుకు సంబంధించి త్వరలోనే ఆహ్వాన సంఘాన్ని -ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, రాష్ట్ర సమితి సభ్యులు -యర్రాబాబు, కొండపర్తి గోవిందరావు, సిద్దినేని కర్ణకుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు, కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.