అమాయకుల ప్రాణాలు తీస్తున్న ధనదాహం..
( స్పెషల్ కరస్పాండెంట్, హైదరాబాద్ )
- మెడికల్ మాఫియా చేస్తున్న క్లినికల్ ట్రయల్స్..
- ఎలాంటి నిబంధనలు పాటించకుండా చేస్తున్న దుర్మార్గం..
- వైద్య శాఖ నిద్రబోతూ అనుమతులు ఇస్తోందా..?
- అనధికారంగా జరుగుతున్నా కట్టడి జరగడం లేదు..
- క్లినికల్ ట్రయల్స్ ను దుర్వినియోగం చేస్తున్న కంపెనీలు..
- అనవసరమైన మందుల వినియోగం జరుగుతోంది..
- లాభాపేక్షతోనే చికిత్సలు చేస్తున్నట్టు తెలుస్తోంది..
- ఈ పద్దతికి చరమగీతం పడకపోతే భవిష్యత్ స్మశానంగా మారడం ఖాయం..
- మెడికల్ మాఫియాకు ప్రభుత్వాల అండదండలు..!
- క్లినికల్ ట్రయల్స్ పై నిఘా పెంచాలని డిమాండ్ చేస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "..
దేవుడు జన్మనిస్తాడు.. కానీ వైద్యుడు మరుజన్మను ఇస్తాడు.. అలాంటి వైద్య రంగానికి చెందిన, అనుసంధానమైన మందుల తయారీ కంపెనీలు మానవత్వంతో కాకుండా దుర్మార్గంతో వ్యాపారం చేస్తున్నాయి.. ఒక మెడిసిన్ మార్కెట్ లోకి రావాలంటే ఎన్నెన్నో పరిశోధనలు జరగాలి.. అవి క్లినికల్ గా నిరూపితం అయినప్పుడే వాటిని మార్కెట్ లోకి అనుమతి ఇస్తారు.. ఈ క్లినికల్ ట్రయల్స్ అనేవి ఒక పద్ధతి ప్రకారం, నిపుణుల పర్యవేక్షణలో జరగాలి.. ఒక మెడిసిన్ ని ఒక వ్యక్తిమీద ప్రయోగిస్తున్నప్పుడు అతనితో, అతని కుటుంబసభ్యులతో అవగాహన ఒప్పొందం చేసుకోవాలి.. పొరబాటున ఏదైనా జరిగితే బాధ్యత ఆ మెడికల్ కంపెనీ తీసుకోవాలి.. అంతేకాకుండా తాము ట్రయల్స్ కు వినియోగించే మెడిసిన్ ని నిపుణులు, ప్రభుత్వం ఆమోదించాలి.. కానీ అది ఇప్పుడు జరగడం లేదు.. అనుమతులు లేని మెడిసిన్ ను కూడా క్లినికల్ ట్రయల్స్ కు వినియోగిస్తున్నారు.. ఇది చాలా పెద్ద నేరం.. కానీ సదరు మెడికల్ కంపెనీ యాజమాన్యం వీటన్నిటినీ పట్టించుకోవడం లేదు.. ప్రభుత్వాలను, అధికారులను చివరికి కుటుంబసభ్యులను కూడా డబ్బుతో కొనేస్తోంది.. ట్రయల్స్ లో ఏదైనా ప్రమాదం జరిగితే వారు చూపించే మరణాల సంఖ్య తప్పుగా ఉంటోంది.. వేళా సంఖ్యలో మరణాలు వ్యాపిస్తున్నా వాటిని వెలుగులోకి రానీయడం లేదు.. ఇదంతా దేనికోసం..? అక్రమ సంపాదన కోసమే కదా..? సంపాదించిన కోట్ల పైకం వెంటేసుకుని పోతారా..? ఒక్కసారి ఈ మెడికల్ మాఫియా, రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు ఆలోచించాలి.. దీనిపై అలుపెరుగని పోరాటం చేస్తోంది.. " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "..
అసలు మెడికల్ మాఫియా అంటే ఏమిటి? :
"మెడికల్ మాఫియా" అనేది వైద్య రంగంలో ఉన్న కొన్ని ఆసుపత్రులు, ఔషధ కంపెనీలు, డయాగ్నస్టిక్ సెంటర్లు, కొంతమంది డాక్టర్లు కలసి చేసే అనైతిక వ్యాపారానికి పెట్టిన పేరు. వీరి ప్రధాన లక్ష్యం రోగి ఆరోగ్యం కంటే లాభం.
కొన్ని ప్రధానమైన పద్ధతులు :
రోగులకు అవసరం లేని టెస్టులు, స్కాన్లు చేయించడం.. తక్కువ ఖర్చులో చికిత్స సాధ్యమైనా, ఖరీదైన మందులు లేదా ఆపరేషన్లు సూచించడం.. ఔషధ కంపెనీలతో చేతులు కలిపి, కమిషన్ కోసం మందులు రాయడం.. పేద, అమాయకులైన రోగులపై అనుమతి లేకుండా క్లినికల్ ట్రయల్స్ చేయడం.. లాంటివి జరుగుతూ వున్నాయి..
దుర్వినియోగం అవుతున్న క్లినికల్ ట్రయల్స్ :
క్లినికల్ ట్రయల్ అంటే కొత్త మందు లేదా ట్రీట్మెంట్‌ని మానవులపై పరీక్షించడం. ఇది శాస్త్రీయంగా అవసరం.. కానీ చాలా సందర్భాల్లో దుర్వినియోగం జరుగుతుంది. ఈ దుర్వినియోగం రకరకాల పద్ధతుల్లో జరుగుతుండటం ఆందోళన కలిగించే విషయం.. గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలపై సరైన సమాచారం లేకుండా పరీక్షలు చేయడం.. ప్రభుత్వం నుంచి, సంబంధిత డిపార్ట్మెంట్ నుంచి అనుమతి ఉందంటూ నకిలీ అనుమతి పత్రాలు సృష్టించడం చేస్తున్నారు.. ఈ ట్రయల్స్ నిర్వహించిన తర్వాత ఏవైనా సమస్యలు వస్తే వారు బాధ్యత తీసుకోకపోవడం జరుగుతోంది.. ఇక ట్రయల్స్ పేరు మీద మానవ హక్కులు ఉల్లంఘించడం కూడా జరుగుతోంది.. ఉదాహరణకు తీసుకుంటే కొన్ని ఔషధ కంపెనీలు భారత్‌లో పేద పిల్లలపై వ్యాక్సిన్ ట్రయల్స్ చేశాయి, మరణాలు జరిగినా సరైన విచారణ జరగలేదు.
నిపుణులు, మేధావులు కొన్ని నివారణ మార్గాలు సూచిస్తున్నారు.. మెడికల్ మాఫియా, క్లినికల్ ట్రయల్స్ దుర్వినియోగాన్ని నియంత్రించడానికి పౌరులు, మీడియా, ప్రభుత్వం అందరూ చర్యలు తీసుకోవాలి.. మరీ ముఖ్యంగా ప్రజల అత్యంత జాగ్రత్త వహించాలి.. ఏ ఆసుపత్రి నుంచైనా వైద్య సూచనలు పొందినప్పుడు రెండవ అభిప్రాయం అంటే సెకండ్ ఒపీనియన్ తప్పక తీసుకోవాలి.. మరో డాక్టర్ ను సంప్రదించాలి.. అదే విధంగా చికిత్స వివరాలు, మందుల వివరాలు రాతపూర్వకంగా అడిగి తీసుకోవాలి..
మీమీద ఎవరైనా ట్రయల్స్ చేయాలనుకుంటే దాని గురించిన పూర్తి వివరాలు, దానివల్ల వచ్చే రిస్కులు అంటే కష్టనష్టాలు సంపూర్ణంగా తెలుసుకోవాలి.. ఇక మీడియా అలాగే స్వచ్చంద సంస్థలు కీలక పాత్రను పోషించగలగాలి.. ఇలాంటి ఘటనలను ఎలాంటి ఆలోచన లేకుండా బహిర్గతం చేయాలి.. అలాగే రోగుల హక్కుల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం చేయాలి..
ప్రభుత్వ చర్యలు కఠినంగా ఉండాలి :
భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మాఫియా కార్యకలాపాలను అరికట్టడానికి కొన్ని చట్టాలు, నియంత్రణ వ్యవస్థలను తీసుకొచ్చాయి.. వాటిలో ముఖ్యమైన చట్టాలు, నియమాలు ఇలా ఉన్నాయి..
డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ యాక్ట్, 1940.. ఇందులో కొత్త ఔషధాల క్లినికల్ ట్రయల్స్‌పై కఠిన నియమాలు అమలుచేశాయి.. ఐ.సి.ఎం.ఆర్. గైడ్ లైన్స్ - ఇది మానవులపై పరిశోధనలకు నైతిక నియమావళి రూపొందించింది.. ఇక సి.డీ.ఎస్.సి.ఓ. అంటే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైసేషన్ అనేది క్లినికల్ ట్రయల్స్ అనుమతి, పర్యవేక్షణ బాధ్యత తీసుకుంటుంది..
ఈ కఠిన చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వాలు చెబుతున్నాయి.. అవి ఏమిటంటే అనుమతి లేకుండా ట్రయల్స్ చేస్తే జైలు శిక్ష, భారీ జరిమానాలు విధించడం.. అలాగే సంబంధిత ఆసుపత్రులు, మెడికల్ కంపెనీల లైసెన్స్ రద్దు చేయడం.. ప్రత్యేక నైతిక కమిటీ అంటే ఎథిక్స్ కమిటీ ఏర్పాటుచేసి ప్రతి ట్రయల్ పర్యవేక్షణ నిర్వహించడం..
అయితే రికార్డుల్లో, జీవోల్లో ఇవి నిక్షిప్తమై వున్నాయి.. వాస్తవరూపంలో అమలు అవుతున్నాయా అన్నది అనుమానాస్పదమే అంటున్నారు విశ్లేషకులు.. ప్రభుత్వం నైతిక బాధ్యత వహించకపోతే చాలా ప్రాణాలు పోతాయి.. ఒక హత్యచేస్తే న్యాయస్థానాలు కఠినమైన శిక్షలు విధిస్తున్నాయి.. మరి ఇవికూడా హత్యలతో సమానమే కదా..? మరెందుకు స్పందించడం లేదన్నది విశ్లేషకుల ప్రశ్న..
చివరకేగా మెడికల్ మాఫియా అనేది ప్రజల ప్రాణాలతో ఆటలు ఆడే అత్యంత ప్రమాదకరమైన వ్యవస్థ. ఇది కేవలం ప్రభుత్వమే కాకుండా, ప్రజల అవగాహన, మీడియా బాధ్యత, వైద్యుల నైతికత ద్వారా మాత్రమే నియంత్రించవచ్చు. ప్రతి పౌరుడు తన హక్కులు తెలుసుకొని, అనుమానాస్పద పరిస్థితుల్లో వెంటనే హెల్త్ డిపార్ట్‌మెంట్ లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలని " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ " సూచిస్తోంది..