భూబకాసురుల ను పుట్టించేది అవినీతి అధికారులే..

కోట్ల విలువచేసే ప్రభుత్వ భూమి హాం ఫట్.. అక్రమంగా బోరు, ట్రాన్స్ఫార్మర్ బిగింపు.. ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే ఉక్కు పాదం మోపాలి..

పోరుమామిళ్ల : 

WhatsApp Image 2025-09-11 at 7.05.21 PM

పోరుమామిల్ల మండలంలోని రంగసముద్రం పంచాయితీ, నర్సింగపల్లి గ్రామం సర్వే నెంబర్ 622 లో కోట్ల రూపాయలు విలువ చేసే 34 సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని అదే గ్రామానికి చెందిన ఇండ్ల పెద్ద సుబ్బారెడ్డి (ఐపి సుబ్బారెడ్డి) అనే వ్యక్తి కబ్జా చేయడం జరిగింది. ఈ ప్రభుత్వ భూమి, కడప నుంచి అమరావతికి వెళ్లే ప్రధాన జాతీయ రహదారి ప్రక్కనే పోరుమామిళ్ల తహసీల్దార్ కార్యాలయానికి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తహసిల్దార్, రెవిన్యూ ఇన్స్పెక్టర్, విఆర్ఓ లు నిత్యం ఈ దారిలో తిరుగుతూనే వుంటారు. ప్రభుత్వ స్థలమని, కబ్జాకు గురైందని తెలిసినా అటువైపు తలతిప్పి చూడరు. ఎందుకంటే చెడు చూడకు, వినకు, మాట్లాడకు అని బాల్యంలో నేర్చుకొని వుంటారు కదా!అది నూటికి నూరు శాతం పాటిస్తున్నారు కాబోలు. నన్నెవడు అడుగుతాడు, ఎవరేమి చేస్తారు అన్న ధీమాతో సుబ్బారెడ్డి గోడలు లేపాడు, ఇంకా మిగిలి వున్న స్థలంలో పిల్లర్లు వేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. అక్రమంగా బోరు వేశాడు, కరెంట్ ట్రాన్స్ఫారం బిగించుకున్నాడు, డబ్బులు పెట్టి కొని రిజిస్టర్ చేయించుకున్నట్లు చుట్టూ అందంగా పెన్సింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. కాలుమీద కాలు వేసుకొని కూర్చుని నిర్మాణాలు పర్యవేక్షిస్తుంటాడుఈ భూబకాసురుడు. విలేకరులు వెళ్లి ప్రశ్నిస్తే మండలమంతా వందల, వందల ఎకరాలు దొబ్బేస్తున్నారు వాళ్ళను వదిలేసి నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారా..! మీతో ఏమవుతుంది, మీఇష్టం వచ్చినట్లు, మీ చేతనైంది చేసుకోపోండి అని ఐపి సుబ్బారెడ్డి విర్రవీగడం జరిగింది. ఇంత జరుగుతున్నా రెవిన్యూ వాళ్ల కళ్లు మాత్రం అక్కడకుపోక పోవడం దురదృష్టకరం, ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. రెండు నెలల క్రితం ప్రభుత్వ స్థలం కబ్జా చేసి నిర్మాణాలు చేస్తున్నారు అని ప్రజలు సమాచారం ఇస్తే ఆర్ఐ నామకేవాస్తే వచ్చి వెళ్లాడని, మళ్ళీ ఈ ప్రాంతంలో కనపడలేదని చెబుతున్నారు. ఇదీ రెవెన్యూ అధికారుల నిర్వాకం అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పక్కా సమాచారంతో రెండు రోజుల క్రితం విలేఖరులు కూడా పిర్యాదు చేస్తే పాత పద్దతిలోని వారి అలవాటు ప్రకారం అటుపోయి ఇటు వచ్చారు. ప్రభుత్వ స్థలం కబ్జా అయింది, నిర్మాణాలు చేపడుతున్నారు అని ఎవరయినా పిర్యాదులు చేస్తే మొక్కుబడిగా అటు వెళ్లి ఇటు వస్తున్నారు తప్ప కేసులు పెట్టరు, స్థలాల్లో బోర్డులు పెట్టరు, ఎలాంటి చర్యలు తీసుకోరు.  ఏందిసార్ అటుపోయి ఇటు వచ్చారు అని ఆర్ఐ సుధాకర్ రెడ్డిని అడుగగా... అక్కడ అతనిది కూడా కొంత స్థలం వుంది, సర్వేయర్ ను పంపించి కొలతలు వేసి బోర్డు పెడతాంలే అంటున్నారు తప్ప క్రిమినల్ చర్యలు తీసుకుంటాం, ప్రభుత్వ భూముల్ని కాపాడతాం అని మాత్రం చెప్పడంలేదు. భూబకాసురులను పుట్టించేది, పోషించేది అవినీతి రెవిన్యూ అధికారులే అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాలు ఎవరు కబ్జా చేసినా వెంటనే స్వాధీనం చేసుకొని క్రిమినల్ చర్యలు చేపట్టాలని, అవినీతి అధికారులపై కూడా ఉక్కు పాదం మోపాలని ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Read More ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే విజయమ్మ

About The Author