కంటికి ఇంపుగా.. ముక్కుకు సొంపుగా.!
మణుగూరు :
- తిన్నోడికి తిన్నంతా రోగం.!
- కెమికల్స్ తో కలర్ ఫుల్ వంటకాలు
- పుట్టగొడుగుల్లా పాస్ట్ ఫుడ్ సెంటర్లు
- వాడిన నూనె ను మరల వాడకం
- కల్తీ నాణ్యత లోపంతో రోగాల భారిన పడుతున్న భోజన ప్రియులు
- జాడలేని ఫుడ్ ఇన్స్పెక్టర్
ఇలా బతికితేనే మనిషి.. లేదంటే వీడెవడురా బాబూ అన్నట్టుచూస్తూ... ఆరోగ్యమే మహా భాగ్యం అనే మాటే మరిచారు. అందుకే ప్రస్తుతం జీవన ప్రమాణం పడి పోయింది. పూర్వం ఒక మనిషి 80 నుంచి 90 ఏళ్లు బతికేవాడు. మరి నేడు 50 ఏళ్లు వచ్చేసరికే రోగాలతో మంచమెక్కుతున్నాడు. రోజు రోజుకు మనిషి జీవన ప్రమాణ స్థాయి పడిపోతూనేఉంది. ఇటీవల 30 ఏళ్ల లోపు వారికి హార్ట్ స్ట్రోక్ లు రావడానికి ఇటువంటి ఆహారమే కారణం. కంటికి ఇంపుగా ముక్కుకు సొంపుగా వుంటే చాలు బయట పుడ్స్ను పిల్లలనుంచి పెద్దల వరకు తెగలాగించేస్తున్నారు. కాని బయట లభ్యమయ్యే ఆహారంలో కల్తీ జరుగుతుందనే విషయాన్ని పట్టించుకోవడం లేదు. పినపాక నియోజకవర్గంలోని మణుగూరు పట్టణంతో పాటు మండల కేంద్రాల్లో హెూటల్స్, రెస్టారెంట్స్, స్వీట్ స్టాల్స్, దాబాలు, క్యాంటిన్లు, కర్రీపాయింట్లు ఉన్నాయి. ప్రస్తుతం పెరిగిన ధరల కారణంగా దంపతులిద్దరూ పనిచేస్తేనే కానీ రోజు గడవని పరిస్థితి. ఈనేపథ్యంలో మనిషి చాలా బిజీ అయ్యి ఇంటి వద్ద ఫుడ్ ను తయారు చేసుకుని తినే పరిస్థితులు చాలా వరకు తగ్గిపోయాయి. ఆకలి తీర్చుకునేందుకు బయట ఫుడ్ సెంటర్ల పై ఆధారపడుతున్నారు. వ్యాపారులు ఎక్కువ శాతం కనీస నిబంధనలు పాటించకుండా ఆహారాన్ని సిద్ధంచేస్తున్నారు. అదే తిని మనిషి ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నాడు. ఫుడ్ అంటే కేవలం భోజనమే కాదండోయ్.. రకరకాలు ఉన్నాయి. బిర్యానీ మొదలుకొని స్వీట్స్, బజ్జీ నుంచి పిజ్జా వరకు అన్ని కెమికల్స్ వాడుతూ ఘుమ ఘుమలాడే మసాలాలతో తయారు చేస్తున్నారు. వాటిని తిన్నవారు రోగాల భారినపడడం కాయమనే వాదన వినిపిస్తోంది. వర్షాకాలంలో ఆహారంలో ఏ మాత్రం తేడాఉన్నా వెంటనే వ్యాధుల భారిన పడే ప్రమాదం ఉంది.
ఆహార పానీయాల విషయంలో కొందరు వ్యాపారులు ప్రజల ఆరోగ్యంతో ఆటలు ఆడుతున్నారు. పాడైన వాటిని పాడేయాల్సింది పోయి వాటికి ఫ్రెస్ లుక్ ఇచ్చి ఆహారపదార్థాలను అమ్మేయడంతో ప్రజలు వారికి తెలియకుండానే జబ్బు పడుతున్నారు. ముఖ్యంగా క్యాన్సర్, లివర్ పాడై జీర్ణవ్యవస్థ దెబ్బతినడం, వాంతులు, విరేచనాలు, శరీరంలో అనేక రుగ్మతల బారినపడుతున్నారు. దీనికి కారణం పాడైన ఆహారం తీసుకోవడమే. మణుగూరు మండలంలో హెూటల్స్, రెస్టారెంట్స్, స్వీట్ స్టాల్స్, బేకరీలు, క్యాంటీన్లు, కర్రీ పాయింట్లు ఉన్నాయి. వాటిలో కొందరు చేస్తున్న కల్తీ, నాణ్యతలేమితో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు.
ఒకసారి కాచిన నూనెను మళ్లీ వినియోగించ కూడ దు. ఇదీ చాలా ప్రమాదం అయిన మిగిలి పోయిన నూనె ను పడవేయకుండా మరల వాడుతున్నారు. అది నల్లగా అయ్యే వరకూ వినియోగిస్తారు. దీంతో ఆ నూనె లో టీపీసీ స్థాయి 65 శాతంపైబడుతోంది. సాధారణంగా నూనెలో టీపీసీ శాతం 25శాతం కంటే తక్కువ ఉండాలి. ఇది చూడడానికి పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ 65 శాతం కంటే ఎక్కువ ఉన్న నూనెతో తయారు చేసిన ఆహారం తింటే కేన్సర్ కు దారితీస్తుంది. అయినా మరిగే నూనె నల్లగా ఉన్నా సరే ఆహార ప్రియులకు పట్టదు. వేడివేడిగా ఉన్నాయా లేదా అనుకుంటూనే తినేస్తాం. స్వీట్ స్టాల్స్ లో కలుపుతున్న కలర్స్ కారణంగా అవి పదిరోజులైనా తాజాగా కనిపిస్తాయి. ఆ కలర్స్ కారణంగా కొన్నిరకాల జబ్బులు వస్తాయి. నేతి మిఠాయిలనీ తయారు చేస్తున్నారు. వాటిలో 80 శాతం డాల్డాఉంటుంది. పైగా వాడే 20 శాతం నెయ్యి కూడా నాణ్యమైనది కాదు, ఇలా అనేక లోపాలు ఉన్నాయి. కొన్నిరకాల ఫుడ్స్ నిల్వ చేయడానికి వినియోగించే కెమికల్స్ వలన మనిషి ఆరోగ్యం పూర్తిగా హరిస్తుంది. కొన్ని స్వీట్స్ స్టాల్స్ దారుణంగా నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నాయి. ప్రస్తుతం సుగర్ పేషెంట్లు పెరగడానికి ఒత్తిడి ఒక కారణమైతే.. ఆహారం కూడా ఒక కారణమేనని వైద్యులు చెపుతున్నారు.
రోజుల తరబడి ఫ్రిజ్ నిల్వ
కొన్ని రెస్టారెంట్లు, హెూటల్స్ నిర్వాహకులు ఫ్రిజ్ లో చికెన్, మటన్, ఫిష్, ప్రాన్ తదితర మాంసాహారాలను రోజుల తరబడి నిల్వ చేస్తున్నారు. ఆయా మాంసాలు గడ్డకట్టి పోయి అవి మళ్లీ సాధారణ స్థితికి చేరినప్పుడు జిగురువంటి పదార్ధం వాటిపై కనిపిస్తుంది. అయితే ఈ మాంసాన్ని బాగా డ్రై చేసి కలర్ ఫుల్ మసాలా దట్టించి వండేయ్యడంతో అది బాగా డ్రై అయ్యి దాని వాసన పరిస్థితి తెలియడం లేదు. అలాగే కుళ్లిన కోడిగుడ్లను కూడా వదలడంలేదు.. అండాబజ్జి చేసేటప్పుడు వాటిలో కలిపేస్తున్నారు. మాంసాహారం ఏదైనా ఎటువంటి కెమికల్ కలపకుండా ఫ్రిడ్జ్ లో నిల్వచేస్తే కేవలం 3 రోజుల మాత్రమే ఫ్రెష్ గా వుంటుంది. కానీ వారం తరబడి నిల్వ చేయడం వల్ల అందులో బ్యాక్టీరియా చేరి దానిని తిన్నవారు జబ్బుల బారిన పడే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
జాడలేని పుడ్ ఇన్స్పెక్టర్లు
భద్రాద్రి జిల్లా మణుగూరు మండలంలో హెూటల్స్, కర్రీ పాయింట్లు, బిర్యానీ పాయింట్లు ఉన్నాయి. అయినా అటువైపు ఆహార నియంత్రణ అధికారులు కన్నెత్తి చూసిన దాఖలాలే లేవు. ఎక్కడికక్కడ కల్తీ, నాణ్యతలేమితో ఆహారపదార్థాలు తయారు చేస్తుంటే ఫుడ్ ఇన్స్పెక్టర్ మాత్రం చోద్యం చూస్తున్నారు. మండల కేంద్రంలోనే అనేక వ్యాపార సంస్థలు నాణ్యత లేమితో వండివార్చేస్తుంటే అది ఫుడ్ఇన్స్పెక్టర్ లకు కనిపించకపోవడం వెనుక పలుఅనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించాలని భోజన ప్రియులు కోరుతున్నారు.