అవినీతినే తన స్టాంపుగా మార్చుకున్న స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ..
( స్పెషల్ కరస్పాండెంట్, హైదరాబాద్ )
- దేశంలోనే ఒక ప్రమాదకర సమస్యగా పరిణమించిన వైనం..
- ప్రజలతో నేరుగా సంబంధం కలిగిన శాఖ ఇది..
- లంచాలు లేనిదే ఏపనీ కాదన్నది యాదార్థవాదం..
- నిబంధనలలోని లోపాలను అనుకూలంగా మార్చుకుంటున్న అవినీతిపరులు..
- నిషేధిత భూములను యథేచ్ఛగా రిజిస్ట్రేషన్ చేస్తున్న దారుణం..
- తప్పుడు పత్రాలు, నకిలీ పత్రాలతో నిస్సిగ్గుగా లావాదేవీలు..
- తమ విశిష్ట అధికారాలను దుర్వినియోగం చేస్తున్న అవినీతి ఆఫీసర్లు..
- చట్ట విరుద్ధమైన పనులు చేయడానికి ఎవరూ వెనుకంజ వేయడం లేదు..
- ప్రభుత్వ పెద్దలే ప్రోత్సహిస్తున్నారన్నది బహిరంగ రహస్యం..
- రాజకీయ నాయకుల ప్రమేయంతో అడుగడుగునా అరాచకమే..
- ఈ శాఖలో అవినీతిని అరికట్టకపోతే ఎన్నెన్నో అనర్ధాలు ఎదురయ్యే ప్రమాదం..
- స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ పూర్తిగా ప్రక్షాళన జరగాలి..
- ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "..
ప్రజలతో నేరుగా సంబంధాలు.. వారి అవసరాలు.. ముఖ్యంగా భూ వ్యవహారాలు.. రిజిస్ట్రేషన్లు.. స్థిరాస్థికి రక్షణ కల్పించడం.. భూ యజమానులు గుర్తించడం.. నిజాయితీగా సంరక్షించడం.. ఈ గురుతర బాధ్యతలు నిర్వహిస్తుంది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ.. అంతే కాదు.. ప్రభుత్వానికి అత్యంత కీలకమైన ఆదాయ వనరులను సమకూరుస్తుంది.. స్టాంప్ డ్యూటీల పేరుతో నిజాయితీగా ప్రజలనుండి ఫీజుగా సేకరించి, ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తుంది.. జమ అయిన ఈ నిధులు తిరిగి ప్రజా అవసరాలకోసం, ప్రజా సౌకర్యాలకు ప్రభుత్వం వినియోగిస్తుంది.. కానీ ఈ శాఖలో ఇప్పుడు పరిస్థితులు అంతా తారుమారుగా ఊన్నాయి.. ప్రభుత్వ ఖజానాకు చేరవలసిన సొమ్ము కొందరు అవినీతి అధికారుల బొక్కసానికి చేరుతోంది.. నిజాయితీగా జరగాల్సిన పనులు అవినీతికి ఆలవాలమై పోయాయి.. లంచం, లంచం, లంచం.. లంచమనే ఈ మహమ్మారి ఈ శాఖలో వేళ్ళూనుకుపోయింది.. పైసా లేనిది ఫైల్ కదలడం లేదు.. ఒరిజినల్ పత్రాలు లేకపోయినా.. కరెన్సీ నోట్లు ఉంటే చాలు.. మీరు కోరుకున్న భూమి మీపేరుమీద రిజిస్ట్రేషన్ అయిపోతుంది.. అధికారులకు అమ్యామ్యాలు చెల్లిస్తే చాలు.. ప్రభుత్వానికి కట్టాల్సిన స్టాంప్ డ్యూటీ కూడా స్వల్పంగా కట్టి తప్పించుకోవచ్చు.. కీలకమైన ఈ శాఖ పూర్తిగా అవినీతిమయం అయిపొయింది.. దారుణం ఏమిటంటే ఎంతో కీలకమైన స్టాంప్ పేపర్లు సైతం నకిలీవి పుట్టుకొస్తున్నాయి.. ఈ వ్యవహారంలో తెలంగాణకు చెందిన ఒక మంత్రి సైతం ఇరుక్కుని డిస్మిస్ అయిన సంగతి మనం చూశాం.. నకిలీ స్టాంప్ పేపర్ల వ్యవహారం దేశ వ్యాప్తంగా అప్పుడు సంచలనం రేకెత్తిచ్చింది.. ఈ వ్యవహారంలో కీలకమైన అధికారులు కూడా తమవంతు పాత్రను పోషించడం మనం చూసాం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటి కాదు రెండు కాదు అనేకానేక అక్రమాలు ఈ శాఖలో నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి..
నిబంధనలలో లోపాలు :
కొన్నిసార్లు నిబంధనలలో ఉండే లొసుగులను ఉపయోగించుకుని అధికారులు అక్రమాలకు పాల్పడతారు. నిషేధిత భూముల రిజిస్ట్రేషన్, తప్పుడు పత్రాల ద్వారా లావాదేవీలు వంటివి ఇబ్బడి ముబ్బడిగా జరుగుతున్నాయి.
అధికార దుర్వినియోగం :
కొందరు సబ్-రిజిస్ట్రార్లు, ఇతర ముఖ్యమైన అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ డైరెక్ట్ గానే లంచాలు డిమాండ్ చేస్తున్నారు.. పనులు త్వరితగతిన చేయడానికి, లేదా చట్టానికి విరుద్ధంగా పనులు చేయడానికి లంచం రూపంలో డబ్బులు అడుగుతున్నారు..
ముఖ్యమైనది దళారుల వ్యవస్థ :
రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో డాక్యుమెంట్ రైటర్లు, దళారీలు కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరు నేరుగా ప్రజల నుంచి డబ్బు వసూలు చేసి, ఆ మొత్తాన్ని అధికారులకు పంపిణీ చేస్తారు. ఈ దళారుల వ్యవస్థ అవినీతికి ప్రధాన కేంద్రంగా నిలుస్తోంది..
ఆన్‌లైన్ వ్యవస్థలో లోపాలు :
ప్రభుత్వం ఆన్‌లైన్ వ్యవస్థలను ప్రవేశపెట్టినా, అందులో కూడా అవినీతికి అవకాశాలు ఎన్నో కనిపిస్తున్నాయి. ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్, పత్రాల ధృవీకరణ వంటి వాటిలో కూడా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి..
ఈ అవినీతి జాడ్యం వల్ల ఎన్నెన్నో నష్టాలు :
ముఖ్యంగా ప్రజలకు ఆర్థిక నష్టం విపరీతంగా జరుగుతోంది.. రిజిస్ట్రేషన్ల కోసం ప్రజలు అడిగినంత డబ్బు చెల్లించాల్సి వస్తోంది. ఇది వారికి అనవసరమైన ఆర్థిక భారాన్ని మోపుతుంది.
ఇక ప్రభుత్వానికి ఆదాయ తీరని నష్టం :
సరైన స్టాంప్ డ్యూటీ, ఇతర ఛార్జీలు చెల్లించకుండా తక్కువ మొత్తంలో రిజిస్ట్రేషన్లు చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది. దీంతో అవినీతి అధికారుల జేబులు నిండుతున్నాయి.. ప్రభుత్వం నుంచి జరగాల్సిన అభివృద్ధి పనులకు తీవ్రమైన ఆటంకం కలుగుతోంది..
న్యాయపరమైన వివాదాలు :
తప్పుడు పత్రాలు లేదా నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ల వల్ల భవిష్యత్తులో భూ వివాదాలు తలెత్తుతాయి. ఇది ప్రజల మధ్య గొడవలకు, కోర్టు కేసులకు దారితీస్తుంది. ఒక్కోసారి ప్రాణాలు తీసేంత భయంకర పరిస్థితులు కూడా ఎదురవుతాయి.. ఇలాంటి ఉదంతాలు ఎన్నెన్నో చూశాం..
ప్రభుత్వంపై విశ్వాసం సన్నగిల్లుతుంది :
ఈ శాఖలో అవినీతి ప్రజలకు ప్రభుత్వ వ్యవస్థలపై ఉన్న విశ్వాసాన్ని తగ్గిస్తుంది.. ఇప్పటికే ఈ ప్రమాదం నెలకొని ఉంది..
నామ మాత్రంగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలు:
అవినీతిని తగ్గించడానికి ప్రభుత్వం కొన్ని సంస్కరణలు చేపడుతోంది. పారదర్శకతను పెంచడం, ఆన్‌లైన్ సేవలను మెరుగుపరచడం వంటి చర్యలు తీసుకుంటున్నాయి. ఏసీబీ అంటే అవినీతి నిరోధక శాఖ దాడులు కూడా నిరంతరం జరుగుతున్నాయి. అయినప్పటికీ, అవినీతి పూర్తిగా నిర్మూలించబడలేదన్నది అక్షర సత్యం.. ఇందుకు ప్రతి నిత్యం మనం చూస్తున్న వార్తా కథనాలు సాక్షం..
మొత్తానికి, స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతి ఒక వ్యవస్థీకృత సమస్యగా మారింది. ఇది ప్రజలను ఆర్థికంగా, న్యాయపరంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించడానికి కఠినమైన చర్యలు, పారదర్శక వ్యవస్థలు, ప్రజలలో అవగాహన పెంపొందించడం అవసరం అని సూచిస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "...