111 జీఓ పరిధిలో అక్రమ నిర్మాణాలు..
( స్పెషల్ కరస్పాండెంట్, హైదరాబాద్ )
- భవిష్యత్ నీటి భద్రతకు సంభవించనున్నపెను ముప్పు..
- మొయినాబాద్, రాజేందర్ నగర్, చేవెళ్ల, షాబాద్, శంకరపల్లి, గండిపేట్, కొత్తూరు మండలాల్లో తీవ్ర ప్రభావం..
- సుమారు 1,32,000 ఎకరాలు 111 జీఓ పరిధిలో భూములపై ఎఫెక్ట్..
- భాగ్యనగరంలో నానాటికీ పెరుగుతున్న నీటి అవసరాలు..
- భూగర్భ జలాలు అడుగంటిపోతే జనాల గొంతులు ఎండిపోవడం ఖాయం..
- దురాక్రమణ జరుగుతున్నా అధికారుల్లో సోయి లేదు..
- లంచాలు తీసుకుంటూ చూసి, చూడనట్లు వ్యవహరిస్తున్న వైనం..
- ఎక్కువ శాతం రాజకీయనాయకులు, అక్రమార్కులైన నిర్మాణదారుల హస్తం..
- అడ్డగోలుగా కబ్జాలు చేయడం, భారీ నిర్మాణాలు చేపట్టడం..
- ఈ నిర్మాణాల్లో కొనుగోలు చేసిన అమాయకుల జీవితాలు ఆగమాగం..
- చెరువులు దురాక్రమణకు గురి అవుతున్నా మొద్దునిద్రల్పోతున్న హైడ్రా..
- చెరువులను రక్షిస్తాం.. ప్రజలను కాపాడతాం, పర్యావరణాన్ని రక్షిస్తాం అని చెప్పడం తప్ప చేసింది ఏమీ లేదు..
- అక్రమార్జనకు అలవాటు పడ్డ అధికారులు, నిర్మాణదారులు, ప్రభుత్వ పెద్దలున్నంతకాలం ఇదే పరిస్థితి..
- 111 జీఓ దురాక్రమణలపై సమరశంఖం పూరిస్తోంది " ఫోరం ఫార్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "...
హైదరాబాద్ నగర అభివృద్ధి గత మూడు దశాబ్దాలుగా వేగంగా కొనసాగుతోంది. మెట్రో సిటీ స్థాయికి ఎదిగిన ఈ మహానగరానికి నీటి అవసరం రోజు రోజుకీ పెరుగుతోంది. ఈ అవసరాన్ని తీర్చే ప్రధాన వనరులే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ సరస్సులు. వీటి రక్షణ కోసం 1996లో ప్రభుత్వం జీవో 111ను జారీ చేసింది. కానీ ప్రభుత్వాలు జారీ చేసిన జీఓనే.. స్వయంగా ఆ ప్రభుత్వంలో భాగస్వాములైన కొందరు కుహనా నాయకులు ఉల్లంఘిస్తున్నారు.. ఇష్టానుసారం 111 జీఓ పరిధిలోని భూములను ఆడగోలుగా ఆక్రమించి నిర్మాణాలు చేసుకున్నారు.. తమ విలాసాలకు విల్లాలు, ఫార్మ్ హౌస్ లు నిర్మించుకున్నారు.. మరి కొందరు రియల్టర్లు యథేచ్ఛగా 111 జీఓ పరిధిలోని భూములను ఆక్రమించి అపార్ట్మెంట్స్, విల్లాలు నిర్మించి అమ్మేసుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.. ఇంతలా అవినీతి జరుగుతున్నా ప్రభుత్వం గానీ, ఉన్నతాధికారులు గానీ స్పందించడం లేదు.. కారణం ఈ అవినీతిలో ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల సన్నిహితులు, రాజకీయ నాయకులకు సన్నిహితంగా మెలిగే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉండటమే.. ప్రజలేమైనా పర్వాలేదు.. భవిష్యత్ తరాలకు తాగునీరు, వ్యవసాయానికి సాగునీరు లేకపోయినా పర్వాలేదు.. తమ బొక్కసాలు నిండితే చాలు అనుకుంటున్నారు.. వీరి తరం గడచిపోతుంది.. మరి భవిష్యత్ తరాల మాటేమిటి..? ఏముంది అప్పుడు కూడా ఈ అవినీతిపరుల పరంపర వారి బిడ్డలా రూపంలో తిరిగి విజృంభిస్తుంది.. వీరి అక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి.. ఈ వ్యవహారానికి ఇప్పుడే ఫుల్ స్టాప్ పెట్టకపోతే.. సామాన్యులు దాహార్తితో అలమటించి, రైతులు పంటలు లేక విలవిల్లాడిపోతారు.. మహానగరం స్మశానంలా మారిపోతుంది.. భవిష్యత్తులో పుస్తకాల్లో తప్ప మహానగర వైభవం మటుమాయమై పోతుంది.. ఇది అక్షర సత్యం..
అసలు జీఓ 111 ఉద్దేశం మహోన్నతమైనది.. ఈ జీవో ప్రకారం చెరువులు, సరస్సుల పరిధిలోని 10 కిలోమీటర్ల లోపల ఎటువంటి భారీ భవన నిర్మాణాలు, పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ లేఅవుట్లు, కాలుష్యం సృష్టించే ప్రాజెక్టులు ఉండకూడదు. కారణం ఏమిటంటే భూగర్భ జలాలు, చెరువులు, సరస్సుల నీరు కలుషితం కాకుండా చూడటం. అంటే, ఈ జీఓ ఒక రకంగా హైదరాబాద్ భవిష్యత్ నీటి భద్రతకు రక్షణ కవచంగా నిలుస్తుంది..
కానీ వాస్తవ పరిస్థితి భిన్నంగా వుంది.. కాగితాలపై ఉన్న ఈ రక్షణ కవచం వాస్తవ జీవితంలో క్రమంగా చిల్లులు పడి పోతోంది.
ప్రభావశీలులు, మేధావుల సహకారంతో రియల్ ఎస్టేట్ మాఫియా విల్లా ప్రాజెక్టులు, ఫార్మ్ హౌస్‌లు, రిసార్ట్‌లు విస్తరిస్తోంది. ఇక అక్రమ లేఅవుట్లకు గ్రామ పంచాయతీలు, స్థానిక నాయకులు అనుమతులు ఇచ్చే ఉదంతాలు కూడా ఇబ్బడి ముబ్బడిగా బయటపడుతున్నాయి.
ఒకవైపు అధికారులు అక్రమ నిర్మాణాలపై కూల్చివేత చర్యలు చేపడుతున్నట్లు చూపించినా, మరోవైపు పెద్ద స్థాయి నిర్మాణాలను కనీసం టచ్ చేయడానికి కూడా వెనుకంజ వేస్తున్నారన్నది కళ్ళముందు కనిపిస్తోంది..
దీనివల్ల విపరీతమైన దుష్ప్రభావాలు ఏర్పడుతున్నాయి.. చెరువులు, సరస్సులపై డైరెక్టుగా ప్రభావం చూపిస్తోంది.. మురుగునీటి ప్రవాహం పెరిగి నీటి నాణ్యత తగ్గుతోంది. భూగర్భ జలాల సమస్యఅధికమవుతోంది.. అధిక కాంక్రీటీకరణ వల్ల నీరు నేలలోకి చొచ్చుకుపోకపోవడం. నగర నడిబొడ్డులో సైతం వరద ప్రమాదాలు సంభవిస్తున్నాయి.. ప్రజల భవిష్యత్ నీటి అవసరాలు మృగ్యమై పోతున్నాయి.. హైదరాబాద్‌కు రాబోవు 20, 30 ఏళ్లలో తాగునీరు సరఫరా చేయడం కష్టమవుతుంది. చట్టాల పట్ల విపరీతమైన నిర్లక్ష్యం ఏర్పడుతోంది.. ప్రభుత్వ ఉత్తర్వులు, కోర్టు తీర్పులు ఉన్నా అవి అమలవడం మాత్రం జరగడం లేదు..
ఈ వ్యవహారంపై నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.. పర్యావరణ నిపుణుల మాటల్లో.. “జీవో 111 రద్దు చేయడం గాని, ఉల్లంఘనలను పట్టించుకోకపోవడం గాని భవిష్యత్‌లో హైదరాబాద్‌ను నీటి సంక్షోభంలోకి నెట్టివేస్తుంది..
కాగా స్థానిక రైతులు, పర్యావరణ కార్యకర్తలు, సంఘాలు ఈ అక్రమ నిర్మాణాలను ఆపాలని, ఇప్పటికే నిర్మించిన కట్టడాలను కూల్చాలని పట్టుదలతో డిమాండ్ చేస్తున్నారు. “ఇది కేవలం పర్యావరణ సమస్య కాదు, మన భవిష్యత్ తరాల జీవనాధార సమస్య” అని వారు చెబుతున్నారు.
111 జీఓ కేవలం ప్రభుత్వ ఉత్తర్వు మాత్రమే కాదు, అది హైదరాబాద్ నీటి భద్రతకు బలమైన కంచె. కానీ ఈ కంచెను రాజకీయ ప్రయోజనాలు, రియల్ ఎస్టేట్ ఆశలు చెరిపేస్తున్నాయి. అక్రమ నిర్మాణాలను అరికట్టకపోతే రాబోయే తరాలు తాగునీటి కోసం తహతహలాడే పరిస్థితి తప్పదు. కాబట్టి ప్రభుత్వం, ప్రజలు, పర్యావరణ సంస్థలు కలసి ఈ ఉల్లంఘనలను ఆపి హైదరాబాద్ భవిష్యత్‌ను కాపాడాల్సిన అవసరం అత్యవసరం అన్నది తెలుసుకోవాలి..