మాతృభాషలో విలువలతో కూడిన విద్యను బోధించాలి
ఉపాధ్యాయ దినోత్సవ సన్మాన సభలో ప్రముఖ విద్యావేత్త, కవి, పండితుడు చౌడూరి నరసింహారావు
సామాన్య అధ్యాపకుడు దేశానికి అధ్యక్షత వహించగలరని నిరూపించిన మహోన్నత వ్యక్తి, నైతిక విలువలకు నిలువెత్తు నిదర్శనం, భారత రాష్ట్రపతి "భారతరత్న" ఆచార్య సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడని, ఆ మహనీయుని స్ఫూర్తి తో ఉపాధ్యాయులు పనిచేయవలసిన అవసరమున్నదని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ.. విద్యారంగంలో నేడు జరుగుతున్న అనూహ్య మైన మార్పులు చూస్తుంటే కొంత ఆనందం కలిగిస్తున్నా ఆందోళన మాత్రం కలగక మానదని, నైతిక విలువలను బోధించే పాఠశాల అవశ్యకత నేడు ఎంతైనా ఉందని, విలువలతో కూడిన విద్యను బోధించాలని, అదికూడా మాతృభాషలో బోధించాలని, నేటి విద్యార్థులలో అమ్మానాన్నల పట్ల, పెద్దలపట్ల వినయ విధేయతలను పెంపొందించే విధంగా టీచర్లు ప్రేమ వాత్సల్యాలతో బోధించాలని, సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర గురుతరమైనదని గుర్తు చేస్తూ.. ఉపాధ్యాయులు అందుకు నడుం బిగించాలని ప్రముఖ విద్యావేత్త, ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత, విశ్రాంత సంస్కృత విభాగాధిపతి (కార్పోరేట్ కళాశాలలు), "సాహిత్య కళా విభూషణ" చౌడూరి నరసింహారావు అభిప్రాయపడ్డారు. హైటెక్ సిటీ లోని దేవ్ గురు పాఠశాల ప్రాంగణంలో శుక్రవారంనాడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జరిగిన "టీచర్స్ డే" వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొని కీలక ఉపన్యాసం చేస్తూ పై విధంగా అభిప్రాయపడ్డారు. స్వాతి హై స్కూల్, దేవ్ గురు హై స్కూల్ వంటి పాఠశాలలు విద్యార్థులలో నైతిక విలువలను, క్రమశిక్షణను పెంపొందించటంలో తమ వంతు కృషిని కొనసాగించడం అభినందనీయమని పాఠశాలల యాజమాన్యాన్ని, టీచర్స్ ను అభినందించారు. మరొక అతిథి రాష్ట్రపతి అవార్డు గ్రహీత, బీవీపీ ప్రాంత సంపర్క ప్రముఖ్ రఘు సతీష్ కుమార్ మాట్లాడుతూ.. స్కూల్స్ అధినేత ఫణి కుమార్ గత నాలుగు దశాబ్దాలుగా విద్యారంగంలో ఎనలేని కృషిని కొనసాగిస్తూ స్కూలును చక్కగా నిర్వహిస్తున్నారని స్కూల్స్ యాజమాన్యాన్ని ప్రశంసించారు. మరొక అతిథి చైతన్య కళాశాలల సీఈవో డి ఆర్ కె రావు మాట్లాడుతూ... ప్రస్తుతం ఉన్న కార్పోరేట్ విధానం జరుగుతున్న మార్పులను గురించి మాట్లాడారు. పిమ్మట ముఖ్య అతిథి ప్రధాన వక్త చౌడూరి నరసింహారావును స్కూల్స్ అధినేత ఊట్ల ఫణి కుమార్ స్కూల్స్ హెడ్ మిస్ట్రెస్ పద్మజా లు మకుటం, శాలువా, పూల కుండీ, జ్ఞాపికలతో పూల వర్షాన్ని కురిపిస్తూ ఘనంగా సన్మానించారు. ఇలాగే మిగిలిన అతిథులను సత్కరించారు. తనను ఘనంగా సత్కరించినందుకు స్కూల్స్ అధినేత పణి కుమార్ కు చౌడూరి నరసింహారావు ధన్యవాదాలు తెలిపారు. ఈ సభలో ప్రముఖ చేతి వ్రాత నిపుణులు బివిపి ఆర్యభట్ట శాఖ పాటర్న్ బి. సుదర్శన్, బివిపి ఆర్యభట్ట శాఖ ట్రెజరర్ యోగానందం, స్వాతి స్కూల్ సెంటర్ హెడ్ చంద్రిక రాణి, ఇన్చార్జ్ మౌనిక, దేవ్ గురు స్కూల్ సెంటర్ హెడ్ రమణ్ దీప్ కౌర్, ఇన్చార్జ్ సంధ్య తో పాటు స్కూల్స్ లో పనిచేస్తున్న టీచర్స్ అందరూ పాల్గొన్నారు. స్థలాభావం వల్ల పదవ తరగతి విద్యార్థులు మాత్రమే పాల్గొన్నారు. తొలుత స్కూల్స్ అధినేత పణి కుమార్, హెడ్ మిస్ట్రస్ పద్మజ లను ఉపాధ్యాయులంతా ఘనంగా సత్కరించారు. తదుపరి టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ను స్కూల్స్ అధినేత పణి కుమార్ హెడ్ మిస్ట్రెస్ పద్మజ లు ఒక్కొక్కరిని పిలిచి సత్కరించారు. అంతకు మునుపు స్టూడెంట్స్ ప్రదర్శించిన కల్చరల్ ప్రోగ్రామ్స్ అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి అందరికీ చక్కటి విందు భోజనాన్ని స్కూల్ యాజమాన్యం ఏర్పాటు చేసింది ఆద్యంతం ఈ సభ ఉత్సాహంగా ఉల్లాసంగా సాగింది.