ఆపద్బాంధవులు జగ్గారెడ్డి దంపతులు
కంటి చూపు కోల్పోయిన విద్యార్థికి 10 లక్షల ఆర్థిక సహాయం
సంగారెడ్డి :
కర్ణాటకకు చెందిన కిషన్ పవార్, శాంతాబాయి దంపతులు 15ఏళ్ల క్రితం సంగారెడ్డి జిల్లా కందికి వచ్చి స్థిరపడ్డారు. వీరి చిన్న కుమారుడు సంపూరన్ నాయక్ (బీకాం విద్యార్థి) ఏడాది క్రితం బైక్ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలపాలై, కంటి చూపు కోల్పోయాడు. కంటి నుంచి బ్రెయిన్‌కు వెళ్లే నరం దెబ్బతినడం వల్ల చూపు కోల్పోయిన సంపూరన్, ఒక నెలపాటు కోమాలో ఉండాల్సి వచ్చింది.ఆప్టిక్ హైడ్రోపి వ్యాధితో బాధపడుతున్న సంపూరన్ చికిత్స కోసం ఇప్పటి వరకు తల్లిదండ్రులు ఐదు లక్షల ఖర్చు చేశారు ఇంకా అవసరమైన చికిత్సలకు సుమారు రూ.8 లక్షలు కావాలని వైద్యులు సూచించారు. ఆక్యుపంక్చర్, స్టెమ్ సెల్ రిజనరేషన్ చికిత్సలను ఒకేసారి చేస్తే చూపు తిరిగి వచ్చే అవకాశం ఉందని వైద్యులు తేల్చారు. ఆర్థిక ఇబ్బందులతో చికిత్స చేయించలేక తల్లిదండ్రులు ఆవేదనతో జగ్గారెడ్డి దంపతులను ఆశ్రయించారు. సంపూరన్ దయనీయ పరిస్థితిని గమనించిన జగ్గారెడ్డి దంపతులు హృదయపూర్వకంగా స్పందించి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించారు.చికిత్స విజయవంతం కావాలని ఆకాంక్షించిన జగ్గారెడ్డి దంపతులు, ఇలాంటి పేషెంట్ల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ పరంగా కూడా సహాయం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.అనారోగ్యం బారిన పడిన సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు వ్యక్తిగతంగానే కాక ప్రభుత్వ పంథాలోనూ సహాయం అందించే ప్రయత్నం చేస్తున్నానని, ముఖ్యంగా క్యాన్సర్ రోగుల పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తున్నానని ఈ సందర్భంగా జగ్గారెడ్డి తెలిపారు.