గోర్ సేన ఆధ్వర్యంలో శాంతి యుత ర్యాలీ
సంగారెడ్డి :
సంగారెడ్డి జిల్లాలో గోర్ సేన ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని సుప్రీంకోర్టులో తెల్లా వెంకట్రావు, సోయం బాబురావులు పిటిషన్లు దాఖలు చేయడాన్ని గోర్ సేన తీవ్రంగా ఖండించింది. దేశంలో 18 కోట్లకు పైగా బంజారాలు గిరిజన జాతికి చెందినవారని, వారిని 1976లోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ఎస్టీ జాబితాలో చేర్చిందని, ఇప్పుడు దానిని వ్యతిరేకించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని గోర్ సేన నాయకులు పేర్కొన్నారు. కేవలం రాజకీయ లాభాల కోసమే అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉన్న ఆదివాసి లంబాడీల మధ్య చిచ్చులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ, గతంలో లంబాడీల ఓట్లతోనే గెలిచానని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు వారినే మోసం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర రాజకీయాల్లో లంబాడీల ఓట్లు కీలకమని భావించి వారిని విచ్ఛిన్నం చేయాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించిన గోర్ సేన, కాంగ్రెస్ పార్టీ తక్షణమే తెల్లా వెంకట్రావు మరియు సోయం బాబురావులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది. ఈ ర్యాలీలో గోర్ సేన ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు రమేష్ నాయక్ రాథోడ్, సంగారెడ్డి గోర్ సేన అధ్యక్షులు బానోత్ రాజు నాయక్, నారాయణ్ రాథోడ్, శంకర్ నాయక్, జైపాల్ నాయక్, పరిలాల్ నాయక్ పాల్గొనగా, పెద్ద ఎత్తున విద్యార్థులు, మహిళలు, యువత, సమాజ పెద్దలు హాజరై ఐక్యతను ప్రదర్శించారు.