కుంటల ఆక్రమణలు తొలగించండి
ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్చెరు, జూలై 18 (భారత శక్తి):
ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని పాశమైలారం గ్రామ పరిధిలోగల ఆరు కుంటలు ఆక్రమణలకు గురి కావడంతో వీటిపై ఆధారపడిన మత్స్యకారుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. వెంటనే ఆక్రమణలు తొలగించి చేపల పెంపకానికి అనువుగా ఏర్పాటు చేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో పాటు నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ అహ్మద్ హుస్సేన్ ను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు.
శుక్రవారం హైదరాబాదులోని ఆయా కార్యాలయాలలో వారితో సమావేశమై కుంటల అక్రమణాలపై వివరించారు. ప్రధానంగా పాశమైలారం పరిధిలోని కొత్త కుంట, పాపాయిగూడ కుంట, గొల్లవానికుంట, ఉబ్బాని కుంట, వడ్లవానికుంట, ఆరోటోని కుంటల పరిధిలోని 39 ఎకరాల ఆరు గంటల భూమి పూర్తిగా ఆక్రములకు గురైందని వారి దృష్టికి తీసుకెళ్లారు. కుంటలు ఆక్రమణలకు గురి కావడం మూలంగా వీటిపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకార కుటుంబాలు స్థానిక పరిశ్రమలలో కూలీలుగా పనిచేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఆరు కుంటల పరిధిలో ఆక్రమణలు తొలగించి చేపల పెంపకానికి అణువుగా తీర్చిదిద్దాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన అధికారులు వెంటనే చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.