చదువు "కొంటున్నాం"
విద్యాహక్కు చట్టం ఎటుపోయింది..?
- చదువుల తల్లిని బహిరంగ మార్కెట్ లో అమ్మేస్తున్న దౌర్భాగ్యం..
- న్యాయస్థానాలు అక్షింతలు వేస్తున్నా ఏమాత్రం ప్రయోజనం లేదు..
- అక్రమ విద్యా సంస్థలకు నోటీసులు ఇవ్వడం చేతులు దులుపుకోవడం..
- అవినీతి అధికారుల అలసత్వం.. పేద విద్యార్థులకు శాపం..
- ఉచితంగా నిర్బంధ విద్య అమలైనప్పుడే అందరికీ విద్య దొరుకుతుంది..
- కేజీ టు పీజీ ఫ్రీ అంటూ ఊదరగొట్టడం తప్ప ఏపార్టీ ఏమీ చేసింది లేదు..
- కార్పొరేట్ స్కూళ్లకు, విద్యాసంస్థలకు దాసోహం అంటున్న ప్రభుత్వాలు..
- పరిపాలనలో భాగస్వాములవుతున్న కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు..
- ప్రైవేట్ విద్యా సంస్థల్లో సెక్షన్ 12(1)(సి) ఎందుకు అమలవ్వడం లేదు..?
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల విద్యార్థులకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది..?
- పేద విద్యార్థులు చదువుకోకూడదా..? ఉన్నత స్థానానికి చేరకూడదా..?
- విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు పోరాటం సాగిస్తున్న
- ఫోరమ్ ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ..
దేశంలో ఉచితాలు అవసరం లేదు.. ఉచితాలు అనుచితం అంటూ మేధావులు చెబుతూనే ఉన్నారు.. ఉచితాలనే తాయిలాలు పంచుతూ పబ్బం గడుపుకుంటున్నాయి ప్రభుత్వాలు.. ఉచితాలతో సోమరిపోతులను చేస్తున్నారు.. నిజానికి దేశంలో ఉచితంగా ఏదైనా ఇవ్వాలి అనుకుంటే రెండే రెండు.. అవి విద్య, వైద్యం.. దురదృష్టం ఏమిటంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రెండే చాలా ఖరీదైనవిగా మారిపోయాయి.. ఎందుకంటే ఇవి పెద్ద వ్యాపార వస్తువులుగా మార్చేశారు.. మార్కెట్ ను షేక్ చేస్తున్నారు.. ఎలాంటి చట్టాలు వీరికి వర్తించవు.. వీరికి ఎలాంటి నిజాయితీ ఉండదు.. కేవలం ధన వ్యామోహం తప్ప.. పేద విద్యార్థులు విద్యావంతులైతే తమ మనుగడకే ప్రమాదం అని తలస్తున్న బడా నాయకులు ఆడుతున్న ఆట ఇది.. ఈ పద్ధతి మారాలి.. విద్య అందరికీ అందాలి..
హైదరాబాద్, 16 జులై ( భారత శక్తి ) :
విద్యాహక్కు చట్టం - 2009 ప్రకారం ప్రైవేటు విద్యాసంస్థలు చట్టంలోని సెక్షన్ 12(1)(సి) ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు 25శాతం రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తూ తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శికి హైకోర్టు అక్షింతలు వేసింది.
కాగా 2020లో కొందరు సామాజిక కార్యకర్తలు ఈవిషయమై దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణా హైకోర్టు.. సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పు మేరకు తెలంగాణ విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి 2024 అక్టోబర్ 10న ప్రైవేటు విద్యా సంస్థలకు నోటీసు ఇచ్చి చేతులు దులుపుకోవడంతో మరోసారి ఈ విషయంపై న్యాయస్థానం ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి ప్రశ్నించింది. గుర్తింపుపొందిన ప్రైవేటు విద్యాసంస్థలు యాజమాన్యాలు (ట్రెస్మా) బలహీన వర్గాలకు విద్యాహక్కు చట్టం ప్రకారం 25శాతం సీట్లు నిబంధన అమలు జరిపేది లేదని స్పష్టంగా ప్రకటించారు.
ఈ ప్రకటన విద్యాహక్కు చట్టాన్ని తిరస్కరించడం అవుతుంది. విద్యాహక్కు చట్టం అమలుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గత15 ఏళ్ళుగా అమలుపరచని ఈ నిబంధనతో పాటు, క్యాపిటేషన్ ఫీజు వసూలు చేయడం చట్టవిరుద్ధం. కనుక నిబంధనల అమలులో పారదర్శకత ఉండాలి. విద్యాహక్కుచట్టం నిబంధనలు అమలుకోసం ప్రభుత్వం ఏదైనా వ్యవస్థను నెలకొల్పడం అనే అవసరం ఇప్పుడు ముందుకొచ్చింది. రాజ్యాంగ చట్టంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఈచట్టం వచ్చింది. అనేక ఏళ్ళ పోరాటం మూలంగా వాస్తవంగా విద్యాహక్కు చట్టం -2009లోచట్టంగా ముందుకొచ్చింది. 2010 ఏప్రిల్ నుంచి ఆ చట్టం అమలులోకి వచ్చింది. అప్పటినుంచి 15ఏళ్ళుగా ప్రైవేటు విద్యా సంస్థలు చట్టంలోని సీట్ల రిజర్వేషన్లు అంశాన్ని దాటవేస్తూ అసలు పట్టించుకోలేదు. అంతేకాదు ఆర్టీఇ సెక్షన్ 18 ప్రకారం విద్యార్థుల వద్ద క్యాపిటేషన్ ఫీజు వసూలు చేయరాదని చట్టం నిర్దేశించినప్పటికీ, ప్రైవేటు విద్యా సంస్థలు విపరీతంగా ఫీజులు పెంచి వసూలు చేస్తున్నారు.
ఇక ట్యూషన్ ఫీజు విషయంలో కూడా ప్రైవేటు విద్యా సంస్థలకు నాలుగు రకాల స్లాబులు కాకుండా అందరికీ అందుబాటులో ఉండే ఒకే స్లాబును ప్రభుత్వం నిర్థారించవలసి ఉంది. అప్పుడు మాత్రమే చట్టం నిర్దేశించిన విద్యా సమానత్వంకు అర్థం చేకూరుతుంది. రెండు అంశాలు ప్రైవేటు విద్యాసంస్థలు పట్టించుకొన్న దాఖలాలు లేవు. చట్టం అమలుజరపాలసిన ప్రభుత్వ వర్గాలు కూడా కేవలం నోటీసులిచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు. ఇక ప్రభుత్వ విద్యా సంస్థల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. బోధనా పద్దతులు, మూల్యాంకనం విధానం అమలు జరపడంలో వెనుకబడి పోతున్నాయి.. పదవతరగతి మూల్యాంకనం విషయంలో కూడా చట్టం నిర్దేశించిన విధానంలో కాకుండా 100 మార్కులకు జరిపి విద్యాశాఖ అధికారులు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది..
అయితే విద్యాహక్కు చట్టం ప్రకారం వయస్సు ఆధారిత సామర్థ్యాలు విద్యార్థులకు అందించడం, విద్యలో వెనుకబడ్డవారికి ప్రత్యేక బోధన, మానిటరింగ్ విధానం చట్టంకు అనుగుణంగా ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందుతూ వచ్చాయి. అందులో భాగమే చట్టం వచ్చాక ఆసర్ నివేదికలు విద్యార్థులు నేర్చుకునే సామర్థ్యాలలో వెనుకబడినట్లు నివేదికలు ఇస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా టెట్ లాంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. కానీ, ఉపాధ్యాయ విద్యలో, ఉపాధ్యాయ శిక్షణలో చట్టం అనుగుణమైన మార్పులు చేర్పులుపై ప్రభుత్వాలుగానీ, అధికారులుగానీ దృష్టి పెట్టిన దాఖలాలు లేవు.
ఇక విద్యాహక్కు చట్టం ప్యాట్రన్ ప్రకారం 2+3+3+4 ఇంటర్ విద్యను పాఠశాలలో ప్రవేశపెట్టాలి. ఆఊసే లేదు. విద్యాహక్కు చట్టం సెక్షన్ 13 ప్రకారం 6--14 సంవత్సరాల వయస్సులో చదువుకునే విద్యార్థులకు నాన్-డిటెన్షన్ విధానం అమలు జరపాలని, సెక్షన్ 6 ప్రకారం విద్యార్థులు తమవయస్సు ఆధారిత తరగతిలో ఉండాలని చట్టం స్పష్టంగా నిర్దేశిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆసర్ నివేదిక సాకుగా చూపి, గీతాబుక్కల్ కమిటీ చేసిన ఓ చిన్న వెసులుబాటును ఆసరాగా 5,8 తరగతులకు డిటెన్షన్ విధానం అమలు జరపాలని ప్రకటించింది. అమలు జరిపే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వాలపై మోపింది. అయితే, గీతాబుక్కల్ కూడా తమ నివేదికలో డిటెన్షన్ విధానం అమలు జరపాలని స్పష్టంగా చెప్పలేదు. ఆమెకూడా విద్యా హక్కు చట్టం అమలులో జరుగుతున్న లోపాలను వివరించే సందర్భంలో చివరి అంశంగా డిటెన్షన్ విధానం తీసుకు రావడంపట్ల జాగ్రత్తగా ఆలోచించాలని చెప్పారు.
కానీ, కేంద్రం ఈవిషయంలో 5, 8 తరగతులకు డిటెన్షన్ అమలు జరపాలని స్పష్టంగా ప్రకటించింది. మన తెలుగు రాష్ట్రాలలోనైతే 1971ప్రాంతంలోనే డిటెన్షన్ అప్పటి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం ఈ విధానం ఎత్తివేయడం జరిగింది. 2007లోనే ఏడవతరగతి కామన్ పరీక్ష కూడా ఎత్తేసుకున్నాం. డిటెన్షన్ విధానం ఎత్తివేసిన తర్వాతనే పాఠశాల మానివేసే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అయితే కేంద్రప్రభుత్వం 5, 8 తరగతులకు తిరిగి డిటెన్షన్ విధానం ప్రవేశపెడితే విద్యాహక్కు చట్టం సెక్షన్ 6 నిర్దేశించిన వయస్సు ఆధారిత తరగతి అనే నిబంధనకు తిలోదకాలు ఇచ్చినట్లే! అంతేకాదు! విద్యాహక్కు చట్టం నిర్వచించిన వయస్సు ఆధారిత సామర్థ్యాలు అందజేత, 6--14 వయస్సు పిల్లలకు నిర్భందోచిత ప్రాథమిక విద్య అనబడే విద్యాహక్కు చట్టం మూల సూత్రంకు మంగళం పాడినట్లే అవుతుంది.
నిజానికి 2009 చట్టానికి ఆదిలోనే పాతర పడింది.. ఉచిత విద్యకు పేద విద్యార్థులు నోచుకోవడం లేదు.. 25 శాతం అమలులో విద్యాసంస్థల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.. కోర్టు ఆదేశాలతోనూ ఎలాంటి మార్పు కనిపించడం లేదు.. కనుక ప్రైవేటు విద్యా సంస్థలతో పాటు అన్ని విద్యాసంస్థలు చట్టబద్ధమైన విద్యాహక్కు ఖచ్చితంగా అమలు జరపడానికి ఓ వ్యవస్థను ఏర్పరచాలి. చట్టం అమలుకు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. విద్యాహక్కు చట్టం పటిష్టంగా అమలు జరిపి తీరితేనే సమాన విద్యావకాశాలు సమాజానికి అందుతాయి. కనుక ఆ దిశగా అడుగులు పడాలని ఆశిస్తోంది ఫోరమ్ ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ..