సంగారెడ్డిలో ఘనంగా 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

సంగారెడ్డిలో ఘనంగా 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
సంగారెడ్డి,భారత శక్తి ప్రతినిధి, ఆగస్టు 15: 79 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో శుక్ర వారం నిర్వహించిన వేడుకలు, దేశభక్తి ఉత్సాహంతో, వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రగతి నివేదికను ప్రజలకు చదివి వినిపించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, జిల్లా పంచాయతీ రాజ్, విద్యా శాఖ, వ్యవసాయ శాఖ , డి ఆర్ డి ఓ ఆరోగ్య సంబంధిత పథకాలు, పోలీస్ శాఖ, మున్సిపల్, రెవిన్యూ శాఖల శకటాల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఉత్తమ సేవలందించిన వివిధ శాఖల ఉద్యోగులకు మంత్రి ప్రశంస పత్రాలను అందజేశారు. పోలీస్ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, గ్రామీణ అభివృద్ధి సంస్థ, ఉద్యాన పట్టు పరిశ్రమల శాఖ, మిషన్ భగీరథ, మెప్మా, పశుసంవర్ధక శాఖ, మత్స్యశాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలను మంత్రి , టీ జి ఐ ఐ సి చైర్మెన్,జిల్లా కలెక్టర్ , సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.
 
ఈ సందర్భంగా విద్యాశాఖ సంచార విజ్ఞాన ప్రయోగశాల వాహనాన్ని మంత్రి ప్రారంభించారు. అలాగే హోమ్ అఫైర్స్ విభాగం మొబైల్ ఫోరెన్సిక్స్ వ్యాన్, క్లూస్ టీమ్ వాహనాన్ని కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About The Author