దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో మహిళలది ఎంతో గణనీయమైన పాత్ర
ప్రముఖ సాహితీవేత్త సాహిత్య కళా విభూషణ చౌడూరి నరసింహా రావు
భారత శక్తి ప్రతినిధి, హైదరాబాద్, ఆగస్టు 16: భారత దేశ స్వాతంత్రోద్యమంలో మహిళా మణులు నిర్వహించిన పాత్ర ఎంతో గణనీయమని, కీలకమని, మహిళల త్యాగాలు దేశ స్వాతంత్ర్య చరిత్రలో కోకొల్లలని, వారు ప్రధాన భూమికను పోషించారని ప్రశంసిస్తూ.. నాటి నుంచి నేటి వరకు తల్లిగా, చెల్లిగా, భార్యగా కుటుంబ బాధ్యతలతో పాటు దేశ పౌరురాలిగా వివిధ బాధ్యతలు నిర్వర్తిస్తూ దేశాభివృద్ధికి బాటలు వేస్తున్న మహిళలు నిజంగా అభినందనీయులని వారి త్యాగం నిరుపమానమని ప్రముఖ సాహితీ వేత్త, భారత వికాస్ పరిషత్ గురువందన్ ఛత్రాభినందన్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ చౌడూరి నరసింహారావు అభిప్రాయపడ్డారు. ఈరోజు 79 వస్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నల్లగొండ జిల్లా చిట్యాల లో జరిగిన జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో భారత్ వికాస్ పరిషత్ తెలంగాణ రాష్ట్ర సంపర్క్ వైస్ ప్రెసిడెంట్ రఘు సతీష్ కుమార్ తో పాటు పతాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని, పిమ్మట జరిగిన జనహిత, సెట్విన్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న కుట్టు శిక్షణ కేంద్రంలో జరిగిన బహుమతి ప్రధానం ఉత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఎందరో త్యాగధనుల త్యాగ ఫలితమే నేటి మన స్వాతంత్ర్యమని, ఈ స్వాతంత్య్ర,న్ని దేశ సమగ్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత దేశ పౌరులమైన మనందరి మీద ఉందని బాధ్యతను గుర్తు చేస్తూ.. నేడు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా ముందుకు దూసుకెళుతున్న మహిళలు దేశభద్రతలో సైతం ముందున్నారన్నారు. "ఆపరేషన్ సింధూర్" జరిపి పాకిస్తాన్ తీవ్రవాదులను తుదముట్టించింది అపర చండికలైన ఇద్దరు మహిళాధికారులేనని గుర్తు చేశారు. రాష్ట్రపతి ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీత రఘు సతీష్ కుమార్ అధ్యక్షత వహించి మాట్లాడుతూ.. కుట్టు శిక్షణా కేంద్రంలో సుమారు 120 మంది మహిళలు శిక్షణ పొందుతున్నారని వారికి ఇండిపెండెన్స్ డే సందర్భంగా వివిధ క్రీడలలో పోటీలు పెట్టి వాటిలో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రధానం చేసేందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశానన్నారు. ఈ కార్యక్రమంలో విజేతలకు బహుమతులను అతిథుల చేతుల మీదుగా అందించారు. ముఖ్య అతిథిగా పాల్గొని, చక్కటి సందేశాన్ని అందించిన చౌడూరి నరసింహారావును నిర్వాహకులందరూ శాలువాతో ఘనంగా సత్కరించారు. తర్వాత జరిగిన మహిళల వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతో ఆకట్టుకున్నాయి. కుట్టు ఇన్స్ ట్రక్టర్స్ మహేశ్వరి, సునీత, మంజుల శిక్షణా కేంద్రం కన్వీనర్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు. వారందరినీ అతిథులు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమం ఆద్యంతం ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా సాగింది.