విపత్తును ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలి
మంత్రి దనసరి అనసూయ (సీతక్క)
ములుగు జిల్లా ప్రతినిధి, జులై 23 (భారతశక్తి) : గతంలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండాముందస్తుగా భారీ వర్షాల ప్రభావంతో వచ్చే విపత్తును ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రణాళిక ప్రకారం సిద్ధంగా ఉండాలని గ్రామీణ అభివృద్ధి, పంచాయతీ రాజ్, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అన్నారు.
హెచ్చరిక బోర్డులు ఏర్పాటు... బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అధ్యక్షుతన వరదలపై సంసిద్ధత సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్, డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవి చందర్, అదనపు కలెక్టర్లు మహేందర్ జి, సంపత్ రావు పాల్గొన్న ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు వరద ముప్పును ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యలపై వివరాలను మంత్రి సీతక్క అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి పొర్లు ఉండడంతో పర్యాటకులు జల పాతాళ వద్దకు వెళ్లకుండా కట్టడి చేస్తూ పలు రకాల బొమ్మలతో కూడిన హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. వరదల కారణంగా నష్టపరిహారం చెల్లిస్తామో కానీ ప్రాణాలు మాత్రం తీసుకురాలేమని, నిరంతరం అధికారులు 24 గంటల పాటు విధులను నిర్వహిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.
మన జిల్లాలో వంద కిలోమీటర్ల మేర గోదావరి పరివాహక ప్రాంతం ఉందని ఇతర రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిస్తే ఆ వర్షపు నీరంతా ఇక్కడి ప్రాంతం నుండే తరలిపోతూ గ్రామాలను ముంచేస్తుందని, 1986 సంవత్సరంలో జరిగిన సంఘటన భయాందోళనలు గురిచేసిందని, తిరిగి 2022, 2023 సంవత్సరాలలో పలు రకాల సంఘటనలు జరిగాయని వివరించారు. గతంలో ఇదే ప్రాంతంలో టర్నాడో సుడిగాలి కారణంగా లక్షలాది చెట్లు కూలిపోవడం జరిగిందని, అలాంటి సుడిగాలి గ్రామాల పైకి వస్తే ఎలాంటి విపత్తు జరుగుతుందో ఊహించకుండా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరి నీరు గ్రామాల్లోకి రాకుండా ఏటూరునాగారం, మంగపేట మండల సమీపంలో కరకట్టల నిర్మాణం జరుగుతున్నదని తెలిపారు.
వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు సోకకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, నిరంతరం పారిశుద్ధ కార్యక్రమాలను నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో నిరంతరం వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో ప్రభుత్వ పాఠశాలలు మూసివేయాలని అన్నారు. జిల్లాలో ఎప్పుడూ వరద ముప్పు జరిగిన రాత్రి వేళలో జరుగుతుండడంతో ప్రాణ నష్టం జరుగుతుందని దీనిని దృష్టిలో ఉంచుకొని జరిగే ముప్పును అంచనా వేసి ప్రజలను అప్రమత్తం చేస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలిపారు.
అత్యవసర సమయాలలో డబ్బులను వాడుకోవడానికి కలెక్టర్లకు ఇటీవలనే ముఖ్యమంత్రి ప్రత్యేక నిధులను కేటాయించారని, రాష్ట్రంలోనే ములుగు జిల్లాను రెడ్ జోన్ గా వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారని తెలిపారు. ఈనెల 27 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రభుత్వ ఉద్యోగులు సెలవులపై వెళ్లవద్దని కోరారు. చేపల వేటకు వెళ్లే వారిని కట్టడి చేయాలని, ప్రమాదకరంగా ఉన్న రోడ్లపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని అన్నారు. గ్రామాలలో కురుస్తున్న వర్షం నీటిని బయటి ప్రాంతాలకు తరలించడానికి పలు రకాల వాహనాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ మాట్లాడుతూ : వరద ముప్పును ఎదుర్కొనేందుకు
అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉన్నారని, ముందస్తుగా నాలుగు బోట్లను ఏర్పాటు చేయడంతో పాటు ఎన్ డి ఆర్ ఎఫ్, ఎస్ టి ఆర్ ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. జిల్లాలో 800 పైగా పలు రకాల చెరువులు ఉన్నాయని, ప్రస్తుతం వాటీలో మీరు నిలకడగా ఉందని, లోతట్టు గ్రామాలలోని గర్భిణీ స్త్రీలను పలు ఆస్పత్రులకు తరలించడం జరిగిందని, ముక్కు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని తెలిపారు.
జిల్లా ఎస్పీ శబరిష్ మాట్లాడుతూ: భారీ వర్షాల కారణంగా 11 స్థలాలలో ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉండడంతో ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుని జిల్లా పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉందని, డిడిఆర్ఎఫ్ బలగాలను సిద్ధం చేశామని ఆయన వివరించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.