మురుగు పొంగొద్దు.. నీట మునగొద్దు..

హైదరాబాద్ :

- సిల్ట్ రిమూవల్ పనుల్లో హైడ్రా తలమునకలు.. 
- క్షేత్రస్థాయిలో పరిశీలించిన హైడ్రా కమిషనర్.. 
- కృష్ణానగర్ నివాసితులతో  త్వరలో సమావేశం..

WhatsApp Image 2025-08-30 at 6.47.22 PM

అమీర్ పేట  వద్ద వరద ముప్పు నివారణకు హైడ్రా చర్యలు కొనసాగుతున్నాయి. సంబంధిత శాఖల సహకారంతో పెద్దమొత్తంలో పూడిక తీత పనులు జరుగుతున్నాయి.  ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాంతాల్లో పర్యటించి సమస్య పరిష్కారానికి దిశా నిర్దేశం చేసిన విషయం విధితమే. ఈ క్రమంలోనే అమీర్ పేట తో  పాటు.. కృష్ణానగర్ లోని  వరద ముప్పు ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్  శనివారం మరోసారి పర్యటించారు.  వర్షాల సమయంలో వరద, నిత్యం మురుగు ముంచెత్తే ప్రాంతాలన్నిటినీ కలియదిరిగారు.  

Read More పోలీసు ఉద్యోగం ఎన్నో సవాళ్లతో కూడుకున్నది..

దశాబ్దాలుగా పేరుకుపోయిన పూడికతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నాలాలను పరిశీలించారు.  ఈ నెల 26న పర్యటించి.. నాలాల్లో పూడికతీతకు ఆదేశించిన తర్వాత ఆ ప్రాంతాలలో పనులను పర్యవేక్షించారు. స్థానికులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి ఉన్న అవకాశాలను చర్చించారు.  ఇటీవల హైడ్రా వచ్చి పూడిక తీత పనులను చేపట్టాక పరిస్థితి కొంతమేర మెరుగుపడిందని.. ఈ పనులు కొనసాగించాలని హైడ్రా కమిషనర్ కు  పలువురు విజ్ఞప్తి చేశారు. త్వరలోనే అందరితో సమావేశాన్ని ఏర్పాటు చేసి.. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని హైడ్రా కమిషనర్ హామీ ఇచ్చారు. సంబంధిత శాఖలన్నిటితో సమన్వయంగా పని చేసి.. వారి సహకారంతో వరద ముంచెత్తకుండా చర్యలు తీసుకుంటామని కమిషనర్ చెప్పారు. మురుగు ముంచెత్తే రహదారుల్లో ప్రజలు  పడుతున్న ఇబ్బందులను తొలగిస్తామన్నారు.  పూడిక తీత పనులకు సహకరించిన స్థానికులను కమిషనర్ అభినందించారు. 

Read More కామారెడ్డి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన..

అమీర్ పేటలో  పెద్దమొత్తంలో పూడిక తీత : 
భారీ వర్షం పడినప్పుడల్లా.. నడుం లోతు వరద నీరు నిలవడానికి  అమీర్ పేటలోని మైత్రినగర్, అంటే అమీర్ పేట మెట్రో స్టేషన్ కింద ప్రాంతం చౌరస్తాలో భూగర్భ బాక్సు డ్రైన్లు పూడుకుపోవడమే కారణమని అక్కడి పరిస్థితిని గమనించిన కమిషనర్ భావించారు. జూబ్లీహిల్స్, గాయంత్రి హిల్స్, కృష్ణానగర్ ప్రాంతాల నుంచి సారధీ స్టూడియో పక్కనుంచి వచ్చే కాలువతో పాటు.. యూసఫ్ గూడ, మధురానగర్, శ్రీనివాస్ నగర్ వెస్ట్ నుంచి వచ్చే వరద కాలువలు కలిసి అమీర్ పేట  వద్ద రోడ్డు దాటుతున్నప్పుడు ఇబ్బందులను కూడా పరిశీలించారు. ఎగువ నుంచి భారీమొత్తంలో చెత్త కొట్టుకువచ్చి.. ఇక్కడ భూగర్భ బాక్సు డ్రైన్లు మూడుంటే రెండు పాక్షికంగా.. మూడోది మొత్తం పూడుకుపోవడాన్ని గమనించారు.  శ్రీనివాసనగర్ వెస్ట్ లో  బాక్సు డ్రైన్లను ఓపెన్ చేసి భారీమొత్తంలో జరుగుతున్న పూడిక తీత పనులను పరిశీలించారు.  డ్రైన్ లైన్లకు భారీ మొత్తంలో అడ్డుపడిన పరుపులు, ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు పనులను పర్యవేక్షించారు. 
అమీర్ పేట  ప్రధాన రహదారి కింద ఉన్న బాక్సు డ్రైన్లలో పూర్తిగా పూడుకుపోయిన లైనును కూడా క్లియర్ చేయాలని కమిషనర్ ఆదేశించారు. 
 
జూబ్లీహిల్స్ నుంచి అమీర్ పేట వరకూ పర్యటన : 
జూబ్లీహిల్స్, వెంకటగిరి, కృష్ణానగర్, ఎల్లారెడ్డిగూడ, యూసఫ్ గూడ, మధురానగర్, శ్రీనివాస్ నగర్, శ్రీనగర్ కాలనీల మీదుగా సాగే వరద, మురుగు నీటి కాలువలను హైడ్రా కమిషనర్ పరిశీలించారు. కొన్ని చోట్ల 8 మీటర్ల లోతున్న కాలువలు ఆరేడు అడుగుల మేర పూడుకుపోవడాన్ని గమనించారు. కృష్ణా నగర్ లో  ప్రగతినగర్ వద్ద వరద కాలువలను మొత్తం పూడ్చేసి జరిగిన ఆక్రమణలను వెంటనే తొలగించాలని కమిషనర్ ఆదేశించారు. పైన పేర్కొన్న ప్రాంతాల్లో వరద నీరు నిలవకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. పూడికను మొత్తం తొలగించిన తర్వాత వరద సమస్య చాలా వరకు తగ్గుతుందని తాము భావిస్తున్నామని.. లేని పక్షంలో అన్ని శాఖలతో సమావేశాన్ని నిర్వహించి.. ఇందులో స్థానికులను కూడా భాగస్వామ్యం చేసి.. శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కమిషనర్ చెప్పారు. కృష్ణకాంత్ పార్క్ లో ఉన్న చెరువులను కూడా విస్తరించి వరదను హోల్డ్ చేసే విధంగా తీర్చి దిద్దుతామని అన్నారు.  వందేళ్ల వరకూ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కమిషనర్ పర్యటన ఆధ్యంతం స్థానికులు వెంట ఉండి సమస్యలను వివరించారు. ఈ ప్రాంతాల్లో పలుమార్లు కమిషనర్ పర్యటించి సమస్య పరష్కారానికి చర్యలు తీసుకోవడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. 

Read More ఏరియా హాస్పిటల్ లో అరుదైన చికిత్స

About The Author